Bajaj Housing IPO: భారీగా నష్టపోయిన బజాజ్ హౌజింగ్ ఫైనాన్స్ ఐపీఓ ఇన్వెస్టర్లు
అప్పట్లో ఎల్ఐసీ ఐపీఓ కు భారీగా ప్రచారం జరిగింది. ఇప్పుడు ఆ స్థాయిలో ప్రచారంతో పాటు అదే స్థాయిలో సబ్ స్క్రిప్షన్ జరిగిన ఐపీఓ బజాజ్ హౌజింగ్ ఫైనాన్స్ ఐపీఓ. అయితే, బజాజ్ హౌజింగ్ ఫైనాన్స్ ఐపీఓకు అప్లై చేసుకున్న చాలామంది ఇన్వెస్టర్లను పలు సాంకేతిక కారణాల వల్ల అలాట్మెంట్ కు పరిగణనలోకి తీసుకోలేదు.
బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ ఐపీఓ అద్భుతమైన లిస్టింగ్ గెయిన్స్ తో ప్రైమరీ మార్కెట్లో అడుగుపెట్టింది. తొలి రోజే ఇన్వెస్టర్లకు 130% పైగా ప్రీమియంను అందించింది. అయితే, ఈ ఐపీఐకు అప్లై చేసుకున్న లక్షలాది దరఖాస్తుదారుల అప్లకేషన్లు పలు సాకేతిక కారణాలతో తిరస్కరణకు గురయ్యాయి.
14 లక్షల దరఖాస్తులు రిజెక్టెడ్
బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ ఐపీఓ (Bajaj Housing Finance IPO) కు వచ్చిన దరఖాస్తుల్లో దాదాపు 14 లక్షల దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి. రెండేళ్ల క్రితం ఎల్ఐసీ ఐపీఓకు వచ్చిన అప్లికేషన్లలో దాదాపు 20 లక్షలు రిజెక్ట్ కాగా, ఆ తరువాత అంత భారీ తిరస్కరణలు బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ ఐపీఓకే జరిగాయి. బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ ఐపీఓకి 89.07 లక్షల దరఖాస్తులు వచ్చాయి. వాటిలో సుమారు 14 లక్షల దరఖాస్తులు తిరస్కరణకు గురి కాగా, సుమారు 74.46 లక్షల దరఖాస్తులను పరిగణనలోకి తీసుకున్నారు.
యూపీఐ సిస్టమ్ తో సమస్యలు
ఇన్వెస్టర్లలో చాలా మంది యూపీఐ సిస్టమ్ ను పేమెంట్ మోడ్ గా ఎంపిక చేసుకున్నారు. వారిలో చాలామంది దరఖాస్తులు టెక్నికల్ కారణాలతో రిజెక్ట్ అయ్యాయి. ‘‘బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ ఐపీఓలో తిరస్కరణలకు ఒక ముఖ్యమైన కారణం యూపీఐ సిస్టమ్. యూపీఐ మాండేట్ జనరేట్ కాకపోవడం, యూపీఐ యాప్ కు మాండేట్ వెళ్లకపోవడం, ఇన్వెస్టర్ యూపీఐ మాండేట్ ను అంగీకరించకపోవడం.. వంటి కారణాలతో ఈ ఐపీఓ దరఖాస్తులు అలాట్మెంట్ దశకు చేరుకోలేకపోయాయి’’ అని కెఫిన్ టెక్నాలజీస్ కార్పొరేట్ రిజిస్ట్రీ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ గిరిధర్ జి అన్నారు. ‘‘అదనంగా, పెట్టుబడిదారుల UPI మాండేట్ లు ఎన్పీసీఐ (NPCI) కి వెళ్లినప్పుడు, అవి తిరస్కరణలు గురికావడం మరో కారణం’’ అన్నారు.
బ్రోకరేజ్ యాప్ ల ద్వారా అప్లై చేస్తే..
బ్రోకింగ్ అప్లికేషన్ల ద్వారా దరఖాస్తు చేసుకున్న చాలా మంది పెట్టుబడిదారుల అప్లికేషన్లు వివిధ కారణాలతో తిరస్కరణకు గురయ్యాయి. అయితే బ్యాంకుల ద్వారా నేరుగా దరఖాస్తు చేసుకున్న వారు ఎటువంటి సమస్యలను ఎదుర్కోలేదు. ‘‘స్పాన్సర్ బ్యాంక్‌లో లాగ్ ఉంది. అందువల్ల చాలా యూపీఐ (UPI) చెల్లింపు ఆదేశాలు ఆలస్యం అవుతున్నాయని చెప్పారు. ‘‘గత కొన్ని రోజులుగా IPOలలో దరఖాస్తుల సంఖ్య భారీగా ఉండటంతో UPI ఆదేశాలను స్వీకరించడంలో జాప్యం జరిగింది’’ అని జెరోధా ప్రైమరీ మార్కెట్ అండ్ పేమెంట్స్ వైస్ ప్రెసిడెంట్ మోహిత్ మెహ్రా తెలిపారు. అయితే, ఐపీఓ విండో సమయంలో పెట్టుబడిదారులు ఎప్పుడైనా యూపీఐ ఆదేశాన్ని ఆమోదించే అవకాశం ఉంటుంది.
సిస్టమ్ ను మార్చాలి..
సాంకేతిక సమస్యలతో దరఖాస్తులు తిరస్కరణకు గురవడం సరికాదని, ఈ సిస్టమ్ ను చక్కదిద్దాల్సిన అవసరం ఉందని మార్కెట్ పార్టిసిపెంట్లు తెలిపారు. ‘‘అర్హత లేని పెట్టుబడిదారులు ఉద్యోగి లేదా వాటాదారుల కోటా కింద చేసిన దరఖాస్తులు కూడా సమస్యలను కలిగిస్తాయి’’ అని ప్రైమ్ డేటాబేస్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రణవ్ హల్డియా అన్నారు. చివరి నిమిషంలో తిరస్కరణలను నిరోధించడానికి దరఖాస్తు సమయంలో ఫిల్టర్‌లు ఉండాలని సూచించారు.