Garbage Tax Issue: చెత్త పన్ను వసూళ్లతో చిక్కులు.. కార్యదర్శులపై కమిషనర్ల వేటు-visakha commissioner suspended ward secretaries for not collecting garbage tax ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Garbage Tax Issue: చెత్త పన్ను వసూళ్లతో చిక్కులు.. కార్యదర్శులపై కమిషనర్ల వేటు

Garbage Tax Issue: చెత్త పన్ను వసూళ్లతో చిక్కులు.. కార్యదర్శులపై కమిషనర్ల వేటు

HT Telugu Desk HT Telugu
Jun 22, 2023 09:41 AM IST

Garbage Tax Issue: ఏపీలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న చెత్త పన్ను చిరుద్యోగుల పాలిట శాపంగా మారింది.పన్ను వసూళ్లలో వెనకబడ్డారంటూ పలు కార్పొరేషన్లు, మునిసిపాలిటీల్లో ఉద్యోగులను సస్పెండ్ చేయడం కలకలం రేపుతోంది.

విశాఖపట్నంలో కమిషనర్ ఛాంబర్ ఎదుట బైఠాయించిన కార్యదర్శులు
విశాఖపట్నంలో కమిషనర్ ఛాంబర్ ఎదుట బైఠాయించిన కార్యదర్శులు

Garbage Tax Issue: ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చినట్టు ఏపీలో చెత్త పన్న వసూళ్లు శానిటేషన్ సెక్రటరీల ఉద్యోగాలకు ఎసరు తెచ్చాయి. చెత్త సేకరణలో వెనకబడ్డారంటూ పలు మునిసిపల్ కార్పొరేషన్లలో ఉన్నతాధికారులు దిగువ స్థాయి ఉద్యోగులను చాలా కాలంగా వేధిస్తున్నారు. ప్రధానంగా వార్డు సచివాలయ కార్యదర్శులు, శానిటేషన్ సెక్రటరీలదే పన్ను వసూలు చేసే బాధ్యత అని తేల్చడంతో అవి వసూలు చేయలేక సతమతమవుతున్నారు.

విశాఖ నగరంలో చెత్త సేకరణ కోసం యూజర్‌ ఛార్జీలు వసూలు చేయడంలో వెనుకపడ్డారని 10 మంది వార్డు శానిటేషన్, ఎన్విరాన్‌మెంట్‌ సెక్రటరీలపై జీవీఎంసీ కమిషనర్‌ సాయికాంత్‌వర్మ సస్పెన్షన్‌ వేటు వేశారు.

ప్రజలు రుసుములు చెల్లించకపోతే తమపై ఎలా చర్యలు తీసుకుంటారని ప్రశ్నిస్తూ సచివాలయ కార్యదర్శులు బుధవారం జీవీఎంసీ కార్యాలయంలోని కమిషనర్‌ గది ముందు బైఠాయించారు. తమను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని నినాదాలు చేశారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి, వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినా వినకుండా దాదాపు గంటన్నరపాటు అక్కడే కూర్చున్నారు. తరువాత బలవంతంగా తరలించడానికి రెండు వ్యాన్లు రప్పించారు. అధికారులు కార్యదర్శులతో మాట్లాడి గురువారం ఉదయం కమిషనర్‌తో చర్చలు జరపడానికి ఏర్పాట్లు చేస్తామని హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు.

10మంది పారిశుద్ధ్య, పర్యావరణ కార్యదర్శులను సస్పెండ్‌ చేయడంపై సచివాలయ ఉద్యోగుల్లో కలవరం రేగుతోంది. రాష్ట్రంలో మొదటి విడతలో ఎంపిక చేసిన 42 పుర, నగరపాలక సంస్థల్లో 2021 అక్టోబరు 2 నుంచి ఇళ్లు, దుకాణాల నుంచి చెత్త సేకరణ కార్యక్రమం ప్రారంభమైంది. దీనికి సంబంధించి వినియోగ రుసుములను ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఉంది. ప్రతి ఇంటికి రూ.30 నుంచి గరిష్టంగా రూ.120వరకు వసూలు చేస్తున్నారు. పన్ను వసూలు చేసే బాధ్యతను కార్యదర్శుల నెత్తిన పెట్టారు. వీటి వసూళ్లు ప్రతినెలా 50-60 శాతానికి మించడం లేదు. లక్ష్యాలను చేరుకోని వారికి కొద్ది రోజుల క్రితం వరకు మెమోలిచ్చారు. తాజాగా అధికారులు సస్పెన్షన్లకు దిగడంపై ఆందోళన వ్యక్తమవుతోంది.

రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు సిద్ధమైన ఉద్యోగులు…

చెత్త పన్ను వసూలులో వెనుక బడ్డారని గ్రామ సచివాలయ కార్యదర్శులను విశాఖ మున్సి పల్ కమిషనర్ సస్పెండ్ చేయడం అన్యాయమని రాష్ట్ర శానిటేషన్, ఎన్విరాన్మెంట్ సెక్రటరీల అసోసియేషన్ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు గుజ్జుల ఈశ్వరయ్య పేర్కొన్నారు.

ప్రతిపక్ష పార్టీలు పన్నులు చెల్లించవ ద్దని ప్రజలకు పిలుపునిస్తే.. ఆయా పార్టీలపై చర్యలు తీసు కోకుండా పారిశుద్ధ్య, పర్యావరణ కార్యదర్శులను సస్పెండ్ చేయడం హేయమైన చర్య అని ఆరోపించారు. ఉన్నతాధికారుల మెప్పు కోసం సచివాలయ కార్యదర్శులను బలి చేయడం సరికాదన్నారు. నిండు గర్భిణులు, చిన్న పిల్లల తల్లులను ఉదయం 4.30 గంటలకే రావాలని కమిషనర్లు వేధిస్తే కోర్టులను ఆశ్రయిస్తామని హెచ్చరించారు.

అధికారులు వైఖరికి నిరసనగా సచివాలయ కార్య దర్శులు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరువుతు న్నట్లు తెలిపారు. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం సచివాల యాల్లో ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 వరకు విధులు నిర్వహించాల్సి ఉండగా కొందరు కమిషనర్లు ఉదయం 5గంటలకే హాజరవ్వమని చెప్పడం తగద న్నారు. సచివాలయ కార్యదర్శులపై వేధింపులు ఆపకపోతే ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. వార్డు సచివాలయ సమస్యలపై ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని న్యాయం చేయాలని కోరారు.

Whats_app_banner