Us Visa Slots: గంటల వ్యవధిలో యూఎస్ వీసా ఇంటర్వ్యూ స్లాట్ల భర్తీ..-us visa interview slots filled within hours after release ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Us Visa Slots: గంటల వ్యవధిలో యూఎస్ వీసా ఇంటర్వ్యూ స్లాట్ల భర్తీ..

Us Visa Slots: గంటల వ్యవధిలో యూఎస్ వీసా ఇంటర్వ్యూ స్లాట్ల భర్తీ..

HT Telugu Desk HT Telugu

Us Visa Slots: అమెరికా వీసాల కోసం ఇంటర్వ్యూ తేదీలు విడుదలైన గంటల వ్యవధిలోనే భర్తీ అయిపోయాయి. దేశంలోని ఐదు ప్రాంతాల్లో ఉన్న యూఎస్ కాన్సులేట్ కార్యాలయాల్లో ఢిల్లీ, హైదరాబాద్ కాన్సులేట్‌లలో ఇంటర్వ్యూ తేదీలన్ని నిండిపోయాయి.

గంటల్లో వీసా స్లాట్ల భర్తీ

Us Visa Slots: అమెరికాలో ఉన్నత విద్యాభ్యాసం కోసం ఎదురు చూస్తున్న విద్యార్ధులు వీసా అపాయింట్‌మెంట్ల కోసం పోటీ పడటంతో స్లాట్లు విడుదల చేసిన గంటల వ్యవధిలోనే నిండిపోయాయి. దేశంలోని ఐదు అమెరికా కాన్సులేట్ కార్యాలయాల్లో ఇంటర్వ్యూల కోసం అపాయింట్‌మెంట్ తేదీలు విడుదల చేస్తే హైదరాబాద్, ఢిల్లీల్లో స్లాట్లు పూర్తయ్యాయి.

ఈ ఏడాది ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో ప్రారంభమయ్యే విద్యాసంవత్సరానికి మొదటి విడతలో దిల్లీ, ముంబయి, చెన్నై, కోల్‌కతా, హైదరాబాద్‌లలోని అమెరికా కార్యాలయాల పరిధిలో వీసా స్లాట్లు విడుదలయ్యాయి. ఫాల్‌ విద్యా సంవత్సరంలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు భారత్‌ నుంచి ఉన్నత విద్య కోసం అమెరికాకు వెళుతుంటారు.

గత ఏడాది మాదిరి ఈసారి కూడా విద్యార్థులకు అధిక ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు గత నెలలో యూఎస్‌ ప్రభుత్వం ప్రకటించింది. దేశంలోని 5 కాన్సులేట్‌ కార్యాలయాల్లో తాజాగా పెద్ద సంఖ్యలో జూన్‌ నెలకు వీసా స్లాట్లను విడుదల చేశారు. హైదరాబాద్‌, దిల్లీల్లో ఇంటర్వ్యూల కోసం స్లాట్లు విడుదల చేసిన మూడు, నాలుగు గంటల్లోనే నిండిపోయాయి.

చెన్నై, ముంబై, కోల్‌కత్తా కార్యాలయాల్లో స్లాట్లు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం తొలివిడతగా వీసా స్లాట్లు జారీ చేసినట్లు అమెరికా ప్రభుత్వం ప్రకటించింది. ఈ నెల చివరిలో లేదా వచ్చేనెల మొదటివారంలో మరో విడత ఇంటర్వ్యూ తేదీలను అందుబాటులోకి తీసుకురానున్నారు.

మరో వైపు టూరిస్ట్‌ వీసాపై తొలిసారి అమెరికా వెళ్లాలనుకునే వారికి ఎదురుచూపులు తప్పడం లేదు. గత డిసెంబరు, జనవరి తరవాత పర్యాటక బి1/బి2 వీసా స్లాట్లు విడుదల కాలేదు. తాజాగా స్వల్ప సంఖ్యలో వాటిని విడుదల చేయడంతో కొద్ది నిమిషాల వ్యవధిలో భర్తీ అయ్యాయి.

వీసా పునరుద్ధరణ దరఖాస్తుదారులు ఇంటర్వ్యూకు హాజరయ్యే అవసరం లేకుండా డ్రాప్‌ బాక్స్‌ సదుపాయాన్ని గతేడాది అమెరికా అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇప్పటికే పర్యాటక వీసా ఉన్నవారు విద్యార్థి వీసా కోసం దరఖాస్తు చేసుకుంటే వారికి కూడా ఇంటర్వ్యూ నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు ప్రకటించారు. తొలిసారి వీసా కోసం దరఖాస్తు చేసుకున్న వారిని మాత్రమే కాన్సులేట్‌లలో ఇంటర్వ్యూకు ఆహ్వానిస్తున్నారు.