Jagan Vs Oppositions: ప్రత్యర్థుల ఒంటరి పోరుకు.. జగన్ బలవంతం ఎందుకు?
Jagan Vs Oppositions: ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వకూడదని పవన్ కళ్యాణ్ ఓవైపు, దత్తతండ్రి, దత్తపుత్రుడి పేరుతో ముఖ్యమంత్రి మరో వైపున మాటల తూటలు పేలుస్తున్నారు. దమ్ముంటే ఒంటరిగా పోటీకి రావాలని పదేపదే సిఎం చెప్పడం వెనుక ఆంతర్యం ఏమిటి?
Jagan Vs Oppositions: ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ ప్రత్యర్థుల్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పదేపదే కవ్విస్తున్నారు. ఒంటరిగా పోటీ చేసే సత్తా లేదా అని ఎద్దేవా చేస్తున్నారు. పొత్తులు, ఎత్తులు తప్ప దమ్ము, ధైర్యంగా రాజకీయాలు చేయలేరని ప్రత్యర్థుల్ని విమర్శిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో అధికార పార్టీని ఓడించడానికి రాజకీయ ప్రత్యర్థులంతా ఒక్కటవుతున్నారు. ప్రధాన ప్రతిపక్షం టీడీపీ, జనసేన మధ్య రాజకీయ అవగాహన దాదాపుగా ఖరారైంది. ఈ కూటమితో జట్టు కట్టే మిగిలిన భాగస్వామ్య పక్షాలపైనే స్పష్టత రావాల్సి ఉంది. బీజేపీతో కలిసి పయనించాలని జనసేన భావిస్తున్నా, ఆ పార్టీ మనసులో ఏముందో ఇంకా స్పష్టత లేదు.
మరోవైపు జనసేన-టీడీపీ కూటమితో కలిసి పయనించే విషయంలో పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని బీజేపీ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ఇప్పటికే ప్రకటించారు. సిపిఎం ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోకపోయినా, వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేనతో తాము కలిసి పోటీ చేస్తామని సిపిఐ ప్రకటించింది. టీడీపీ-జనసేనతో బీజేపీ కలిస్తే ఆ కూటమిలో సిపిఐ చేరుతుందా అనే సందేహం కూడా లేకపోలేదు. ఈ విషయంలో తమ వంతు రాకముందే సిపిఐ అభిప్రాయాన్ని ప్రకటించింది.
ముఖ‌్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాత్రం గత కొద్ది కాలంగా ప్రతిపక్షాలపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. తనను ఓడించడానికి ప్రతిపక్షాలన్ని ఏకమవుతున్నాయని ఆరోపిస్తున్నారు. "ఏ చిన్న పొరపాటు జరిగినా పేదలు బ్రతికే పరిస్థితి ఉండదని, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలన్ని నిలిచిపోతాయని హెచ్చరిస్తున్నారు. నాలుగేళ్లలో రెండు లక్షల కోట్ల రుపాయల ప్రత్యక్ష, పరోక్ష నగదు బదిలీ పథకాల ద్వారా ప్రజలకు లబ్ది చేకూరిందని గుర్తు చేస్తున్నారు. ప్రజలు ఏ పొరపాటు చేసిన దానికి మూల్యం చెల్లించాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు.
ఒంటరిగా పోటీ చేసే ధైర్యం లేదా…?
ప్రధానుల్ని రాష్ట్రపతుల్ని తానే చేశానని చంద్రబాబు చెప్పుకుంటారని, 175 నియోజక వర్గాల్లో ఒంటరిగా బరిలోకి దిగే సత్తా మాత్రం లేదని ఎద్దేవా చేస్తున్నారు. 175స్థానాల్లో పోటీ చేస్తే తన పార్టీకి రెండో స్థానం వస్తుందనే నమ్మకం కూడా బాబుకు లేదని విమర్శిస్తున్నారు. 14ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి 175 నియోజక వర్గాల్లో పోటీకి నిలిపే స్థితిలో కూడా లేరని విమర్శిస్తున్నారు.
ఇక పవన్ కళ్యాణ్ రెండు చోట్ల పోటీ చేస్తే, ఎమ్మెల్యేగా కూడా వద్దు అని జనం నమస్కారం పెట్టారని, పదేళ్ల క్రితం రాజకీయ పార్టీ పెట్టి ఆ పార్టీని పెట్టిన దత్తపుత్రుడు 175 నియోజక వర్గాల్లో కనీసం అభ్యర్థుల్ని పెట్టలేని స్థితిలో ఉన్నాడని విమర్శిస్తున్నారు.
చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లను ముఖ్యమంత్రి నేరుగా టార్గెట్ చేయడం వెనుక పెద్ద వ్యూహమే ఉన్నట్టు తెలుస్తోంది. 2019 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ 175 స్థానాల్లో పోటీ చేస్తే 151 స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులు గెలిచారు. మొత్తం పోలైన ఓట్లలో ఆ పార్టీకి 49.95శాతం ఓట్లు వచ్చాయి. టీడీపీ 175 స్థానాల్లో పోటీ చేస్తే 23 స్థానాల్లో గెలిచింది. ఆ పార్టీకి 1,23,04,668 ఓట్లు వచ్చాయి. తెలుగు దేశం పార్టీకి 39.17శాతం ఓట్లు వచ్చాయి. అధికార పార్టీకి ప్రధాన ప్రతిపక్షానికి మధ్య దాదాపు పది శాతం ఓట్ల వ్యత్యాసం ఉంది
2019 ఎన్నికల్లో 137స్థానాల్లో పోటీ చేసిన జనసేన ఒక్క చోట మాత్రమే గెలిచింది. ఆ పార్టీ 121 నియోజక వర్గాల్లో డిపాజిట్లు కూడా కోల్పోయింది. మొత్తం పోలైన ఓట్లలో 17,36,811ఓట్లు జనసేనకు దక్కాయి. పోటీ చేసిన స్థానాల్లో 7శాతం ఓట్లను ఆ పార్టీ దక్కించుకుంది. సిపిఐ, సిపిఎం పార్టీలు చెరో ఏడు స్థానాల్లో పోటీ చేశాయి. 173 స్థానాల్లో పోటీ చేసిన బీజేపీ మొత్తం ఓట్లలో 0.85శాతం మాత్రమే ఓట్లు దక్కాయి. పోలైన ఓట్లలో 2,64,437 ఓట్లు మాత్రమే బీజేపీకి దక్కాయి.
వైసీపీ వ్యతిరేక ఓటును చీలనివ్వనని పదేపదే చెబుతున్న పవన్ కల్యాణ్ టీడీపీ ఓటు బ్యాంకుతో పాటు జనసేన, బీజేపీలకు ఉన్న సంస్థాగత బలం ఒక్కటైతే అధికార పార్టీని ఓడించవచ్చని భావిస్తున్నారు. అధికారానికి పది శాతం ఓట్ల దూరంలో నిలిచిపోయిన టీడీపీకి కూడా ఈ ఆఫర్ బాగానే ఉన్నట్టు కనిపిస్తోంది. ముఖ్యమంత్రి పదవి దక్కేంత బలం తనకు సొంతంగా లేదనే క్లారిటీ కూడా పవన్ కళ్యాణ్‌కు రావడంతోనే మనసులో మాట బయటపెట్టేసినట్టు తెలుస్తోంది.
ప్రత్యర్థులు ఏకమైతే కష్టమేనా…
రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలన్ని కలిసి పోటీ చేస్తే తమ గెలుపు అవకాశాలకు గండిపడుతుందని జగన్ భావిస్తున్నారు. 2009లో సైతం మహా కూటమి పేరుతో ఇదే తరహా పోటీని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యర్థుల నుంచి ఎదుర్కోవాల్సి వచ్చింది. నాటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి రాష్ట్రంలో విజయం సాధించింది. ఇప్పుడు ఏపీలో ఉన్న పరిస్థితుల్లో విపక్షాల దూకుడుకు ముందు నుంచి కట్టడి చేయాలని జగన్ భావిస్తున్నారు. అందుకే పదేపదే వారిని రెచ్చగొట్టడంతో పాటు తనను ఓడించడానికి విపక్షాలన్ని ఏకం అవుతున్నాయనే సందేశాన్ని ప్రజలకు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
ప్రజలే తన ధైర్యమని, వారినే తాను నమ్ముకున్నానని ధీమా వ్యక్తం చేయడం వెనుక కూడా ఎమోషనల్‌గా వారితో కనెక్ట్ అయ్యే ప్రయత్నంగానే కనిపిస్తోంది. చేసిన మంచి మాత్రమే తాను నమ్ముకున్నామని, ప్రజలకు చేసిన మంచిని మాత్రమే చెబుతున్నానని, మంచి జరిగితేనే తన వైపు నిలబడాలని చెబుతున్నారు.
జగన్ ప్రచారం వెనుక ఏ కారణాల వల్ల కూడా ఓటు బ్యాంకు ప్రత్యర్థుల వైపు మళ్లకుండా చూడటమే లక్ష్యంగా కనిపిస్తోంది. ఎన్నికలకు ఏడాది సమయం ఉండటంతో ఇప్పట్నుంచే ప్రత్యర్థులు తనకు వ్యతిరేకంగా ఉన్నారనే సందేశాన్ని ప్రజలకు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ప్రత్యర్థుల వల్ల తన విజయావకాశాలు ఏ మాత్రం తగ్గకుండా ఉండేందుకు అన్ని ప్రయత్నాలు ప్రారంభించారు. ప్రత్యర్థుల ఇమేజ్‌ను ప్రజల్లో తగ్గించే ప్రయత్నాలను ప్రారంభించారు. తనను బలమైన నాయకుడిగా చూపించుకోవడంతో పాటు ప్రత్యర్థులకు ఆ సత్తా లేదనే అభిప్రాయాన్ని ప్రజల్లో కల్పించేందుకే తరచూ ఈ తరహా వ్యాఖ్యలు చేస్తున్నారు.