Tata EV Offer : టాటా ఎలక్ట్రిక్ కార్లపై రూ.3 లక్షల వరకు తగ్గింపు, 6 నెలల ఛార్జింగ్ ఉచితం!-huge discount on tata motors electric cars free charging for 6 months tiago ev punch ev and nexon ev ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Tata Ev Offer : టాటా ఎలక్ట్రిక్ కార్లపై రూ.3 లక్షల వరకు తగ్గింపు, 6 నెలల ఛార్జింగ్ ఉచితం!

Tata EV Offer : టాటా ఎలక్ట్రిక్ కార్లపై రూ.3 లక్షల వరకు తగ్గింపు, 6 నెలల ఛార్జింగ్ ఉచితం!

Anand Sai HT Telugu
Sep 10, 2024 04:30 PM IST

Tata EV Car Discount : మీరు టాటా ఈవీని పొందాలనుకుంటే త్వరగా తీసుకోండి. ఎందుకంటే టాటా ఎలక్ట్రిక్ కార్లకు 3 లక్షల వరకు డిస్కౌంట్ ఆఫర్ లభిస్తుంది. టాటా నెక్సాన్ ఈవీ అత్యధిక డిస్కౌంట్లను పొందుతోంది.

టాటా నెక్సాన్ ఈవీ
టాటా నెక్సాన్ ఈవీ

దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్‌లో టాటా మోటర్స్‌‌కు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఈ కంపెనీ ఈవీలకు డిమాండ్ ఉంది. ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాలను కొనేలా చేయడంలో టాటా మోటర్స్ కీలక పాత్ర పోషిస్తోంది. అయితే ఇప్పుడు ఈ కంపెనీ కొన్ని ఎలక్ట్రిక్ కార్లపై బంపర్ డిస్కౌంట్లను అందిస్తోంది. టాటా తన బెస్ట్ సెల్లింగ్ ఎలక్ట్రిక్ కార్ల కొత్త ధరల జాబితాను విడుదల చేసింది. ఇది మునుపటి కంటే చాలా తక్కువ.

ధర తగ్గింపుతో పాటు, వినియోగదారులకు టాటా పవర్ ఛార్జింగ్ స్టేషన్లలో 6 నెలల ఉచిత ఛార్జింగ్‌ను కూడా కంపెనీ అందిస్తుంది. టాటా ఈవీలో అత్యధికంగా అమ్ముడవుతున్న మోడళ్లైన టియాగో ఈవీ, పంచ్ ఈవీ, నెక్సాన్ ఈవీలపై ఈ ఆఫర్ అందుబాటులో ఉంది. ఈ కార్లన్నీ 'ఫెస్టివల్ ఆఫ్ కార్స్' లిస్టులో ఉన్నాయి. డిస్కౌంట్ల విషయానికొస్తే నెక్సాన్ ఈవీకి 3 లక్షల వరకు, పంచ్ ఈవీకి 1.20 లక్షల వరకు డిస్కౌంట్ లభిస్తోంది. టియాగో ఈవీకి రూ.40 వేల వరకు డిస్కౌంట్ లభిస్తుంది.

అంతేకాదు కస్టమర్లు దేశవ్యాప్తంగా ఉన్న 5,500+ టాటా పవర్ ఛార్జింగ్ స్టేషన్లలో 6 నెలల ఉచిత ఛార్జింగ్ ను ఆస్వాదించవచ్చు. ఈ ఫీచర్ ద్వారా నగరాల నుంచి నగరానికి ప్రయాణించే కస్టమర్లకు ఛార్జింగ్ సమస్య నుంచి విముక్తి లభిస్తుంది. ఈ ఆఫర్ కింద కస్టమర్లు తమకు ఇష్టమైన ఎలక్ట్రిక్ కారును మంచి ధరలకు ఇంటికి తీసుకెళ్లవచ్చు. ఈ స్పెషల్ ఆఫర్ 31 అక్టోబర్ 2024 వరకు అందుబాటులో ఉంటుంది.

టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ వివేక్ శ్రీవత్స మాట్లాడుతూ ఎలక్ట్రిక్ వాహనాలను ప్రధాన స్రవంతిలోకి తీసుకురావడమే టాటా ఈవీ ఏకైక లక్ష్యమని చెప్పారు. పెట్రోల్, డీజిల్ వాహనాలకు దగ్గరగా ఎలక్ట్రిక్ వాహనాల ధరలను తీసుకురావడానికి కంపెనీ ప్రయత్నిస్తోందన్నారు.