‘’బోర్న్ విటా సహా ఈ డ్రింక్స్ ను హెల్త్ డ్రింక్స్ కేటగిరీ నుంచి తొలగించండి’’- ఈ కామర్స్ సంస్థలకు ప్రభుత్వం అల్టిమేటం-bournvita to be removed from health drinks category govt says there is no ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  ‘’బోర్న్ విటా సహా ఈ డ్రింక్స్ ను హెల్త్ డ్రింక్స్ కేటగిరీ నుంచి తొలగించండి’’- ఈ కామర్స్ సంస్థలకు ప్రభుత్వం అల్టిమేటం

‘’బోర్న్ విటా సహా ఈ డ్రింక్స్ ను హెల్త్ డ్రింక్స్ కేటగిరీ నుంచి తొలగించండి’’- ఈ కామర్స్ సంస్థలకు ప్రభుత్వం అల్టిమేటం

HT Telugu Desk HT Telugu
Apr 13, 2024 04:40 PM IST

Bournvita: హెల్త్ డ్రింక్స్ కేటగిరీ నుంచి బోర్న్ విటా తదితర డ్రింక్స్ ను తొలగించాలని కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ ఇటీవల ఈ-కామర్స్ వెబ్ సైట్ లకు నోటీసులు జారీ చేసింది. అవి హెల్త్ డ్రింక్స్ కేటగిరీలోకి రావు అని స్పష్టం చేసింది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్, 2006 (FSS Act 2006) కింద నిర్వచించిన 'హెల్త్ డ్రింక్' కేటగిరీలోకి బోర్న్ విటా తదితర డ్రింక్స్ రావు అని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అందువల్ల ఈ-కామర్స్ ప్లాట్ ఫామ్ లలో హెల్త్ డ్రింక్ కేటగిరీ నుంచి బోర్న్ విటా తదితర సంబంధిత డ్రింక్స్ ను తొలగించాలని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఈ-కామర్స్ కంపెనీలకు జారీ చేసిన లేఖలో పేర్కొంది.

బోర్న్ విటా తో పాటు ఆ తరహాకు చెందిన డ్రింక్స్ అన్నీ..

ఏప్రిల్ 10న రాసిన లేఖలో బోర్న్ విటా తదితర సంబంధిత పానీయాలను తమ వెబ్ సైట్స్ లో 'హెల్త్ డ్రింక్స్' కేటగిరీ నుంచి తొలగించాలని వాణిజ్య మంత్రిత్వ శాఖ ఈ-కామర్స్ కంపెనీలకు సూచించింది. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్, 2006 (FSS Act 2006) లో హెల్త్ డ్రింక్స్ అనే కేటగిరీని నిర్వచించలేదని జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (NCPCR) స్పష్టం చేసింది. ఈ విషయంపై సీఆర్పీసీ 2005 లోని సెక్షన్ 14 కింద ఎన్సీపీసీఆర్ (NCPCR) విచారణ జరిపి, ఈ విషయాన్ని స్పష్టం చేసింది. ఇదే విషయాన్ని కేంద్ర మంత్రిత్వ శాఖ అన్ని ఈ కామర్స్ ప్లాట్ ఫామ్స్ కు తెలియజేసింది.

బోర్న్ విటా వివాదం

బోర్న్ విటా లో షుగర్ లెవల్స్ ఎక్కువగా ఉన్నాయని ఏడాది క్రితం ఫిర్యాదు వచ్చింది. దీనిపై నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ (NCPCR) బోర్న్ విటా బ్రాండ్ యాజమాన్య సంస్థ అయిన మాండెలెజ్ ఇండియా లిమిటెడ్ కు నోటీసులు జారీ చేసింది. అనంతరం, బోర్న్ విటాను సేవిస్తే అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని చెపుతూ, తప్పు దోవ పట్టించే వాణిజ్య ప్రకటనలను తొలగించాలని మాండెలెజ్ ఇండియా లిమిటెడ్ ను ఆదేశించింది. బోర్న్ విటా హెల్త్ డ్రింక్ గా ప్రమోట్ చేసుకుంటోందని, పిల్లల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపే అధిక శాతం చక్కెరను వినియోగిస్తోందని ఆరోపణలు వచ్చాయి. ఈ డ్రింక్ తో పిల్లల పెరుగుదల, అభివృద్ధి మెరుగుపడుతుందనే వాదనలు చేస్తుందని బోర్న్ విటాపై ఫిర్యాదు రావడంతో ఎన్సీపీసీఆర్ (NCPCR) రంగంలోకి దిగింది.

Whats_app_banner