DA hike news: ఎన్నికల వేళ.. ప్రభుత్వ ఉద్యోగులకు వరాలు; డీఏ పెంచుతున్న ప్రభుత్వాలు
DA hike news: లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో.. వివిధ వర్గాల ఓటర్లను ఆకట్టుకునే దిశగా ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. కేంద్రం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ ను 4% పెంచిన నేపథ్యంలో.. కర్నాటక ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏ ను పెంచాలని నిర్ణయించింది.
DA hike news: లోక్ సభ ఎన్నికలకు ముందు, కర్ణాటక ప్రభుత్వం తన ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు 2024 జనవరి 1 నుండి 3.75% కరువు భత్యం (DA) పెంచుతున్నట్లు ప్రకటించింది. మార్చి నెల వేతనంతో పాటు ఈ బకాయిలు చెల్లించనున్నారు.
42.5 శాతానికి పెంపు
రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో కర్ణాటక ప్రభుత్వ ఉద్యోగుల మొత్తం డీఏ 38.75 శాతం నుంచి 42.5 శాతానికి పెరగనుంది. ఈ పెంపు వల్ల ప్రభుత్వ ఖజానాపై ప్రతి సంవత్సరం అదనంగా రూ .1792.71 కోట్ల భారం పడనుంది. ‘‘ఇది మా ఉద్యోగుల పట్ల మా అంకితభావాన్ని పునరుద్ఘాటిస్తుంది’’ అని ముఖ్యమంత్రి సిద్దరామయ్య తెలిపారు. మరోవైపు, యూజీసీ, ఏఐసీటీఈ, ఐసీఏఆర్, జేఎన్ పీసీ పే స్కేల్స్ కింద పనిచేసే సిబ్బందికి ప్రస్తుతం ఉన్న 46 శాతం డీఏను కర్ణాటక ప్రభుత్వం 50 శాతానికి పెంచింది.
కేంద్రం కూడా..
లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో డీఏను 4 శాతం పెంచి (DA hike) 50 శాతానికి తీసుకురావాలని మోదీ ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో 49.18 లక్షల మంది ఉద్యోగులు, 67.95 లక్షల మంది పెన్షనర్లు లబ్ది పొందుతారని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ఈ నిర్ణయం వల్ల ఖజానాపై ఏడాదికి రూ. 12,868.72 కోట్ల భారం పడుతుందన్నారు.
జార్ఖండ్, అరుణాచల్, హిమాచల్ కూడా..
జార్ఖండ్ ప్రభుత్వం కూడా ఈ ఏడాది జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చేలా డీఏను ప్రస్తుతం ఉన్న 46 శాతం నుంచి 50 శాతానికి పెంచింది. ఈ డీఏ పెంపు (DA hike) తో రాష్ట్రంలోని 1.90 లక్షల మంది ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రయోజనం కలుగుతుందని ముఖ్యమంత్రి చంపాయ్ సోరెన్ తెలిపారు. అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వం తన ఉద్యోగులకు అదనంగా 4 శాతం డీఏను ప్రకటించింది. జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చే ఈ పెంపుతో 68,818 మంది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, 33,200 మంది పెన్షనర్లకు లబ్ధి చేకూరనుంది. హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం కూడా గత వారం తన ఉద్యోగులకు 4% డీఏను పెంచుతున్నట్లు ప్రకటించింది. త్రిపుర, గుజరాత్ రాష్ట్రాలు కూడా తమ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈ నెలలో డీఏ పెంచాయి. నెలవారీ వేతనాలు, పింఛన్లలో భాగమైన 'డియర్నెస్ అలవెన్స్'ను పెంచడం వల్ల ఉద్యోగుల జీవన వ్యయ పెరుగుదలకు ఉపశమనం లభిస్తుంది.