Sleep and Money: ప్రశాంతంగా నిద్రపోవాలనుందా? అయితే డబ్బు పొదుపు చేయండి, కొత్త అధ్యాయం ఇదే విషయాన్ని చెబుతోంది
Sleep and Money: రాత్రిపూట ప్రశాంతంగా నిద్రపోతేనే రోజంతా పనిచేయగలరు. కానీ ఎంతోమంది రాత్రి నిద్రపోయేందుకు ఇబ్బంది పడుతున్నారు. ప్రశాంతంగా నిద్రపట్టాలంటే డబ్బులు పొదుపు చేయాలని చెబుతోంది కొత్త అధ్యయనం.
Sleep and Money: ప్రతినెలా ఎంతో కొంత డబ్బును ఆదా చేసేవారు ప్రశాంతంగా నిద్రపోతారని ఒక కొత్త పరిశోధన తేల్చింది. ప్రతిరోజు లేదా ప్రతి వారం ఆదా చేయాల్సిన అవసరం లేదు, మీకు వచ్చే నెల జీతం లోంచి కొంత మొత్తాన్ని పొదుపు చేయండి చాలు. కొన్ని నెలలకు అది రెట్టింపు అవుతూ వస్తుంది. అప్పుడు మీకు చాలా ప్రశాంతంగా ఉంటుంది. చక్కగా నిద్ర పడుతుంది. ఈ విషయాన్ని ఒక కొత్త అధ్యయనం చెబుతోంది. కావాలంటే ఒక ఆరునెలలు పొదుపు చేసి చూడండి... మీరు ఎంత ప్రశాంతంగా ఉంటారో.
డబ్బుతో ప్రశాంతత
బ్రిస్టల్ విశ్వవిద్యాలయంలోని విద్యావేత్తలు చేసిన ఒక అధ్యయనంలో ఈ కొత్త విషయం తేలింది. ఎవరైతే నెలవారీగా కొంత మొత్తాన్ని పొదుపు చేస్తారో, వారు ఇతరుల కంటే చాలా ప్రశాంతంగా జీవిస్తున్నట్టు ఈ అధ్యయనం తెలిపింది. ఆదాయం తక్కువ ఉన్నా కూడా క్రమం తప్పకుండా ప్రతి నెలా ఆదా చేస్తే వారు సంతృప్తిగా జీవిస్తున్నట్టు, సంతృప్తిగా నిద్రపోతున్నట్టు, తాము ధనవంతులుగా భావిస్తున్నట్టు ఈ పరిశోధనలో తేలింది.
ఇంటి ఖర్చులు, ఇంటి ఈఎమ్ఐలు, తినేందుకు అయ్యే ఖర్చులు, స్కూల్ ఫీజులు... ఇవన్నీ పోగా మిగిలేది నెలలో తక్కువ మొత్తమే. తక్కువ మొత్తమే అయినా ప్రతినెలా పొదుపు చేయడం వల్ల మీరు మానసికంగా సంతృప్తిగా జీవించగలుగుతారు. అత్యవసరంలో మీ దగ్గర డబ్బు ఉందనే ఒక ధీమా.. మిమ్మల్ని ప్రశాంతంగా నిద్రపోయేలా చేస్తుంది. అందుకే పొదుపు చేయడం అనేది అలవాటు చేసుకోవాలని అంతర్జాతీయ శాస్త్రవేత్తలు కూడా చెబుతున్నారు.
పొదుపు చేస్తే నిద్ర పడుతుంది
డబ్బు గురించి ఆందోళన, అప్పు చేయాల్సి వస్తుందేమో అన్న భయం మిమ్మల్ని ప్రశాంతంగా నిద్రపోనివ్వవవు. అవి మానసిక సమస్యలకు కూడా కారణం అవుతాయని ఈ అధ్యయనం చెబుతోంది. ఈ పరిశోధనలో భాగంగా పదేళ్ల పాటు కొన్ని రకాల అధ్యయనాలను పరిశీలించారు పరిశోధకులు. అందులో పొదుపు చేసిన వారు ప్రశాంతంగా నిద్రపోతున్నట్టు గమనించారు. ఎప్పుడైతే మీ బ్యాంకు బ్యాలెన్స్ స్థిరంగా ఉంటుందో, మీ జీవితంలో సంతృప్తి కూడా పెరుగుతుంది. పొదుపు చేయడం అనేది మీ మానసిక ఆరోగ్యం పై ఎంతో ప్రభావాన్ని చూపిస్తుంది.
అందుకే దీన్ని ప్రయోగాత్మకంగా చేయాలనుకుంటే మీరు కూడా ఒక 6 నెలల పాటు ప్రతినెలా కొంత మొత్తాన్ని సేవ్ చేసి చూడండి. ఎంత ప్రశాంతంగా మీరు నిద్రపోతారో మీకే అర్థమవుతుంది. అకస్మాత్తుగా ఉద్యోగం కోల్పోయినా లేక తల్లిదండ్రుల ఆరోగ్యం కోసం అవసరం వచ్చినా... వెంటనే మీకు మానసిక ఒత్తిడి రాకుండా ఉంటుంది. ఎప్పుడైతే పొదుపు చేయరో... అప్పుడు బ్యాంక్ బ్యాలెన్స్ ఖాళీగా ఉంటుంది. అప్పుడు అవసరానికి డబ్బులు లేక తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురవుతారు. దీని వల్లే నిద్రలేమి వంటి సమస్యలు వస్తూ ఉంటాయి.
ప్రతి నెలా కొంత మొత్తంలో పొదుపు చేయడం వల్ల మీ అవసరానికి ఆ డబ్బులు ఉపయోగపడతాయి. దీనివల్ల మీరు కంగారు పడకుండా ప్రశాంతంగా జీవించగలుగుతారు.
కొన్ని పొదుపు పథకాలలో డబ్బులను పొదుపు చేయడం, అధిక వడ్డీ వచ్చే పథకాలను కట్టడం వంటివి చేయండి. ఫిక్స్డ్ డిపాజిట్లు వేసినా కూడా హఠాత్తుగా అవసరమైతే వాటిని మీరు తిరిగి తీసుకోవచ్చు. అలాగే నెలవారీగా కూడా ఇంట్లో కొంత మొత్తాన్ని పొదుపు చేయడానికి ప్రయత్నించండి. ఇవన్నీ కూడా మీలో మానసిక ఒత్తిడిని తగ్గించి, మంచి ఆరోగ్యాన్ని అందిస్తాయి. ప్రశాంతంగా నిద్రపోయేలా చేస్తాయి.