HRA | హౌజ్ రెంట్ అలవెన్స్ (హెచ్‌ఆర్ఏ) మినహాయింపు ఎలా లెక్కించాలి?-how to calculate hra exemption from your salary ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  How To Calculate Hra Exemption From Your Salary

HRA | హౌజ్ రెంట్ అలవెన్స్ (హెచ్‌ఆర్ఏ) మినహాయింపు ఎలా లెక్కించాలి?

Praveen Kumar Lenkala HT Telugu
Feb 28, 2022 04:01 PM IST

HRA | హౌజ్ రెంట్ అలవెన్స్ మినహాయింపు కోరడంలో చాలా మంది గందరగోళానికి గురవుతుంటారు. మనం చెల్లించే రెంట్ మొత్తం మినహాయింపు కోరవచ్చా? అసలు ఎంత మేర హౌజ్ రెంట్ అలవెన్స్ మినహాయింపు కోరవచ్చు?

ఇంటి అద్దె భత్యం గురించి తెలుసా?
ఇంటి అద్దె భత్యం గురించి తెలుసా? (unsplash)

వేతన జీవులకు ఆదాయ పన్ను రిటర్న్ దాఖలు చేయడం పెద్ద కష్టమైన పనే.  ఏటా  ఆర్థిక సంవత్సరం మొదట్లో టాక్స్ సేవింగ్స్ ప్రతిపాదనలు లేదా అంచనాలు సమర్పించాలి. జనవరి రాగానే మొదటి వారంలో టాక్స్ సేవింగ్ ప్రూఫ్స్ సమర్పించాలి. మళ్లీ తిరిగి మార్చిలో మరోసారి ప్రూఫ్స్ సమర్పించాలి. తిరిగి ఫామ్ -16 రాగానే ఐటీ రిటర్నులు దాఖలు చేయాలి. అర్థం కాకపోతే ఇదంతా ఒక పెద్ద ప్రహసనంగా మారుతుంది. 

అందుకే ఎలాంటి చిక్కులు రాకుండా ఉండాలంటే తగిన క్రమశిక్షణ అవసరం. ఆదాయ పన్ను రిటర్నుల సమర్పణలో ప్రధానంగా తెలుసుకోవాల్సిన అంశం హౌజ్ రెంట్ అలవెన్స్ కంపోనెంట్ గురించి. మన వేతనంలో HRA సాధారణంగా మూల వేతనంలో సగంగా ఉంటుంది. నిజానికి ప్రస్తుతం నగరాల్లో మనం చెల్లించే అద్దెకు, సంస్థలు ఇచ్చే హెచ్ఆర్ఏకు పొంతనే ఉండదు. అందువల్ల హెచ్ఆర్ఏ కంపొనెంట్ ద్వారా మనం మొత్తం వేతన ఆదాయం నుంచి ఎంత మినహాయింపు కోరవచ్చో ఇప్పుడు చూద్దాం.

మినహాయింపు ఇలా లెక్కించాలి..

హెచ్ఆర్ఏ లెక్కింపులో మూడు అంశాలు కీలకం. మూల వేతనంలో 40 శాతం(మెట్రో సిటీ అయితే 50 శాతం), మీకు కంపెనీ చెల్లిస్తున్న హెచ్ఆర్ఏ, చెల్లించిన అద్దె నుంచి 10 శాతం మూలవేతనం తీసేయగా వచ్చిన మొత్తం.. ఈ మూడు అంశాల్లో ఏది తక్కువ మొత్తంలో ఉంటే దానిని మాత్రమే మొత్తం ఆదాయం నుంచి మినహాయింపు కోరవచ్చు. మూలవేతనం అంటే డీఏ కూడా కలపాల్సి ఉంటుంది.

ఉదాహరణకు రవి మూల వేతనం రూ. 30 వేలు ఉంది. డీఏ రూ. 8 వేలుగా ఉంది. హెచ్ఆర్ఏ రూ. 14 వేలు వస్తోంది. వాస్తవంగా చెల్లిస్తున్న అద్దె నెలకు రూ. 20 వేలుగా ఉంది. ఇప్పుడు రవి మినహాయింపు ఎంత కోరాలి?

బేసిక్ సాలరీ 12 నెలలకు రూ. 3,60,000 . డీఏ 12 నెలలకు రూ. 96,000. వార్షిక అద్దె రూ. 2,40,000. హెచ్ఆర్ఏ 12 నెలలకు రూ. 1,68,000. ఈ మూడింటి ఆధారంగా హెచ్ఆర్ఏ ఎగ్జెంప్షన్ కాలుక్యులేట్ చేయాలి. 

40 శాతం బేసిక్ సాలరీ అంటే.. బేసిక్ సాలరీ ప్లస్ డీఏ కలిపి అందులో నుంచి 40 శాతం లెక్కించాలి. దీని మొత్తం రూ. 1,82,000 అవుతుంది.

అలాగే 12 నెలలకు వాస్తవంగా పొందిన హెచ్ఆర్ఏ = రూ. 1,68,000

అలాగే వాస్తవంగా చెల్లించిన అద్దె రూ. 2,40,000 మైనస్ మూల వేతనంలో 10 శాతం = రూ. 1,94,000

ఈ మూడు అంశాల్లో తక్కువగా ఉన్నది వాస్తవ హెచ్ఆర్ఏ = 1,68,000. దీనిని మనం మొత్తం సాలరీ కంపొనెంట్ నుంచి మినహాయింపు కోరవచ్చు.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్