Sales Data : ఆగస్టు నెలలో పడిపోయిన మారుతి సుజుకి, టాటా మోటార్స్ అమ్మకాలు.. షేర్ల ధరపై ఎఫెక్ట్!-maruti suzuki reports 3 9 percentage decline in august sales tata motors witnesses 8 percent dip effect on share price ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Sales Data : ఆగస్టు నెలలో పడిపోయిన మారుతి సుజుకి, టాటా మోటార్స్ అమ్మకాలు.. షేర్ల ధరపై ఎఫెక్ట్!

Sales Data : ఆగస్టు నెలలో పడిపోయిన మారుతి సుజుకి, టాటా మోటార్స్ అమ్మకాలు.. షేర్ల ధరపై ఎఫెక్ట్!

Anand Sai HT Telugu
Sep 01, 2024 08:00 PM IST

Maruti Suzuki and TATA Motors Sales : దేశీయ ఆటోమొబైల్ తయారీ సంస్థలు మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్, టాటా మోటార్స్ లిమిటెడ్ 2024 ఆగస్టులో అమ్మకాలు క్షీణించాయి. మారుతి సుజుకి ఇండియా అమ్మకాలు దాదాపు 3.9 శాతం తగ్గాయి. టాటా మోటార్స్ అమ్మకాల గణాంకాలలో 8 శాతం పడిపోయాయి.

ఆగస్టులో మారుతి సుజుకి, టాటా మోటర్స్ అమ్మకాలు
ఆగస్టులో మారుతి సుజుకి, టాటా మోటర్స్ అమ్మకాలు (AFP)

దిగ్గజ ఆటోమెుబైల్ తయారీ సంస్థలైన మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్, టాటా మోటార్స్ లిమిటెడ్ అమ్మకాలు ఆగస్టు నెలలో పడిపోయాయి. మారుతి సుజుకి ఇండియా 2024 ఆగస్టులో 181,782 యూనిట్ల అమ్మకాలను చేసింది. 2023 ఆగస్టు నెలలో చూసుకుంటే.. 189,082 యూనిట్లు అమ్ముడయ్యాయి. దేశీయంగా 1,45,570 యూనిట్లు విక్రయించగా, 26,003 యూనిట్లు ఎగుమతి అయ్యాయి.

ఇక మారుతి సుజుకి ఇండియా షేరు శుక్రవారం ట్రేడింగ్ సెషన్ తర్వాత 0.24 శాతం తగ్గి రూ.12,421.25 వద్ద ముగిసింది. మినీ, కాంపాక్ట్ కార్లను కవర్ చేసే చిన్న కార్ల విభాగంలో అమ్మకాల గణాంకాలు పడిపోవడంతో ఆగస్టు అమ్మకాల క్షీణత కొనసాగింది. 2024 ఆగస్టులో అమ్మకాలు 18.85 శాతం క్షీణించి 68,699 యూనిట్లకు పరిమితమయ్యాయని సేల్స్ డేటా తెలిపింది.

ఆగస్టులో కంపెనీ దేశీయ విక్రయాలు 8.4 శాతం క్షీణించి 1,43,075 యూనిట్లకు పడిపోయాయి. మారుతి సుజుకి ఎగుమతులు 2024 ఆగస్టులో 5.64 శాతం వృద్ధితో 26,003 యూనిట్లకు చేరుకున్నాయని కంపెనీ తెలిపింది.

మరోవైపు టాటా మోటార్స్ 2024 ఆగస్టులో 70,006 యూనిట్ల అమ్మకాలను చూసింది. అంతకుముందు సంవత్సరం ఇదే కాలంలో 76,261 యూనిట్లతో పోలిస్తే ఇది తక్కువ. కంపెనీ డేటా ప్రకారం.. 2024 ఆగస్టులో కంపెనీ వాణిజ్య వాహనాల అమ్మకాలు 15 శాతం క్షీణించి 27,207 యూనిట్లకు చేరుకున్నాయి. 2024 ఆగస్టులో ప్యాసింజర్ వాహన విక్రయాలు ఏడాది ప్రాతిపదికన 3 శాతం క్షీణించి 44,142 యూనిట్లకు పరిమితమయ్యాయి.

టాటా మోటార్స్ షేరు శుక్రవారం ట్రేడింగ్ సెషన్ తర్వాత 0.92 శాతం క్షీణించి రూ.1,109.40 వద్ద ముగిసింది.