PM E Drive Scheme : ఎలక్ట్రిక్ వాహనాల కోసం పీఎం ఈ-డ్రైవ్ పథకం.. వచ్చే రెండేళ్లకు రూ.10,900 కోట్లు
PM E Drive : భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచడానికి రెండు సంవత్సరాలలో రూ.10,900 కోట్లను కేటాయిస్తూ కేంద్ర మంత్రివర్గం PM E-డ్రైవ్ పథకాన్ని ప్రారంభించింది. ఇది ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు, త్రీవీలర్, ఈ-బస్సులకు మద్దతు ఇస్తుంది. అనేక ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసేందుకు వీలు కల్పిస్తుంది.
పీఎం ఈ-డ్రైవ్ పథకానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దీని ద్వారా వచ్చే రెండేళ్లలో రూ.10,900 కోట్లు కేటాయించారు. భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలను (ఈవీ) ప్రోత్సహించడమే ఈ పథకం లక్ష్యం. ఈ పథకం కింద బ్యాటరీతో నడిచే ద్విచక్ర వాహనాలు, త్రిచక్ర వాహనాలు, అంబులెన్స్‌లు, ట్రక్కులు, ఇతర ఈవీలకు రూ.3,679 కోట్ల సబ్సిడీ ఇవ్వనున్నారు. ప్రభుత్వం ఈ చొరవతో పర్యావరణాన్ని పరిరక్షించాలనుకుంటోంది.
ఫేమ్ ఇండియా స్కీమ్ స్థానంలో పీఎం ఈ-డ్రైవ్ స్కీమ్ రానుంది. దీనిని 2015 ఏప్రిల్‌లో ప్రారంభించారు. ఇది 9 సంవత్సరాల పాటు రెండు దశల్లో నిర్వహించారు. రెండో దశలో రూ.11,500 కోట్ల వ్యయంతో 13,21,800 ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చింది. కొత్త పీఎం ఈ-డ్రైవ్ పథకం కింద రాష్ట్ర రవాణా సంస్థలు, ప్రజా రవాణా సంస్థలు 14,028 ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలుకు రూ.4,391 కోట్లు కేటాయించారు.
పీఎం ఎలక్ట్రిక్ డ్రైవ్ రివల్యూషన్ ఇన్ ఇన్నోవేటివ్ వెహికల్ ఎన్హాన్స్‌మెంట్(పీఎం ఈ-డ్రైవ్) పథకం కింద 88,500 ప్రాంతాల్లో ఛార్జింగ్ మౌలిక సదుపాయాల కోసం 100 శాతం సహాయం అందించనున్నట్లు సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఈ పథకం కింద ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు, ఎలక్ట్రిక్ త్రిచక్ర వాహనాలు, ఎలక్ట్రిక్ అంబులెన్సులు, ఎలక్ట్రిక్ ట్రక్కులకు రూ.3,679 కోట్ల సబ్సిడీని అందించారు. 24.79 లక్షల ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు, 3.16 లక్షల ఎలక్ట్రిక్ త్రిచక్ర వాహనాలు, 14,028 ఎలక్ట్రిక్ బస్సులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందనున్నాయి.
భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించడానికి పీఎం ఇ-డ్రైవ్ పథకం అనేక ప్రోత్సాహకాలను అందిస్తుంది. ఈ పథకం కింద అర్హత నిబంధనలు మునుపటి ఫేమ్ 2 పథకం ఈవీ సబ్సిడీ కార్యక్రమం మాదిరిగానే ఉంటాయి. ఉదాహరణకు బ్యాటరీతో నడిచే ఎలక్ట్రిక్ ద్విచక్రవాహనాలు (స్కూటర్లు, మోటార్ సైకిళ్లు), బ్యాటరీతో నడిచే ఎలక్ట్రిక్ త్రిచక్ర వాహనాలు (ఆటో రిక్షాలు), రాష్ట్ర రవాణా సంస్థలు, ప్రజా రవాణా సంస్థలు ఎలక్ట్రిక్ బస్సులను కొనుగోలు చేయవచ్చు. ఎలక్ట్రిక్ ట్రక్కులు, ఎలక్ట్రిక్ అంబులెన్సులు కూడా ప్రయోజనం చేకూరుస్తాయి.