Stock Market : ఈ ఒక్క కారణంగా రెండు రోజుల్లో 29 శాతానికి పైగా పెరిగిన ఎన్ఐఐటీ కంపెనీ షేరు
NIIT Company Share Price : ఎన్ఐఐటీ లిమిటెడ్‌లో 8 లక్షల షేర్లను కొనుగోలు చేశారు ప్రముఖ ఇన్వెస్టర్ రమేష్ దమానీ. ఒక్కో షేరుకు సగటున రూ.127.50 చొప్పున దమానీ ఈ షేర్లను కొన్నారు. దీంతో రెండు రోజుల్లో ఎన్ఐఐటీ కంపెనీ షేర్లు 29 శాతానికి పైగా పెరిగాయి.
స్మాల్ క్యాప్ కంపెనీ ఎన్ఐఐటీ లిమిటెడ్ షేర్లు లాభాల్లో ముగిశాయి. సోమవారం ఎన్ఐఐటీ లిమిటెడ్ షేరు ధర 20 శాతం పెరిగి రూ.153.90 వద్ద ముగిసింది. శుక్రవారం ఎన్ఐఐటీ షేర్లతో జరిగిన బ్లాక్ డీల్ లో కొనుగోలుదారుగా ప్రముఖ ఇన్వెస్టర్ రమేశ్ దమానీ పేరు తెరపైకి వచ్చింది. రెండు రోజుల్లో ఎన్ఐఐటీ షేర్లు 29 శాతానికి పైగా పెరిగాయి. ఎన్ఐఐటీ షేరు 52 వారాల గరిష్ట స్థాయి రూ.154.63ను తాకింది. అదే సమయంలో కంపెనీ షేరు 52 వారాల కనిష్ట స్థాయి రూ.78.50గా ఉంది.
స్టాక్ ఎక్స్ఛేంజీల్లో లభించిన సమాచారం ప్రకారం ఎన్ఐఐటీ లిమిటెడ్‌కు చెందిన 8 లక్షల షేర్లను రమేశ్ దమానీ కొనుగోలు చేశారు. ఒక్కో షేరుకు సగటున రూ.127.50 చొప్పున దమానీ ఈ షేర్లను కొనుగోలు చేశారు. జూన్ 2024 త్రైమాసికానికి షేర్ హోల్డింగ్ సరళిని పరిశీలిస్తే, దమానీకి ఇంతకు ముందు ఎన్ఐఐటీలో వాటా ఉండకపోవచ్చు.
ఒకవేళ కంపెనీలో వాటా కలిగి ఉన్నప్పటికీ, వాటాదారుల జాబితాలో అతని పేరు లేనందున అది 1 శాతం కంటే తక్కువగా ఉంటుంది. గత ఐదు రోజుల్లో కంపెనీ షేర్లు 35 శాతం పెరిగాయి. ఒక్క ఏడాదిలోనే ఎన్ఐఐటీ లిమిటెడ్ షేర్లు 93 శాతం పెరిగాయి.
శుక్రవారం ఎన్ఐఐటీ లిమిటెడ్‌కు చెందిన 35.4 లక్షల షేర్ల లావాదేవీలు జరిగాయి. ఈ డీల్ విలువ రూ.42 కోట్లు కాగా, ఒక్కో షేరు సగటు ధర రూ.118గా ఉంది. ఎన్ఐఐటీ ప్రమోటర్లు కూడా ఆగస్టు 22న కంపెనీలో ప్రధాన వాటాను కొనుగోలు చేశారు.
బల్క్ డీల్ డేటా ప్రకారం ప్రమోటర్లు పవార్ ఫ్యామిలీ ట్రస్ట్, తడానీ ఫ్యామిలీ ట్రస్ట్ గురువారం ఒక్కో షేరుకు సగటున రూ.118 చొప్పున 17,69,026 షేర్లను కొనుగోలు చేశాయి. ఇద్దరు ప్రమోటర్లు కలిసి ఎన్ఐఐటీకి చెందిన 35.38 లక్షల షేర్లను కొనుగోలు చేశారు, ఇది కంపెనీ మొత్తం ఈక్విటీలో 2.62 శాతం. ఈ డీల్ తర్వాత కంపెనీలో ప్రమోటర్ల వాటా 2024 జూన్ త్రైమాసికం చివరి నాటికి 34.66 శాతం నుంచి 37.28 శాతానికి పెరిగింది.