Ola Electric: రోడ్ స్టర్ సిరీస్ ఎలక్ట్రిక్ బైక్స్ ను లాంచ్ చేసిన ఓలా ఎలక్ట్రిక్; ధర కూడా తక్కువే..-ola electric launches the roadster series e motorcycles prices start at rs 74999 ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Ola Electric: రోడ్ స్టర్ సిరీస్ ఎలక్ట్రిక్ బైక్స్ ను లాంచ్ చేసిన ఓలా ఎలక్ట్రిక్; ధర కూడా తక్కువే..

Ola Electric: రోడ్ స్టర్ సిరీస్ ఎలక్ట్రిక్ బైక్స్ ను లాంచ్ చేసిన ఓలా ఎలక్ట్రిక్; ధర కూడా తక్కువే..

HT Telugu Desk HT Telugu
Aug 15, 2024 03:31 PM IST

ఎలక్ట్రిక్ స్కూటర్స్ సెగ్మెంట్లో మార్కెట్ లీడర్ గా ఉన్న ఓలా ఎలక్ట్రిక్ సంస్థ లేటెస్ట్ గా రోడ్ స్టర్ సిరీస్ ఎలక్ట్రిక్ బైక్స్ ను లాంచ్ చేసింది. వీటిలో రోడ్ స్టర్ ఎక్స్, రోడ్ స్టర్ 2.5 కిలోవాట్, రోడ్ స్టర్ ప్రో ఉన్నాయి. ఓలా ఎలక్ట్రిక్ రోడ్ స్టర్ ఎక్స్ మోడల్ ప్రారంభ ధర రూ.74,999 గా నిర్ణయించారు.

రోడ్ స్టర్ సిరీస్ ఎలక్ట్రిక్ బైక్స్ ను లాంచ్ చేసిన ఓలా ఎలక్ట్రిక్
రోడ్ స్టర్ సిరీస్ ఎలక్ట్రిక్ బైక్స్ ను లాంచ్ చేసిన ఓలా ఎలక్ట్రిక్

Ola Electric bikes: ఓలా ఎలక్ట్రిక్ అధికారికంగా రోడ్ స్టర్ సిరీస్ ఎలక్ట్రిక్ మోటార్ సైకిళ్లను విడుదల చేసింది. ఓలా ఎలక్ట్రిక్ సీఈఓ భవీష్ అగర్వాల్ రోడ్ స్టర్ ఎక్స్, రోడ్ స్టర్, రోడ్ స్టర్ ప్రో అనే మూడు కొత్త మోడళ్లను గురువారం, ఆగస్టు 15, 2024 న ఆవిష్కరించారు. జెన్ 3 ప్లాట్ ఫామ్ ఆధారంగా కంపెనీ మొట్టమొదటి ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ సిరీస్ ను రూపొందించింది. ఓలా ఎలక్ట్రిక్ ప్రస్తుతం భారతదేశంలో అత్యధిక ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయిస్తోంది.

డెలివరీలో జనవరిలో..

ఓలా ఎలక్ట్రిక్ (OLA ELECTRIC) రోడ్ స్టర్ ఎక్స్, రోడ్ స్టర్ బైక్ ల డెలివరీలు వచ్చే ఏడాది జనవరిలో ప్రారంభం కానున్నాయి. అయితే రోడ్ స్టర్ ప్రో కోసం ఆసక్తి కలిగిన కస్టమర్లు 2025 దీపావళి వరకు వేచి ఉండాల్సి ఉంటుంది. అయితే అన్ని మోడళ్లకు బుకింగ్ లు ఈ రోజు నుంచే ప్రారంభమయ్యాయి.

ఓలా ఎలక్ట్రిక్ రోడ్ స్టర్ ఎక్స్

ఓలా ఎలక్ట్రిక్ ఈ రోజు విడుదల చేసిన మూడు మోడల్స్ లో రోడ్ స్టర్ ఎక్స్ అత్యంత బడ్జెట్ ఫ్రెండ్లీ వెర్షన్. దీని ప్రారంభ ఎక్స్ షో రూమ్ ధర రూ .74,999 గా నిర్ణయించారు. ఇందులో 2.5 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. దీనిని ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 200 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. ఈ మోటార్ సైకిల్ గరిష్ట వేగం గంటకు 124 కిలోమీటర్లు. ఇది 2.8 సెకన్లలో గంటకు 0-40 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఓలా రోడ్ స్టర్ ఎక్స్ లో 18 అంగుళాల అల్లాయ్ వీల్స్, 4.3 అంగుళాల టచ్ స్క్రీన్ డిస్ ప్లే ఉన్నాయి.

ఓలా రోడ్ స్టర్

ఓలా ఎలక్ట్రిక్ ఈ రోజు విడుదల చేసిన మూడు మోడల్స్ లో మిడ్ వేరియంట్ ‘రోడ్ స్టర్’. ఇందులో 2.5 కిలోవాట్ వేరియంట్ ప్రారంభ ధర రూ.1,04,999 గా, 4.5 కిలోవాట్ వేరియంట్ ధర రూ.1,19,999, 6 కిలోవాట్ వేరియంట్ ప్రారంభ ధర రూ.1,39,999 గా నిర్ణయించారు. ఇది గరిష్టంగా గంటకు 126 కిలోమీటర్ల వేగంతో వెళ్లగలదు. 0-40 కిలోమీటర్ల వేగాన్ని ఈ ఓలా రోడ్ స్టర్ బైక్ 2.2 సెకన్లలో అందుకుంటుంది. రోడ్ స్టర్ లో 7-అంగుళాల టచ్ స్క్రీన్ ఉంటుంది. డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్ ఉంటాయి.

ఓలా ఎలక్ట్రిక్ రోడ్ స్టర్ ప్రో

ఓలా ఎలక్ట్రిక్ ఈ రోజు విడుదల చేసిన మూడు మోడల్స్ లో టాప్ వేరియంట్ రోడ్ స్టర్ ప్రో. ఇందులో 8 కిలోవాట్ వేరియంట్ ప్రారంభ ధర రూ.1,99,999 కాగా, 16 కిలోవాట్ వేరియంట్ ధర రూ.2,49,999 గా నిర్ణయించారు. ఈ మోడల్ కు ఇతర రెండు వేరియంట్ల కంటే చాలా ఎక్కువ ధరను నిర్ణయించారు. ఈ మోటార్ సైకిల్ గరిష్ట వేగం గంటకు 194 కిలోమీటర్లు. ఇది కేవలం 1.2 సెకన్లలో గంటకు 0-40 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. సింగిల్ ఛార్జ్ తో 579 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. రోడ్ స్టర్ ప్రోలో అడ్వాన్స్ డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS), 10 అంగుళాల టచ్ స్క్రీన్ ఉన్నాయి.

ఓలా ఎలక్ట్రిక్ అప్ డేట్స్

ఓలా ఎలక్ట్రిక్ తమ ఎలక్ట్రిక్ వాహనాల కోసం కొత్త సాఫ్ట్ వేర్ అప్ డేట్ మూవ్ ఓఎస్ 5 (MoveOS 5) ను ప్రవేశపెట్టింది. ఓలా మ్యాప్స్ ఇప్పుడు గ్రూప్ నావిగేషన్ ను కలిగి ఉంటుందని ఓలా ఎలక్ట్రిక్ ప్రకటించింది. ఓలా స్కూటర్లలో ఇప్పుడు ఏఐ ఆధారిత టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS), క్రుట్రిమ్ ఏఐ అసిస్టెంట్ లభిస్తాయి.

Whats_app_banner