ASR District Holiday: తుఫాన్, భారీ వర్షాల నేపథ్యంలో అల్లూరి సీతారామరాజు జిల్లాలో గురువారం కూడా విద్యా సంస్థలకు సెలవు ప్రకటిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ సమిత్ కుమార్ ప్రకటించారు. జిల్లాలో మరో రెండు, మూడ్రోజులు వర్షాలు కురిసే అవకాశముందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అన్ని యాజమాన్యాలలో నిర్వహిస్తున్న విద్యాసంస్థలకు స్థానిక సెలవు ప్రకటిస్తున్నట్లు పేర్కొన్నారు.
తుఫాను ప్రభావంపై జిల్లా వ్యవసాయాధికారులు, ఉద్యానవన అధికారులు, ఎంపిడిఓలు, తహశీల్దారులతో కలెక్టర్ శ్రీ. సుమిత్ కుమార్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈనెల 9వ తేదీ నుండి తుఫాను నష్టాలపై ఎన్యూమరేషన్ చేపట్టాలని సూచించారు. జిల్లాలో పంట నష్టాలపై రైతులు ఆందోళన చెందవద్దని, పంట నష్టాలపై ప్రభుత్వానికి నివేదించి నష్ట పరిహారం అందించడానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
తుఫాను నష్టాలపై కచ్చితమైన నివేదికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. కల్వర్టులు, రోడ్లు దెబ్బతింటే వెంటనే పునరుద్ధరణ పనులు చేపట్టాలని సూచించారు. పునరుద్ధరణ పనులు చేయకపోతే ప్రమాదాలు, నష్టాలు జరిగే అవకాశం ఉంటుందని, రవాణాకు ఎటువంటి అంతరాయం ఏర్పడకుండా ట్రాఫిక్ క్రమబద్దీకరించాలని అన్నారు.
ఎంపీడీఓలు, తహశీల్దారులు, సచివాలయ సిబ్బంది సమన్వయంతో పనులు చేయాలని, మోటరు పంపులను అద్దెకు తీసుకుని నీటి నిల్వలు తొలగింపు చర్యలు చేపట్టాలన్నారు.
జిల్లా వ్యవసాయాధికారి ఎస్. బి. ఎస్. నంద్ మాట్లాడుతూ జిల్లాలో వరి పంటలు సుమారు 600 హెక్టార్ల వరకు నష్టం జరిగి ఉంటుందని అంచనా వేశామన్నారు. పత్తి 250 హెక్టార్ల వరకు నష్టం వాటిల్లే అవకాశం ఉందన్నారు. జిల్లా ఉద్యానవన అధికారి ఎ. రమేష్ కుమార్ రావు మాట్లాడుతూ.. డుంబ్రిగుడ, అరకు, అనంతగిరి మండలాల్లో కూరగాయలు సాగు చేస్తున్నారని వర్షాలు తగ్గిన తర్వాత అంచనాలు తయారు చేస్తామని చెప్పారు. చింతూరు డివిజన్లో 50 ఎకరాల వరకు మిర్చి పంట దెబ్బతినే అవకాశం ఉందన్నారు.