MLC Driver Murder row: వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు తల్లి మృతి..-ycp mlc ananta udaya bhaskar filed bail petition to attend his mothers funeral ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Mlc Driver Murder Row: వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు తల్లి మృతి..

MLC Driver Murder row: వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు తల్లి మృతి..

HT Telugu Desk HT Telugu
Aug 22, 2022 09:00 AM IST

కారు డ్రైవర్ హత్య కేసులో నిందితుడిగా రిమాండ్‌లో ఉన్న వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్‌ తల్లి మంగారత్నం మరణించడంతో బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నారు. గత 90రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న ఎమ్మెల్సీ అనంత ఉదయ భాస్కర్‌ బెయిల్ కోసం ఇప్పటికే పలుమార్లు ప్రయత్నించారు.

<p>ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ హత్య కేసు</p>
ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ హత్య కేసు

ఎమ్మెల్సీ అనంత ఉదయ భాస్కర్‌ తల్లి మంగారత్నం ఆదివారం మరణించారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న మంగారత్నంను నాలుగు రోజుల క్రితం కాకినాడ అపోలో ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆదివారం ఆమె మరణించారు. ఆదివారం రాత్రి ఆమె మృతదేహాన్ని కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

మరోవైపు కారు డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఎమ్మెల్సీ ఉదయ భాస్కర్‌ను ఇప్పటికే అరెస్ట్‌ చేసి రిమాండ్‌‌కు పంపారు. ఎమ్మెల్సీని రిమాండ్‌కు పంపి గత శనివారంతో 90రోజులు ముగిశాయి. దీంతో ఎమ్మెల్సీకి బెయిల్ లభించడానికి మార్గం సుగమం చేయడానికే పోలీసులు తాత్సారం చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి దీంతో గత వారం పోలీసులు హడావుడిగా అనంత ఉదయ భాస్కర్‌ మీద ఛార్జిషీటు దాఖలు చేశారు. పోలీసులు వ్యూహాత్మకంగా తమ మీద విమర్శలు రాకుండా చివరి నిమిషంలో ఛార్జిషీటు దాఖలు చేసినా, ఎస్సీ ఎస్టీ అత్యాచార కేసుల ప్రత్యేక న్యాయస్థానం దానిని తిరస్కరించింది.

చార్జిషీటులో పూర్తి వివరాలు లేకపోవడం, కేసు దర్యాప్తు అసమగ్రంగా ఉండటంతో ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయస్థానం పోలీసులు దాఖలు చేసిన ఛార్జిషీటును తిరస్కరిస్తున్నట్లు ప్రకటించింది. ఆ తర్వాత నిందితుడు ఉదయ భాస్కర్‌ తరపున మరో బెయిల్ పిటిషన్‌ దాఖలైంది. ఈ బెయిల్ పిటిషన్ సోమవారం విచారణకు రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఆదివారం నిందితుడి తల్లి మరణించారు.

కిడ్నీ సమస్యలతో చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న మంగారత్నంకు అనంత ఉదయ భాస్కర్ ఒక్కడే కుమారుడు కావడంతో తల కొరివి పెట్టేందుకు అనుమతించాలని నిందితుడి బంధువులు జైలు అధికారులకు విజ్ఞప్తి చేశారు. దీనికి రాజమండ్రి సెంట్రల్ జైలు అధికారులు నిరాకరించారు. న్యాయస్థానం అనుమతి లేకుండా నిందితుడికి పెరోల్ ఇచ్చే అధికారం తమకు లేదని స్పష్టం చేవారు. దీంతో అత్యవసర పిటిషన్ దాఖలు చేసేందుకు అనంతబాబు బంధువులు సిద్ధమవుతున్నారు.

తల్లి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు అనుమతించాల్సిందిగా ఎస్సీ, ఎస్టీ కేసుల ప్రత్యేక న్యాయస్థానంలో బెయిల్ పిటిషన్ దాఖలు చేయనున్నారు. హత్య కేసులో అరెస్టైన తర్వాత అనంత ఉదయ భాస్కర్‌ ఇప్పటికే మూడుసార్లు బెయిల్ పిటిషన్లు దాఖలు చేసినా న్యాయస్థానం వాటిని తిరస్కరించింది. తాజాగా అతని తల్లి మరణించడంతో బెయిల్‌పై బయటకు రావడానికి మరో మారు ప్రయత్నించనున్నారు. మరోవైపు అనంతబాబును కాపాడ్డానికి పోలీసులు నానా పాట్లు పడుతున్నారని, నిందితుడికి చట్ట ప్రకారం శిక్ష పడేందుకు కృషి చేయకపోగా, వీలైనంత త్వరగా బయట పడేయడానికి శక్తిమేరకు కృషి చేస్తున్నారని ఏపీ పౌర హక్కుల సంఘం ఆరోపిస్తోంది. అనంత ఉదయ భాస్కర్ విషయంలో ఏపీ ప్రభుత్వ ఒత్తిడితోనే పోలీసులు కేసును నీరు గార్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తున్నారు.

Whats_app_banner