Nokia C32: బడ్జెట్ ధరలో నోకియా నుంచి మరో ఫోన్ వచ్చేసింది: వివరాలివే
Nokia C32: నోకియా సీ32 భారత మార్కెట్‍లో లాంచ్ అయింది. బడ్జెట్ ధరలో అడుగుపెట్టింది. ఇప్పటికే సేల్ కూడా మొదలైంది.
Nokia C32 launched: పాపులర్ బ్రాండ్ నోకియా నుంచి బడ్జెట్ ధరలో మరో మొబైల్ లాంచ్ అయింది. భారత మార్కెట్‍లో నోకియా సీ32 విడుదలైంది. సీ31కు సక్సెసర్‌గా ఈ నయా ఫోన్ అడుగుపెట్టింది. గతంలో గ్లోబల్‍గా విడుదలైన ఫోన్ ఇప్పుడు ఇండియాకు వచ్చింది. గ్లాస్ బ్యాక్ ఉండడం ఈ నోకియా సీ32 4జీ ఫోన్‍కు హైలైట్‍గా ఉంది. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో వచ్చింది. ఇప్పటికే ఈ ఫోన్ సేల్‍కు కూడా వచ్చింది. నోకియా సీ32 ధర, సేల్, పూర్తి స్పెసిఫికేషన్లను ఇక్కడ చూడండి.
నోకియా సీ32 ధర, సేల్
Nokia C32 Price in India: నోకియా సీ32 ఫోన్ రెండు వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది. ఈ మొబైల్ 4జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.8,999, 4జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ టాప్ వేరియంట్ ధర రూ.9,499గా ఉంది. నోకియా ఇండియా అధికారిక ఆన్‍లైన్ స్టోర్ (nokia.com)లో ఈ మొబైల్ సేల్‍కు వచ్చింది. ఆఫ్‍లైన్ స్టోర్లలోనూ లభిస్తుంది. మింట్, చార్కోల్, బీచ్ పింక్ కలర్ ఆప్షన్‍లలో లభిస్తోంది.
నోకియా సీ32 స్పెసిఫికేషన్లు
Nokia C32: 6.5 ఇంచుల హెచ్‍డీ+ డిస్‍ప్లేను నోకియా సీ32 కలిగి ఉంది. 60హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటుంది. డిస్‍ప్లేపై 2.5D గ్లాస్ ఉంటుంది. గ్లాస్ బ్యాక్ ప్యానెల్‍తో ఈ ఫోన్ వచ్చింది. అలాగే మెటల్ చేసిస్ ఉంటుంది. రూ.10వేలలోపు ధరలో గ్లాస్ బ్యాక్‍తో రావడం ఈ ఫోన్‍కు హైలైట్‍గా ఉంది. నీటి జల్లుల నుంచి రక్షణగా ఉండే IP52 రేటింగ్‍ను కూడా ఈ ఫోన్ కలిగి ఉంది.
Nokia C32: నోకియా సీ32 మొబైల్‍లో యునిఎస్‍ఓసీ ఎస్‍సీ9863ఏ (Unisoc SC9863A) ప్రాసెసర్ ఉంది. ఇంటర్నల్ స్టోరేజీని ఉపయోగించుకొని వర్చువల్‍గా 3జీబీ వరకు ర్యామ్‍ను పొడిగించుకోచ్చు. మైక్రోఎస్డీ కార్డు స్లాట్ కూడా ఉంటుంది. ఆండ్రాయిడ్ 13 (Android 13) ఆపరేటింగ్ సిస్టమ్‍తో వచ్చింది.
Nokia C32: నోకియా సీ32 వెనుక రెండు కెమెరాలు ఉన్నాయి. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, మరో 2 మెగాపిక్సెల్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాతో ఈ ఫోన్ వచ్చింది. ఇక ఫింగర్ ప్రింట్ స్కానర్ పవర్ బటన్‍కే ఉంటుంది.
Nokia C32: నోకియా సీ32 ఫోన్‍లో 5,000mAh బ్యాటరీ ఉంది. 10 వాట్ చార్జింగ్‍కు సపోర్ట్ చేస్తుంది. బాక్సులో చార్జర్ ఉంటుంది. ఈ ఫోన్ బరువు 199.4 గ్రాములుగా ఉంది.