Cryptocurrency prices today: బిట్‌కాయిన్ 5 శాతం.. ఈథర్ 11 శాతం అప్-cryptocurrency prices surges today bitcoin up by 5 percent ether up by 11 percent ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Cryptocurrency Prices Today: బిట్‌కాయిన్ 5 శాతం.. ఈథర్ 11 శాతం అప్

Cryptocurrency prices today: బిట్‌కాయిన్ 5 శాతం.. ఈథర్ 11 శాతం అప్

Praveen Kumar Lenkala HT Telugu
Oct 26, 2022 12:48 PM IST

Cryptocurrency prices today: క్రిప్టోకరెన్సీ మళ్లీ పరుగులు పెట్టనుందా? బిట్‌కాయిన్ 5 శాతం మేర, ఈథర్ 11 శాతం మేర లాభపడడం క్రిప్టోకరెన్సీ మార్కెట్ క్యాప్ తిరిగి 1 ట్రిలియన్ డాలర్ మార్కుకు చేరుకుంది.

మళ్లీ పుంజుకుంటున్న బిట్‌కాయిన్
మళ్లీ పుంజుకుంటున్న బిట్‌కాయిన్ (REUTERS)

క్రిప్టోకరెన్సీలో అత్యంత పాపులర్ అయిన బిట్‌కాయిన్ 4 శాతానికి పైగా పెరిగి 20,208 డాలర్లకు చేరుకుంది. గత ఏడాది నవంబరులో 69 వేల డాలర్లకు ఎగిసిన బిట్‌కాయిన్ తిరిగి ఇటీవల 18 వేల డాలర్లకు పడిపోయి క్రమంగా పుంజుకుంటోంది. జూన్ నుంచి 20 వేల డాలర్లకు అటూఇటుగా ట్రేడవుతోంది.

గడిచిన 24 గంటల్లో దాదాపు 5 శాతం పెరిగిన క్రిప్టోమార్కెట్ క్యాప్.. తిరిగి 1 ట్రిలియన్ డాలర్ మార్కుకు చేరుకుందని కాయిన్‌గెకో తెలిపింది.

రెండో అతిపెద్ద క్రిప్టోకరెన్సీ అయిన ఎథేరియం బ్లాక్‌చైన్ ఆధారిత ఈథర్ క్రిప్టోకరెన్సీ 11 శాతం పెరిగి 1,485 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. డోజ్కాయిన్ కూడా 8 శాతం పెరిగి 0.06 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. షిబా ఐను 4 శాతం పెరిగింది.

అవలాంచ్, బినాన్స్ యూఎస్‌డీ, చైన్ లింక్, టెథర్, ఏప్‌కాయిన్, సొలానా, కార్డానో, పాలిగాన్, ఎక్స్ఆర్పీ, టెర్రా, స్టెల్లార్, యూనీస్వాప్, ట్రాన్, లైట్‌కాయిన్, పోల్కాడాట్ వంటి క్రిప్టోలన్నీ గడిచిన 24 గంటల్లో దాదాపు 10 శాతం పెరిగాయి.

‘బిట్‌కాయిన్ 19 వేల డాలర్ల మార్కు స్థాయి వద్ద మద్దతుకు అన్ని పరీక్షలను ఎదుర్కొంది. అలాగే ఈథర్ 1300 మార్కు స్థాయిలో మద్దతు గట్టి మద్దతు లభించింది. ఇప్పుడది 1500 డాలర్లకు చేరుకుంది. స్వల్పకాలంలో ఈ ట్రెండ్ కొనసాగే అవకాశం ఉంది. రిషి సునాక్ యూకే ప్రధానిగా ఎన్నికవడం కూడా క్రిప్టో బలపడడానికి కారణంగా కనిపిస్తోంది. డిజిటల్ అసెట్స్‌పై ఆయన వైఖరి వల్ల యూకేలో వీటి నియంత్రణపై స్పష్టత వస్తుందని క్రిప్టో మార్కెట్ నమ్ముతోంది..’ అని మడ్రెక్స్ కో ఫౌండర్, సీఈవో ఈదుల్ పటేల్ తెలిపారు.

క్రిప్టోకరెన్సీ, నాన్ ఫంజిబుల్ టోకెన్ల ట్రేడింగ్‌పై తన పాలసీని విశదీకరించేందుకు ఆపిల్ కంపెనీ తన ఆప్ స్టోర్ గైడ్‌లైన్స్‌ను మరింత స్పష్టంగా వెలువరించింది.

క్రిప్టో ఎక్స్ఛేంజీలు లేదా డిజిటల్ టోకెన్లు, క్రిప్టో కరెన్సీ వ్యాపారాన్ని అనుమతించే ఏవైనా యాప్‌లతో కంపెనీకి ఎటువంటి సమస్య లేదని, అయితే ఆ ఎక్స్ఛేంజీలు యాప్ పంపిణీ అయిన చోట ఆపరేట్ చేయడానికి అవసరమైన ప్రాంతీయ లైసెన్స్‌లను కలిగి ఉండాలని స్పష్టం చేసింది.

కానీ యాప్‌లు నాన్ ఫంజిబుల్ టోకెన్లు, సంబంధిత సేవలను విక్రయించాలంటే అవి ఆపిల్ ఇన్-యాప్‌ కొనుగోలు వ్యవస్థల ద్వారా వెళ్లాలి.

ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కోవిడ్ మహమ్మారి ప్రభావితం చేయడం, ఉక్రెయిన్‌పై రష్యా దాడి వంటి కారణాల వల్ల పెరిగిన ద్రవ్యోల్భణాన్ని ఎదుర్కోవడానికి ఫెడరల్ రిజర్వ్ వంటి సెంట్రల్ బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచడంతో క్రిప్టోకరెన్సీలు కూడా తల్లడిల్లాయి.

Whats_app_banner