HDFC UPI services : అలర్ట్​.. నిలిచిపోనున్న హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​ యూపీఐ సేవలు- ఎందుకంటే..-hdfc bank to temporarily stop upi services on july 13 see full details ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Hdfc Upi Services : అలర్ట్​.. నిలిచిపోనున్న హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​ యూపీఐ సేవలు- ఎందుకంటే..

HDFC UPI services : అలర్ట్​.. నిలిచిపోనున్న హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​ యూపీఐ సేవలు- ఎందుకంటే..

Sharath Chitturi HT Telugu
Jul 02, 2024 10:56 AM IST

HDFC bank UPI services : హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​ కస్టమర్స్​ అలర్ట్​! త్వరలో ఈ సంస్థకు చెందిన యూపీఐ సేవలు కొన్ని గంటల పాటు నిలిచిపోనున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళితే..

హెచ్​డీఎఫ్​సీ కస్టమర్స్​కి అలర్ట్​
హెచ్​డీఎఫ్​సీ కస్టమర్స్​కి అలర్ట్​ (REUTERS)

హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​తో​ యూపీఐ ట్రాన్సాక్షన్స్​ చేసే కస్టమర్స్​కి అలర్ట్​! త్వరలో ఈ యూపీఐ సేవలు తాత్కాలికంగా నిలిచిపోనున్నాయి. జులై 13న పలు గంటల వ్యవధిలో రెండుసార్లు యూపీఐ ట్రాన్సాక్షన్స్​ పనిచేయవు. ఈ విషయం దిగ్గజ బ్యాంకింగ్​ సంస్థ వెల్లడించింది.

హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​ యూపీఐ సేవలు..

జులై 13న షెడ్యూల్డ్​ సిస్టెమ్​ అప్​గ్రేడ్​ చేస్తున్నట్టు ప్రకటించింది హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​. ఫలితంగా యూపీఐ సేవలపై తాత్కాలికంగా ప్రభావం పడుతుందని స్పష్టం చేసింది. జులై 13 తెల్లవారుజామున 3 గంటల నుంచి 3 గంటల 45 నిమిషాల వరకు, తిరిగి 9 గంటల 30 నిమిషాల నుంచి 12 గంటల 45 నిమిషాల వరకు యూపీఐ సర్వీస్​ పనిచేయదని పేర్కొంది.

అయితే ఈ కాలంలో నెట్​బ్యాంకింగ్​, మొబైల్​ బ్యాంకింగ్​ సేవలు కూడా పనిచేయవని సంస్థ స్పష్టం చేసింది. ఎంపీఎస్​, నెఫ్ట్​, ఆర్​టీజీఎస్​, అకౌంట్​ టు అకౌంట్​ ట్రాన్స్​ఫర్​, బ్రాంచ్​ ట్రాన్స్​ఫర్​ వంటి నగదు లావాదేవీలకు ఉన్న అన్ని మార్గాలు ఈ అప్​గ్రేడ్​ పీరియడ్​లో అందుబాటులో ఉండవని గుర్తుపెట్టుకోవాలి.

తెల్లవారుజామున 3 గంటలకు పర్లేదు కానీ, ఉదయం పూట యూపీఐ సేవలకు అంతరాయం కలుగుతుండటం ప్రజలను కాస్త ఇబ్బంది పెట్టే విషయమే. ఈ నేపథ్యంలో అసౌకర్యానికి గురవ్వకుండా యూపీఐ నగదు లావాదేవీలకు సంబంధించి కస్టమర్లు ముందుగానే ప్లాన్​ చేసుకోవాలని హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​ సూచించింది.

అయితే యూపీఐ సర్వీస్​లు అందుబాటులో లేకపోయినా పలు కీలక సేవలు మాత్రం యథావిథిగా కొనసాగనున్నాయి. హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​ డెబిట్​ లేదా క్రెడిట్​ కార్డు వాడి కస్టమర్లు ఏటీఎంల నుంచి నగదును ఉపసంహరించుకోవచ్చు. కాగా దీనిపైనా కొన్ని లిమిటేషన్స్​ ఉంటాయి.

హెచ్​డీఎఫ్​సీ యూపీఐ సేవలు పనిచేయకపోయినా, దుకాణాల్లోని స్వైప్​ మెషిన్స్​లో డెబిట్​, క్రెడిట్​ కార్డులను ఉపయోగించుకోని కొనుగోళ్లు చేసుకోవచ్చు. ఆన్​లైన్​ ద్వారా కూడా కొనుక్కోవచ్చు. సంస్థకు చెందిన పేజాప్​ కూడా పనిచేస్తుంది. అయితే వీటిపైనా కొన్ని లిమిటేషన్స్​ ఉంటాయి. ఆ లిమిటేషన్స్​ని సంస్థ ఇంకా వెల్లడించలేదు.

కార్డుల ద్వారా మర్చెంట్లు పేమెంట్స్​ని పొందొచ్చని, కానీ అప్​గ్రేడ్​ ప్రక్రియ పూర్తైన తర్వాతే, అంటే మధ్యాహ్నం 12 గంటల 45 నిమిషాల తర్వా, అవి అకౌంట్​లో కనిపిస్తాయని హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​ వెల్లడించింది.

ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా 2024 జులై 12 రాత్రి 7 గంటల 30 నిమిషాలలోపే తగినన్ని ఫండ్స్​ని విత్​డ్రా చేసుకోవాలని సంస్థ సూచించింది.

"జులై 13 రెండో శనివారం వచ్చింది. ఆ రోజు బ్యాంక్​ సెలవు. ప్రజలకు ఇబ్బంది కలగకూడదు అనే ఆరోజు సిస్టెమ్​ అప్​గ్రేడ్​ పని పెట్టుకున్నాము. మరిన్ని వివరాల కోసం హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​ వెబ్​సైట్​, కస్టమర్​ కేర్​ సర్వీసులను సంప్రదించండి," అని ఓ ప్రకటన ద్వారా తెలిపింది సంస్థ.

ఇదే విషయాన్ని కస్టమర్లకు ఈమెయిల్స్​ ద్వారా కూడా సంస్థ చెప్పినట్టు తెలుస్తోంది.

సిస్టెమ్​ అప్​గ్రేడ్స్​ అనేవి ప్రతి సంస్థ తరచూ చేసే ప్రక్రియే. అయితే చాలా వరకు అర్థరాత్రే జరిగిపోతాయి. ఆ సమయంలో సేవల వినియోగం తక్కువగా ఉంటుందని అర్థరాత్రి పెట్టుకుంటారు.

Whats_app_banner

సంబంధిత కథనం