Water for Krishna Delta : కృష్ణా డెల్టాకు సాగునీరు విడుదల
వరుసగా మూడో ఏడాది కృష్ణాడెల్టా రైతాంగానికి జూన్ రెండోవారంలో సాగునీటిని విడుదల చేశారు. జలవనరుల శాఖ మంత్రి అంబటిరాంబాబు ప్రకాశం బ్యారేజీ నుంచి కృష్ణాడెల్టా కాల్వలకు నీటిని విడుదల చేశారు.
ఎగువన జలాశయాల్లో నీరు అందుబాటులో ఉండటంతో కృష్ణాడెల్టా కాల్వలకు సాగునీటిని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఈ ఏడాది రిజర్వాయర్లలో నీటి మట్టం ఆశాజనకంగా ఉండటం, వర్షాలు సకాలంలో కురిసే అవకాశాలు ఉండటంతో జూన్ రెండోవారంలోనే వ్యవసాయ పనులు ప్రారంభించుకోడానికి నీటిని విడుదల చేస్తున్నారు. కృష్ణాడెల్టా తూర్పు డెల్టా ప్రధాన రెగ్యులేటర్ వద్ద మంత్రులు, ప్రజాప్రతినిధులు కృష్ణమ్మకు పూజలు నిర్వహించి, సారె సమర్పించారు. వేదమంత్రోచ్చరణ మధ్య డెల్టా కాల్వలకు నీటిని విడుదల చేశారు.
జూన్ 1న గోదావరి డెల్టాకు నీటిని విడుదల చేసిన ప్రభుత్వం జూన్ 10న కృష్ణా డెల్టాకు నీటిని విడుదల చేసింది. నెలాఖరుకల్లా పట్టిసీమ లిఫ్ట్ నుంచి గోదావరి జలాలను తరలించే అవకాశం ఉండటంతో ఈ ఏడాది సాగునీటికి ఎలాంటి ఇబ్బందులు ఉండవని భావిస్తున్నారు.
ప్రకాశం బ్యారేజీ తూర్పు డెల్టా రెగ్యులేటర్ల నుంచి డెల్టా కాల్వలకు మంత్రి అంబటి రాంబాబు నీటిని విడుదల చేశారు. తూర్పు డెల్టా కాల్వలలకు 2వేల క్యూసెక్కులు, పశ్చిమ డెల్టా కాల్వలకు 500క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. రైతుల అవసరానికి అనుగుణంగా సాగునీటిని విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కృష్ణా డెల్టాలో 13.7లక్షల ఎకరాల ఆయకట్టుకు ప్రకాశం బ్యారేజీ నుంచి నీరు అందుతుంది. ఖరీఫ్ , రబీ సీజన్‌లలో దాదాపు 150టిఎంసిల నీరు వ్యవసాయానికి అవసరం అవుతుందని అంచనా. ప్రకాశం బ్యారేజీలో నీటి నిల్వకు అవకాశం లేకపోవడంతో ఎగువున పులిచింతల నీటిని క్రమంగా సాగు అవరాలకు దిగువకు విడుదల చేస్తారు. ప్రస్తుతం పులిచింతలలో 33.27 టిఎంసిల నీరు అందుబాటులో ఉంది.
రుతుపవనాలు ఆశాజనకంగా ఉండటంతో డెల్టా రైతాంగానికి ముందుగానే నీటిని విడుదల చేస్తున్నట్లు మంత్రి రాంబాబు చెప్పారు. ఖరీఫ్‌కు సాగునీటికి ఎలాంటి ఇబ్బందులు ఉండవన్నారు. రైతు బాగుంటేనే దేశం బాగుంటుందని మంత్రి వ్యాఖ్యనించారు. టీడీపీ నేతలు చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని, తనపై ఎన్ని కేసులైనా పెట్టుకోవచ్చన్నారు. డెల్టాకు నీటి విడుదల కార్యక్రమంలో మంత్రులు జోగిరమేష్, మెరుగు నాగార్జున, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
టాపిక్