Ola Electric IPO : ఓలా ఎలక్ట్రిక్ ఐపీఓపై కీలక అప్డేట్- ప్రైజ్ బ్యాండ్ ఎంతంటే..
Ola Electric IPO price band : ఓలా ఎలక్ట్రిక్ ఐపీఓకి సంబంధించి కీలక అప్డేట్. ఐపీఓ ప్రైజ్ బ్యాండ్‌తో పాటు ఇతర వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
దేశీయ స్టాక్ మార్కెట్లో ఇప్పుడు ఓలా ఎలక్ట్రిక్ ఐపీఓపైనే చర్చలు జరుగుతున్నాయి. ఈ ఏడాది వస్తున్న అతిపెద్ద ఐపీఓగా గుర్తింపు పొందిన ఈ ఓలా ఎలక్ట్రిక్ ఐపీఓ ప్రైజ్బ్యాండ్పై పలు వార్తలు బయటకి వచ్చాయి. ఓలా ఎలక్ట్రిక్ షేర్ల ప్రైజ్ బ్యాండ్ రూ. 72- రూ. 76 ఉంటుందని సమాచారం.
భారతీయ ఈవీ సంస్థ నుంచి వస్తున్న తొలి ఆఫరింగ్ ఈ ఓలా ఎలక్ట్రిక్ ఐపీఓ. దీని విలువ సుమారు 740 మిలియన్ డాలర్లు ఉంటుందని అంచనాలు ఉన్నాయి. క్లీన్ వెహికిల్స్ అమ్మకాలు తక్కువగానే ఉన్నప్పటికీ, ఈ-స్కూటర్ మార్కెట్లో ఓలా ఎలక్ట్రిక్ రారాజుగా కొనసాగుతోంది. అందుకే ఈ సంస్థ నుంచి వస్తున్న ఐపీఓకి మంచి డిమాండ్ ఉంటుందని అంచనాలు ఉన్నాయి.
ఫైనాన్షియల్ ఎక్స్‌ప్రెస్‌లో కంపెనీ చేసిన ఒక ప్రకటన ప్రకారం ఓలా ఎలక్ట్రిక్ ప్రైజ్ బ్యాండ్ 72-76 రూపాయలని తేలింది. ఐపీఓలో బిడ్డింగ్ చేస్తున్న అర్హులైన ఉద్యోగులకు ప్రతి షేరుకు 7 రూపాయల డిస్కౌంట్ సైతం ఉంది.
ఆగస్టు 1 నుంచి ఆగస్టు 6 వరకు సబ్స్క్రిప్షన్స్ కోసం ఈ ఐపీఓ ఓపెన్ అవుతుంది. ఆగస్ట్ 1న యాంకర్ రౌండ్ ఉండనుంది. ఆగస్ట్ 2 నుంచి 6 వరకు సబ్స్క్రిప్షన్స్ జరగనున్నాయి.
ఫిడిలిటీ, నోమురా, నార్జెస్ బ్యాంక్‌లతో పాటు పలు భారతీయ మ్యూచువల్ ఫండ్స్ నుంచి ఇన్వెస్టర్ల బిడ్లను ఆహ్వానించనున్నట్లు రాయిటర్స్ తెలిపింది.
ఓలా ఐపీఓ ద్వారా 660 మిలియన్ డాలర్లను సమీకరించేందుకు కొత్త షేర్లను జారీ చేయడంతో పాటు వ్యవస్థాపకుడు భవిష్ అగర్వాల్ సహా ప్రస్తుత ఇన్వెస్టర్లు 80 మిలియన్ డాలర్ల వాటాను ఐపీఓ ఇన్వెస్టర్లకు విక్రయించనున్నారు.
వ్యవస్థాపకుడు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ భవీష్ అగర్వాల్ ఐపీఓ లిస్టింగ్‌లో 37.9 మిలియన్ షేర్లను విక్రయించనున్నారు. అయితే 2023 సెప్టెంబర్‌లో చివరి ఫండింగ్ రౌండ్‌తో పోలిస్తే వాల్యుయేషన్ అంచనా 18.5 శాతం నుంచి 22 శాతం తక్కువ ఉంటుందని అంచనాలు ఉన్నాయి.
ఐపీఓలో 10 శాతం రిటైల్ ఇన్వెస్టర్లకు కేటాయిస్తామని ఆ పత్రిక ప్రకటనలో పేర్కొంది. ఈ ఐపీఓ ద్వారా వచ్చే మొత్తాన్ని మూలధన వ్యయానికి, పరిశోధన, అభివృద్ధికి వినియోగించనున్నారు.
ఈ ఓలా ఎలక్ట్రిక్ ఐపీఓకి సంబంధించిన పూర్తి వివరాలపై ఇంకా క్లారిటీ లేదు. ఒకటి రెండు రోజుల్లో స్పష్టత వస్తుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
2024-25 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో ఓలా ఎలక్ట్రిక్ మార్కెట్ వాటా 50 శాతంగా ఉందని మింట్ ఇంతకు ముందు నివేదించింది. ప్రస్తుత సామర్థ్య గణాంకాల ప్రకారం, కంపెనీ 1 మిలియన్ వాహనాలను తయారు చేయగలదు. టీవీఎస్ మోటార్స్, బజాజ్ ఆటో, ఏథర్ ఎనర్జీ వంటి ఇతర మార్కెట్ ఆపరేటర్లతో ఓలా ఎలక్ట్రిక్ పోటీ పడుతోంది.
సంబంధిత కథనం