7th Pay Commission HRA: డీఏ 50 శాతానికి పెంచారు సరే..! హెచ్ ఆర్ ఏ సంగతి ఏంటి? ప్రత్యేక నోటిఫికేషన్ ఇస్తారా?
7th Pay Commission HRA: 7వ వేతన సంఘం సిఫారసుల మేరకు.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల కరువు భత్యాన్ని 4% పెంచుతున్నట్లు కేంద్రం ఇటీవల ప్రకటించింది. ఈ పెంపుతో ఉద్యోగుల డీఏ 50 శాతానికి పెరిగింది. కానీ, దానికి అనుగుణంగా పెంచాల్సిన హెచ్ ఆర్ ఏ పై కేంద్ర నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు.
7th Pay Commission HRA: ప్రభుత్వ ఉద్యోగుల కరువు భత్యం (DA hike)ను ప్రభుత్వం 50 శాతానికి పెంచిన విషయం తెలిసిందే. ఇది 2024 జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చింది. ఆ విషయంలో ఎలాంటి సమస్య లేనప్పటికీ.. అందుకు అనుగుణంగా పెరగాల్సిన హెచ్ఆర్ఏ విషయంలో కొంత అనిశ్చితి, గందరగోళం నెలకొంది. సాధారణంగా, డీఏ (DA hike) పెంపుతో పాటు ఇంటి అద్దె అలవెన్స్ (HRA) కూడా పెరుగుతుంది.
ప్రత్యేక ఉత్తర్వులు అవసరమా?
అయితే 7వ వేతన సంఘం హెచ్ఆర్ఏ (HRA) సవరణకు సంబంధించి ప్రభుత్వం ఎలాంటి ప్రత్యేక ఉత్తర్వులను కానీ, నోటిఫికేషన్ ను కానీ జారీ చేయలేదు. అయితే, అందుకు ప్రత్యేక నోటిఫికేషన్ అవసరమా? డీఏ (DA hike) తో పాటు ఆటోమేటిక్ గానే హెచ్ ఆర్ ఏ (HRA) పెంపు జరుగుతుందా? అనే ప్రశ్నలు ప్రస్తుతం తలెత్తుతున్నాయి. ప్రభుత్వం ప్రత్యేక 7వ వేతన సంఘం (7th Pay Commission) హెచ్ఆర్ఏ నోటిఫికేషన్ కు సంబంధించి, ఆర్థిక మంత్రిత్వ శాఖ మెమోరాండం ప్రకారం, హెచ్ ఆర్ ఏ (HRA) పెంపుపై మరో ప్రభుత్వ నోటిఫికేషన్ అవసరం ఉండకపోవచ్చని, ఈ సవరణను నేరుగా అమలు చేయవచ్చని లూథ్రా అండ్ లూథ్రా లా ఆఫీస్స్ ఇండియా పార్టనర్ సంజీవ్ కుమార్ తెలిపారు.
నగరం స్థాయిని బట్టి..
గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఉద్యోగి నివసించే నగరంపై హెచ్ఆర్ఏ ఆధారపడి ఉంటుంది. వీటిని X, Y, Z నగరాలుగా విభజించారు. Z కేటగిరీ నగరం అతి తక్కువ పెంపును పొందుతుంది. 7వ వేతన సంఘం నిబంధనల ప్రకారం హెచ్ఆర్ఏ రేట్లను నగరాన్ని బట్టి X కేటగిరీ నగరం 30 శాతం, Y కేటగిరీ నగరం 20 శాతం, Z కేటగిరీ నగరం10 శాతం సవరించాల్సి ఉంటుంది. ఉద్యోగుల శాలరీ స్లిప్ లో ఈ విభజన ఉంటుందని భావిస్తున్నారు.
డీఏ పెంపు 4%
మార్చి నెలలో ఉద్యోగుల డీఏ (DA) 4%, పెన్షనర్లకు డీఆర్ 4% పెంచుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దాంతో, ఈ మొత్తం 46 శాతం నుంచి 50 శాతానికి పెరిగింది. ఈ పెంపుతో 49.18 లక్షల మంది ఉద్యోగులు, 67.95 లక్షల మంది పెన్షనర్లకు లబ్ధి చేకూరగా, ప్రభుత్వానికి ఏటా రూ.12,868.72 కోట్ల భారం పడనుంది.
డీఏ పెంపుతో హెచ్ ఆర్ ఏ లెక్కలు..
జూలై 1, 2017 లో X, Y, Z నగరాలకు హెచ్ ఆర్ ఏ (HRA) ను వరుసగా 24%, 16%, 8% గా నిర్ణయించారు. ఆ తరువాత డీఏ 25 శాతానికి చేరుకున్నప్పుడు, HRA రేట్లు X, Y, Z నగరాలకు వరుసగా 27%, 18%, 9 శాతానికి పెరిగాయి.అందువల్ల, రూ. 35,000 మూల వేతనం లభిస్తున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగికి HRA క్రింది విధంగా ఉంటుంది.
ఎ) X కేటగిరీ నగరానికి: రూ. 35,000లో 27% = రూ. 9,450
బి) Y కేటగిరీ నగరానికి: రూ. 35,000 లో 18% = రూ. 6,300
c) Z కేటగిరీ నగరానికి: రూ. 35,000లో 9% = రూ. 3,150
ఇప్పుడు, DA 50 శాతానికి చేరుకోవడంతో, 7వ వేతన సంఘం సిఫార్సు చేసిన HRA రేట్ల ప్రకారం టైప్ X సిటీకి 30%, టైప్ Y సిటీకి 20%, టైప్ Z సిటీకి 10% హెచ్ ఆర్ ఏ లభిస్తుంది.
కాబట్టి, రూ. 35,000 మూల వేతనం లభిస్తున్న ఉద్యోగులకు సవరించిన HRA మొత్తాలు ఇలా ఉంటాయి:
ఎ) X కేటగిరీ నగరానికి: రూ. 35,000లో 30% = రూ. 10,500
బి) Y కేటగిరీ నగరానికి: రూ. 35,000 లో 20% = రూ. 7,000
c) Z కేటగిరీ నగరానికి: రూ. 35,000లో 10% = రూ. 3,500.