7th Pay Commission : ఉద్యోగులకు డీఏ పెంపు ఈసారి తక్కువేనా? బేసిక్ పేతో విలీనం సాధ్యం కాదా?
DA Hike : ఏకీకృత పెన్షన్ స్కీమ్ తర్వాత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరో వార్త త్వరలో రానుంది. నివేదికల ప్రకారం.. సెప్టెంబర్ 2024 మూడో వారంలో కేంద్ర ప్రభుత్వం 3 నుంచి 4 శాతం డీఏ పెంపును ప్రకటించే అవకాశం ఉందని జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి. అయితే బేసిక్ పేతో విలీనంపై చాలా ప్రశ్నలు ఉన్నాయి.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డియర్‌నెస్ అలవెన్స్ (డీఎ), పెన్షనర్లకు డియర్‌నెస్ రిలీఫ్ (డీఆర్) ఇస్తారు. జనవరి, జూలై నుండి అమలులోకి వచ్చేలా సంవత్సరానికి రెండుసార్లు డీఏ పెంచుతారు. సెప్టెంబర్ మూడో వారంలో ప్రభుత్వం 3 నుంచి 4 శాతం డీఏ పెంపును తీసుకువస్తుందని భావిస్తున్నారు.
ఏడో వేతన సంఘం సిఫార్సుల ప్రకారం ఏటా రెండుసార్లు డీఏ పెంపు జరుగుతుంది. జనవరిలో 4 శాతం ఇవ్వడంతో డీఏ 50 శాతానికి చేరింది. ఇప్పుడు జూలై నెలకు సంబంధించి డీఏ సెప్టెంబర్ నెల నుంచి అమలు అవుతుంది. అయితే డియర్‌నెస్ అలవెన్స్, డియర్‌నెస్ రిలీఫ్ మూడు శాతం వరకూ ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. దీనితో మెుత్తం 53 శాతానికి చేరనుంది. జులై నెలలో అమలు కావాల్సిన డీఏ పెంపు సెప్టెంబర్‌లో నిర్ణయం ఉంటుందని అంచనా.
బేసిక్ పేతో విలీనం అవుతుందా?
నిపుణుల అభిప్రాయం ప్రకారం డీఏ 50 శాతం దాటితే డియర్‌నెస్ అలవెన్స్‌ను బేసిక్ పేతో విలీనం చేయడం సాధ్యం కాదు అంటున్నారు. 8వ వేతన సంఘం ఏర్పాటు వరకు ఇది కొనసాగుతుంది. విలీనానికి బదులుగా ఇప్పటికే కలిగి ఉన్న డీఏ 50 శాతం మించి ఉంటే, హెచ్‌ఆర్‌ఏతో సహా అలవెన్సులను పెంచడానికి నిబంధనలు ఉన్నాయి. చాలా మంది డీఏ పేలో విలీనం కాదని చెబుతున్నారు. 7వ వేతన సంఘంలో అలాంటి ప్రతిపాదనలు లేవని చెబుతున్నారు.
కానీ 2004లో డీఏ 50 శాతానికి చేరినప్పుడు డీఏను బేసిక్ పేలో కలిపి.. డియర్‌నెస్ పేగా పేర్కొన్నారు. కానీ తర్వాత వచ్చిన వేతన సంఘం అలాంటి సిఫార్సులకు దూరంగా ఉంది. కొన్నిసార్లు ఈ నిర్ణయం కేంద్రం మీద కూడా ఆధారపడి ఉంటుందని నిపుణులు చెబుతున్న మాట.
ఇటీవల పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి ప్రకటన ప్రకారం, COVID-19 మహమ్మారి సమయంలో నిలిపివేసిన డీఏ, డీఆర్ కోసం ప్రభుత్వం 18 నెలల బకాయిలను విడుదల చేసే అవకాశం లేదు. కోవిడ్ వ్యాప్తి సమయంలో నిలిపివేసిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు/పెన్షనర్ల 18 నెలల బకాయిలు/పరిహారం విడుదల చేయడం గురించి ప్రభుత్వం పరిశీలిస్తోందా అని అడిగినప్పుడు ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లేదు అని చెప్పారు.
కోవిడ్ 19 సమయంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు/పెన్షనర్లకు జనవరి 1, 2020, జూలై 1, 2020, జనవరి 1, 2021 నుండి మూడు విడతల DA/DRని నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాలపై ఒత్తిడి తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది.
8వ కమిషన్ ఎప్పుడు?
8వ వేతన సంఘంపై కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘాలు చాలా రోజులుగా డిమాండ్లు చేస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు 8వ వేతన సంఘం ఏర్పాటుపై ప్రభుత్వం ముందు ఎలాంటి ప్రతిపాదన లేదు. జూలై 30న రాజ్యసభలో ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లిఖితపూర్వక సమాధానంలో జూన్ 2024లో 8వ కేంద్ర వేతన సంఘం కోసం రెండు ప్రాతినిధ్యాలు అందాయి. అటువంటి ప్రతిపాదన ఏదీ ప్రస్తుత పరిశీలనలో లేదు అని చెప్పారు.
7వ వేతన సంఘం ఫిబ్రవరి 2014లో ఏర్పాటైంది. దాని సిఫార్సులు జనవరి 1, 2016 నుండి అమలులోకి వచ్చాయి. సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగుల వేతనాన్ని సవరించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రతి 10 సంవత్సరాలకు ఒక పే కమిషన్‌ను ఏర్పాటు చేస్తుంది. అయితే 8వ వేతన సంఘం ఇప్పుడు ఏర్పాటు చేస్తే.. 2026లో అమలులోకి తీసుకురావొచ్చని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.