AP PCC : వైఎస్ షర్మిల చేతికి పీసీసీ పగ్గాలు - ఇవాళే బాధ్యతల స్వీకరణ
AP PCC Chief YS Sharmila: ఏపీ పీసీసీ చీఫ్ గా వైఎస్ షర్మిల ఇవాళ బాధ్యతలు తీసుకోనున్నారు. శనివారమే కడపకు చేరుకున్న షర్మిల.. ముందుగా వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించారు.
Andhrapradesh Congress : ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్నారు వైఎస్ షర్మిల. ఇవాళ విజయవాడలోని పార్టీ కార్యాలయంలో ఉదయం 11 గంటలకు పీసీసీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. శనివారం మధ్యాహ్నమే హైదరాబాద్ నుంచి ఇడుపులపాయకు బయలుదేరిన షర్మిల... వైఎస్ ఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించారు. రాత్రి ఇడుపులపాయలో బస చేయగా... ఇవాళ ఉదయం కడప నుంచి బయల్దేరి విజయవాడ గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. ఉదయం 11 గంటలకు పీసీసీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు.
ఏపీ పీసీసీ చీఫ్ గా భాద్యతలు తీసుకుంటున్న సందర్భంగా YSR ఘాట్ వద్ద నివాళులు అర్పించానని చెప్పారు వైఎస్ షర్మిల. “నాన్నకు కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు ప్రాణంతో సమానం. అందుకే ఆయన ఆశయాల కోసమే కాంగ్రెస్ లో చేరాను. నాన్న చివరి కోరిక రాహుల్ గాంధీని ప్రధానిని చేయడం. అందుకు నా శాయశక్తులా కృషి చేస్తాను . చివరి వరకు వైఎస్ఆర్ సిద్ధాంతాల కోసం నిలబడతా. ప్రస్తుత పరిస్థితుల్లో సెక్యూలరిజం, ఫ్లూరలిజం అనే పదాలకు అర్ధం, రాజ్యాంగానికి గౌరవం లేకుండా పోయింది. ఇవన్నీ మళ్ళీ నెలకొల్పి దేశానికీ మంచి జరగాలి అంటే అది కాంగ్రెస్ తోనే సాధ్యం” అని ట్వీట్ చేశారు.
ఇప్పటి వరకు ఏపీ పీసీసీ చీఫ్ పదవి బాధ్యతలు చూసిన గిడుగు రుద్రరాజు ఇటీవలే తన పదవి బాధ్యతల నుంచి తప్పుకున్నారు. పీసీసీ పదవికి రాజీనామా చేస్తూ పార్టీ అధ్యక్షుడు ఖర్గేకు లేఖ పంపారు. రాజీనామాకు సంబంధించి ఎలాంటి కారణాలు కూడా చెప్పలేదు. అమలాపురం పట్టణానికి చెందిన గిడుగు రుద్రరాజు... 2022 నవంబరులో ఏపీ పీసీసీ చీఫ్ బాధ్యతలు చేపట్టారు. 2005 నుంచి 2007 వరకు వైద్య ఆరోగ్య శాఖ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ ఛైర్మన్‌గా... 2007 నుంచి 2011 వరకు ఎమ్మెల్సీగా పని చేశారు. గతంలో ఒడిశా రాష్ట్రానికి ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) ఇంచార్జి కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించారు.
షర్మిల పీసీసీ చీఫ్ గా బాధ్యతలు తీసుకోనున్న నేపథ్యంలో... ఏపీ రాజకీయాలు మరింత ఆసక్తికరంగా మారే అవకాశం ఉంది. ఇప్పటికే టీడీపీ- జనసేన పార్టీలు కలిసి పోటీ చేస్తామని చెప్పాయి. ఇక షర్మిల సోదరుడు, ప్రస్తుత సీఎం వైఎస్ జగన్ నేతృత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం సింగిల్ గానే బరిలో ఉంటామని చెబుతోంది. అధికార, ప్రతిపక్ష పార్టీలు అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్న టైంలో.... పలువురు పార్టీలు మారిపోయారు. అంతేకాదు చాలా మంది నేతలు కూడా ఈ లిస్ట్ లో చేరే అవకాశం ఉంది. ఇరు పార్టీల్లో అసంతృప్త నేతలు ఉన్నారు. పలువురు ముఖ్య నేతలు కాంగ్రెస్ గూటికి చేరే అవకాశం ఉందన్న విశ్లేషణలు, అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి.
షర్మిల ప్రస్థానంలోని పలు విషయాలు:
- ప్రస్తుతం 49 ఏళ్ల వైఎస్ షర్మిల.. దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సోదరి అవుతారు.
- 2009లో విమాన ప్రమాదంలో వైఎస్ఆర్ మరణించారు. ఈ నేపథ్యంలో ఆయన మరణాన్ని తట్టుకోలేక చాలా మంది వైఎస్ఆర్ అభిమానులు చనిపోయారు. వారికి సంఘీభావం తెలిపేందుకు ఆయన సోదరుడు జగన్మోహన్ రెడ్డి యాత్రను ప్రారంభించారు. అయితే దీనికి కాంగ్రెస్ హైకమాండ్ మద్దతు ఇవ్వలేదు. ఈ క్రమంలోనే ఆయనతో పాటు తల్లి వైఎస్ విజయమ్మ కాంగ్రెస్ నుంచి బయటికి వచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు.
-షర్మిల కూడా 2020 వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ లో భాగంగానే పని చేశారు. జగన్ జైల్లో ఉన్నప్పుడు... పార్టీ కార్యక్రమాలను దగ్గరుండి చూశారు.
-2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో షర్మిల... తన సోదరుడు వైఎస్ జగన్ స్థాపించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున విస్తృతంగా ప్రచారం చేశారు.
-ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరమవుతూ వచ్చారు. అంతేకాకుండా... తెలంగాణ వేదికగా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని ప్రకటించారు షర్మిల. కొత్త పార్టీ పెట్టిన ఏడాది తర్వాత ఆమె తల్లి వైఎస్ విజయమ్మ తన కుమారుడి పార్టీ అయిన వైఎస్సార్సీపీకి రాజీనామా చేసి షర్మిల పార్టీకి మద్దతు ప్రకటించారు.
- తెలంగాణ వ్యాప్తంగా సుదీర్ఘమైన పాదయాత్రను చేశారు వైఎస్ షర్మిల. కానీ తాజాగా జరిగిన తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మద్దతిచ్చి పోటీ నుంచి విరమించుకున్నారు.
-జనవరి 4వ తేదీన వైఎస్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారు వైఎస్ షర్మిల. ఖర్గే, రాహుల్ గాంధీ సమక్షంలో ఢిల్లీ వేదికగా కాంగ్రెస్ పార్టీలో చేరారు.
- జనవరి 16,2024న ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిలను నియమిస్తూ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయించింది.
-జనవరి 21,2024వ తేదీన ఏపీ కాంగ్రెస్ బాధ్యతలను స్వీకరించనున్నారు వైఎస్ షర్మిల.