LML Star Electric Scooter : భారతీయ రోడ్లపైకి రానున్న మరో ఎలక్ట్రిక్ స్కూటర్.. ఎల్‌ఎమ్‌ఎల్ స్టార్-lml gets design patent approval for star electric scooter details inside ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Lml Star Electric Scooter : భారతీయ రోడ్లపైకి రానున్న మరో ఎలక్ట్రిక్ స్కూటర్.. ఎల్‌ఎమ్‌ఎల్ స్టార్

LML Star Electric Scooter : భారతీయ రోడ్లపైకి రానున్న మరో ఎలక్ట్రిక్ స్కూటర్.. ఎల్‌ఎమ్‌ఎల్ స్టార్

Anand Sai HT Telugu

LML Star Electric Scooter : భారతీయ మార్కెట్‌లోకి మరో ఎలక్ట్రిక్ స్కూటర్ రానుంది. ఈ మేరకు ఎల్‌ఎమ్‌ఎల్ పేటెంట్ పొందింది. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు చక్కర్లు కొడుతున్నాయి. ఆ వివరాలేంటో చూద్దాం..

ఎల్ఎమ్ఎల్ స్టార్ ఈవీ

ఎలక్ట్రిక్ స్కూటర్ల గురించి మాట్లాడితే.. ఎక్కువగా ఓలా, ఈథర్, హీరో, టీవీఎస్, బజాజ్ వంటి కంపెనీలు ముందుగా గుర్తుకువస్తాయి. అయితే ఈ సెగ్మెంట్‌లో మరెన్నో బ్రాండ్‌లు ఉన్నాయి. ఇవన్నీ మార్కెట్‌లో మంచి వ్యాపారం చేస్తున్నాయి. లూనా, కైనెటిక్ వంటి వాహన తయారీదారులు కూడా ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల తయారీలో ఉన్నారు. ఇవి ఎల్‌ఎమ్‌ఎల్ గ్రూపులో చేరనున్నాయనే వార్తలను గతంలో విన్నాం. ఎల్‌ఎమ్‌ఎల్ కంపెనీ మూడు కొత్త ద్విచక్ర వాహనాలను పరిచయం చేయనున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతానికి ఎల్ఎమ్ఎల్ స్టార్ స్కూటీ గురించి వార్తలు వైరల్ అవుతున్నాయి.

ఈ కంపెనీ ఎల్‌ఎమ్‌ఎల్ స్టార్ అధికారిక డిజైన్‌కు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసి వార్తల్లో నిలిచింది. ఈ-స్కూటర్ డిజైన్ కొత్తగా పేటెంట్ పొందింది. స్టార్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను గ్లోబల్ టూ వీలర్ దిగ్గజాలు డుకాటీ, ఫెరారీ, యమహా, కవాసకి డిజైనర్లు అభివృద్ధి చేసినట్టుగా తెలుస్తోంది.

ఈ ఏడాది స్టార్ ఈ-స్కూటర్‌ను విడుదల చేస్తామని ఎల్‌ఎమ్‌ఎల్ గతంలో ప్రకటించింది. పండుగల సీజన్‌లో ఇది రోడ్లపైకి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఈ ఈవీకి సంబంధించిన మోడల్ అందరినీ ఆకర్శిస్తోంది. LML భారతదేశంలో ప్రారంభించాలని అనుకుంటున్న మూడు ఎలక్ట్రిక్ స్కూటర్లలో స్టార్ ఈవీ మొదటిదిగా నిలవనుంది.

మెుదటిది స్టార్ ఎలక్ట్రిక్ స్కూటర్ కాగా రెండు, మూడో వాటి పేర్లు మూన్‌షాట్, ఓరియన్‌గా చెబుతున్నారు. మూడింటిని వాటి కాన్సెప్ట్ ఫారమ్‌లలో ముందుగా చూపించారు. స్టార్ ఎలక్ట్రిక్ స్కూటర్ గత ఏడాది జరిగిన ఇటో ఎక్స్‌పోలో తొలిసారిగా చూపేట్టారు. స్టార్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఫ్యూచరిస్టిక్ లుక్‌తో వస్తుంది. అందరినీ ఆకట్టుకునేలా ఉంటుందని కంపెనీ భావిస్తోంది.

ఇది డ్యూయల్ టోన్ బ్లాక్ అండ్ వైట్ బాడీ కలర్, LED DRLలు, ప్రొజెక్టర్ హెడ్‌లైట్‌లు, రెడ్ యాక్సెంట్‌లతో వస్తుంది. స్టార్ మిడ్-మ్యాక్సీ స్కూటర్‌లా కనిపిస్తోందని ఎల్‌ఎమ్‌ఎల్ చెబుతోంది. స్టార్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఈ సెగ్మెంట్‌లో చాలా మందికి పోటీ ఇస్తుందని భావిస్తున్నారు.

ఆటోమేటిక్ హెడ్‌లైట్, వైర్‌లెస్ ఛార్జర్, యాంబియంట్ లైటింగ్, డిజిటల్ డిస్‌ప్లే వంటివి మోడల్‌లోని కొన్ని ముఖ్యమైన ఫీచర్లుగా తెలుస్తోంది. స్టార్ ఈ-స్కూటర్ టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, హిల్ హోల్డ్ అసిస్ట్, రివర్స్ మోడ్, ABS వంటి భద్రతా లక్షణాలను కూడా అందిస్తుంది.

స్టార్ ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి ఇంకా పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. బ్యాటరీ పరిమాణం లేదా ఎలక్ట్రిక్ స్కూటర్ పరిధి గురించి LML మరిన్ని వివరాలను వెల్లడించలేదు. ఒక్కసారి ఛార్జ్ చేస్తే దాదాపు 150 కిమీల రేంజ్‌ను అందించే అవకాశం ఉంది.