TTD White Paper: శ్రీవాణి ట్రస్టు విరాళాలు రూ.861కోట్లు.. టీటీడీ శ్వేతపత్రం విడుదల-ttd chairman subbareddy released a white paper on srivani trust donations ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ttd White Paper: శ్రీవాణి ట్రస్టు విరాళాలు రూ.861కోట్లు.. టీటీడీ శ్వేతపత్రం విడుదల

TTD White Paper: శ్రీవాణి ట్రస్టు విరాళాలు రూ.861కోట్లు.. టీటీడీ శ్వేతపత్రం విడుదల

HT Telugu Desk HT Telugu
Jun 23, 2023 09:01 AM IST

TTD White Paper: తిరుమల శ్రీవాణి ట్రస్టు విరాళాలపై రాజకీయ దుమారం రేగుతున్న వేళ, గత నాలుగేళ్లలో శ్రీవాణి ట్రస్టుకు వచ్చిన విరాళాలపై టీటీడీ శ్వేత పత్రాన్ని విడుదల చేసింది. శ్రీవాణి ట్రస్టుకు వచ్చే విరాళాలతో ఆలయాల నిర్మాణం, పునరుద్ధరణ చేపడుతున్నట్లు ప్రకటించారు.

టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి
టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి

TTD White Paper: టీటీడీ విరాళాలపై ఛైర్మన వైవీ సుబ్బారెడ్డి శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. ఇటీవలి కాలంలో టీడీపీ, జనసేన నాయకులు టీటీడీ విరాళాలపై పెద్ద ఎత్తున అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ నాయకుడు బండారు శ్రీవాణి ట్రస్టుకు విరాళం ఇచ్చినా తనకు రశీదులు ఇవ్వలేదని, విరాళాలు పక్కదారి పడుతున్నాయని ఆరోపించారు. ఈ వ్యవహారం రాజకీయంగా దుమారం రేపడంతో ఇప్పటికే శ్రీవాణి ట్రస్టు ద్వారా తీసుకుంటున్న విరాళాలపై ఈవో వివరణ ఇచ్చారు.

తాజాగా విరాళాలపై శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. ఇటీవల కొందరు శ్రీవాణి ట్రస్టుపై అభియోగాలు చేశారని, అవన్నీ అవాస్తవమని సుబ్బారెడ్డి చెప్పారు. బంగారం డిపాజిట్ల మీద, ఫిక్సిడ్ డిపాజిట్ల మీద, టీటీడీ ఆస్తుల మీద కూడా శ్వేతపత్రాలు విడుదల చేశామన్నారు.

శ్రీవాణి ట్రస్టుకు పదివేల విరాళం ఇచ్చి విఐపి దర్శనాలు కల్పిస్తున్నామని స్పష్టం చేవారు. మే 31 ,2023 వరకు శ్రీవాణి ట్రస్టుకు 861 కోట్లు నిధులు వచ్చాయని వివరణ ఇచ్చారు. ప్రస్తుతం ః వివిధ బ్యాంకుల్లో 602.60 కోట్లు డిపాజిట్లు ఉన్నాయని చెప్పారు. ఎస్.బి ఖాతా క్రింద రోజూవారీ వచ్చే డబ్బు 139 కోట్లు వివిధ బ్యాంకుల్లో ఉందని చెప్పారు. డిపాజిట్లుపై వడ్డీ రూపంలో 36.50 కోట్లు వచ్చిందన్నారు.

టీటీడీకి వివిధ రూపాల్లో వచ్చే విరాళాలను దేవాలయాలు నిర్మాణం, పురాతన ఆలయాల పునర్నిర్మాణానికి ఇప్పటిదాకా 120.24 కోట్లు ఖర్చు చేసినట్లు చెప్పారు. రాజకీయ లబ్ధి కోసం శ్రీవాణీ ట్రస్ట్ పై కొందరు నిరాధారమైన ఆరోపణలు చేశారని సుబ్బారెడ్డి చెప్పారు.

శ్రీవాణి ట్రస్ట్ పై ఆరోపణలు చేసినవారిపై న్యాయసలహా తీసుకొని కచ్చితంగా కేసులు పెడతామని హెచ్చరించారుు. టిటిడిలో ఎంతటి వాడైన అవినీతి చేయడానికి భయపడాల్సిందేనని, తప్పు చేస్తే శిక్ష తప్పదు అది తానైనా శిక్షకు గురవుతామని చెప్పారు.

ఏపీతో సహా కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాలలో 127 ప్రాచీన ఆలయాల పునరుద్ధరణకు 139 కోట్లు కేటాయించినట్లు సుబ్బారెడ్డి వివరించారు. భజన మందిరాలు, ఎస్సీ, ట్రైబల్ ప్రాంతాలలో 2,273 ఆలయాల నిర్మాణానికి పూనుకున్నట్లు చెప్పారు.

వివిధ ప్రాంతాల్లో ఆలయాల నిర్మాణం కోసం రూ.227 కోట్ల 30 లక్షలు కేటాయింపులు జరిగాయని వివరించారు. శ్రీవాణి ట్రస్ట్ నిధులపై ఎటువంటి అనుమానాలు వున్నా నేరుగా టీటీడీ ని సంప్రదించవచ్చన్నారు. ఎవరితో తనికీ చేయించుకున్నా తమకు అభ్యంతరం లేదన్నారు.

Whats_app_banner