NPS Vatsalya : రేపే ఎన్‌పీఎస్ వాత్సల్య స్కీమ్ లాంచ్.. ఈ పథకానికి అర్హతలు, ప్రయోజనాలు ఏంటి?
NPS Vatsalya Scheme : ఎన్‌పీఎస్-వాత్సల్య యోజనను సెప్టెంబర్ 18న దిల్లీలో ప్రారంభించనున్నారు. ఈ పథకం ద్వారా మైనర్లుగా ఉన్నవారికి లబ్ధి చేకూరనుంది. ఈ పథకానికి అర్హులు ఎవరు? దీని ప్రయోజనాలు ఏంటీ తెలుసుకుందాం?
ఎన్పీఎస్ వాత్సల్య పథకం ప్రత్యేకంగా బాలబాలికల కోసం రూపొందించారు. ఈ కొత్త పథకం కింద, తల్లిదండ్రులు తమ పిల్లలకు ఖాతాలను తెరవవచ్చు. వారి పదవీ విరమణ పొదుపుకు సహకరించవచ్చు. ఇది వారికి మరింత ఆర్థిక బలాన్ని ఇస్తుంది.
'NPS-వాత్సల్య మైనర్‌ల తల్లిదండ్రులు, సంరక్షకులకు బహుమతిగా పరిచయం చేస్తున్నాం. పిల్లలకు నిర్దిష్ట వయస్సు వచ్చిన తర్వాత, వారి కోరిక మేరకు పథకాన్ని సాధారణ NPS ఖాతాగా మార్చవచ్చు.' అని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు.
తల్లిదండ్రులు, సంరక్షకులు, భారతీయ పౌరులు, NRIలు అందరూ తమ మైనర్ పిల్లల కోసం ఎన్‌పీఎస్ వాత్సల్య ఖాతాను తెరవడానికి అర్హులు. పథకం ముఖ్యమైన లక్షణం మైనర్‌కు 18 ఏళ్లు నిండిన తర్వాత ఖాతాను సాధారణ NPS ఖాతాగా మార్చుకునే అవకాశం ఉంటుంది. ఇది లేటెర్మ్ రిటైర్మెంట్ ప్లాన్‌కి సాఫీగా మారడానికి వీలు కల్పిస్తుంది.
తల్లిదండ్రులు పిల్లల కోసం పొదుపు చేయవచ్చు. వయస్సు వచ్చిన తర్వాత పిల్లల ఖాతా సాధారణ NPS ఖాతాగా మారుతుంది. ఇది దీర్ఘకాలిక పెట్టుబడి పథకంగా చెప్పవచ్చు. దీనితో ముందుగానే పెట్టుబడి ప్రారంభించేందుకు అవకాశం ఉంటుంది. రిటైర్మెంట్ నాటికి పెద్ద మెుత్తంలో డబ్బు చేతికి అందుతుంది. ఎన్‌పీఎస్‌లో టైర్ 1, టైర్ 2 ఖాతాలు ఉంటాయి. టైర్ 1 ప్రాథమిక పింఛను. టైర్ 2 స్వచ్ఛంద పొదుపు పథకంగా చూడవచ్చు.
ఎన్‌పీఎస్‌లో పెట్టుబడితో సెక్షన్ 8సీసీడీ(1బీ) కింద రూ.50వేల వరకూ పన్ను మినహాయింపు ఉంటంది. సెక్షన్ 80సీ పరిమితి లక్షా 50 వేలకు ఇది అదనం. తల్లిదండ్రులు పిల్లల పేరు మీద సంవత్సరానికి రూ .1,000 పెట్టుబడి పెట్టడానికి కూడా అనుమతిస్తుందని అంటున్నారు. పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్ మెంట్ అథారిటీ (పీఎఫ్ ఆర్ డీఏ) ఆధ్వర్యంలో ఈ పథకాన్ని అమలు చేయనున్నారు.
ఎన్‌పీఎస్ వాత్సల్య ప్రయోజనాలు
చిన్న వయస్సులో పెట్టుబడి పెడితే చక్రవడ్డీని పొందడం ద్వారా కాలక్రమేణా గణనీయమైన పెరుగుదలను చూడవచ్చు.
మీ పిల్లలు రిటైర్ అయ్యేంత వయస్సు వచ్చే వరకు పెద్ద రిటైర్మెంట్ ఫండ్ ఉంటుంది.
చిన్న వయసులోనే పిల్లల్లో పొదుపు అలవాట్లను పెంపొందిస్తుంది.
దీర్ఘకాలిక పెట్టుబడుల ప్రాముఖ్యతను అర్థం చేసుకోవడానికి పిల్లలకు సహాయపడుతుంది.
పిల్లలకు 18 ఏళ్లు నిండిన తర్వాత ఖాతాను సులభంగా సాధారణ ఎన్పీఎస్ ఖాతాగా మార్చుకోవచ్చు.
కొన్ని ఆదాయపు పన్ను నిబంధనలు ఎన్పీఎస్‌కు మినహాయింపునకు అనుమతిస్తాయి.
రిటైర్మెంట్ తర్వాత కార్పస్‌లో కొంత భాగాన్ని పన్ను లేకుండా ఉపసంహరించుకోవచ్చు.
సెప్టెంబర్ 18న పథకం ఆవిష్కరణలో భాగంగా దేశవ్యాప్తంగా దాదాపు 75 ప్రాంతాల్లో ఏకకాలంలో ఎన్‌పీఎస్ వాత్సల్య కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. భారతదేశ భవిష్యత్ తరాన్ని మరింత ఆర్థికంగా సురక్షితంగా, స్వతంత్రంగా మార్చడానికి ఇది ఒక పెద్ద ముందడుగు అని పేర్కొంది.