Oppo A77s Smartphone । ఒప్పో కొత్త ఫోన్, ఫీచర్లు ఓకే.. మరి ధర సంగతేంటి?
మిడ్-రేంజ్ ఫీచర్లతో ఒప్పో నుంచి Oppo A77s అనే స్మార్ట్‌ఫోన్ విడుదలైంది. మరి ఈ స్మార్ట్‌ఫోన్ అందించే ఫీచర్లకు, దీని ధరకు ఏమైనా సంబంధం ఉందా, లేదా? ఈ స్టోరీ చూసి మీరే విశ్లేషించుకోండి.
చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ ఒప్పో తమ A సిరీస్‌లో మరొక సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. Oppo A77s పేరుతో లాంచ్ అయిన ఈ స్మార్ట్‌ఫోన్‌లో ప్రీమియం ఫీచర్లను అందించారు. ఇందులో భాగంగా మెరుగైన స్క్రీన్ రిఫ్రెష్ రేట్, 50 మెగాపిక్సెల్ AI ప్రైమరీ సెన్సార్ కలిగిన డ్యూయల్ రియర్ కెమెరా సెటప్, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ మొదలైనవి ఉన్నాయి.
ఒప్పో గత జూన్‌లోనే Oppo A77 ని లాంచ్ చేసింది, ఆ తర్వాత ఆగస్టు నెలలో ఇందులో 5G వెర్షన్‌ను ఆవిష్కరించింది. తాజాగా విడుదలైన Oppo A77s ఈ లైనప్‌లో మూడవది. అయితే ఈ కొత్త ఫోన్ 4Gకి మాత్రమే సపోర్ట్ చేస్తుంది, ఇందులో 5G కనెక్టివిటీ లేదు.
స్టోరేజ్ ఆధారంగా Oppo A77s స్మార్ట్‌ఫోన్ ఏకైక 8GB+128GB కాన్ఫిగరేషన్‌లో అందుబాటులో ఉంటుంది. మైక్రో SD కార్డ్ ద్వారా స్టోరేజ్ సామర్థ్యాన్ని 1TB వరకు విస్తరించుకోవచ్చు. వర్చువల్ రూపంలో ర్యామ్‌ను మరో 5GB వరకు పెంచుకోవచ్చు.
Oppo A77s స్టార్రీ బ్లాక్, సన్‌సెట్ ఆరెంజ్ అనే రెండు ఆకర్షణీయమైన కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇంకా ఈ ఫోన్‌లో అందించిన ఫీచర్లు, స్పెసిఫికేషన్ల జాబితా, ధర మొదలైన వివరాలను ఇక్కడ చూడండి.
OPPO A77s స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు
- 90Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 6.56 అంగుళాల HD+ LCD డిస్‌ప్లే
- 8GB RAM, 128GB స్టోరేజ్ సామర్థ్యం
- స్నాప్‌డ్రాగన్ 680 ప్రాసెసర్
- వెనకవైపు 50MP + 2MP డ్యుఎల్ కెమెరా సెటప్; ముందు భాగంలో 8 MP సెల్ఫీ షూటర్
- ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్
- 5000 mAh బ్యాటరీ సామర్థ్యం, 33W Supervooc ఛార్జర్
కనెక్టివిటీ పరంగా డ్యూయల్-సిమ్ కార్డ్ స్లాట్, డ్యూయల్-బ్యాండ్ WiFi, బ్లూటూత్ v5.0, USB టైప్-C పోర్ట్, 3.5mm హెడ్‌ఫోన్ జాక్, ఫింగర్ ప్రింట్ సెన్సార్ మొదలైనవి ఉన్నాయి.
ధర, రూ. 17,999/-
ఈ ఫోన్ అక్టోబర్ 7 నుండి అన్ని ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ స్టోర్లలో కొనుగోలుదారులకు అందుబాటులో ఉంటుంది. 10% వరకు క్యాష్ బ్యాక్ ఆఫర్లు ఉన్నట్లు కంపెనీ పేర్కొంది.
సంబంధిత కథనం