Tirumala Chakrasnanam : తిరుమలలో వైభవంగా చక్రస్నానం, ముగిసిన నవరాత్రి బ్రహ్మోత్సవాలు
Tirumala Chakrasnanam : తొమ్మిది రోజుల పాటు ఎంతో వైభవంగా జరిగిన తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు నేటితో ముగిశాయి. చివరి రోజు శ్రీవారి చక్రస్నానం నిర్వహించారు.
Tirumala Chakrasnanam : తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన సోమవారం ఉదయం చక్రస్నానం శాస్త్రోక్తంగా జరిగింది. విశేష సంఖ్యలో భక్తులు విచ్చేసి శ్రీవారి పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించారు. తొమ్మిది రోజుల పాటు జరిగిన నవరాత్రి బ్రహ్మోత్సవాలు నేటితో ముగిశాయి. అంతకుముందు తెల్లవారుజామున 4 నుంచి 6 గంటల వరకు స్వామివారికి పల్లకీ ఉత్సవం వైభవంగా జరిగింది. ఉదయం 6 నుంచి 9 గంటల నడుమ శ్రీ భూవరాహస్వామి ఆలయం ముఖ మండపంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారికి, శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్లకు స్నపనతిరుమంజనం వైభవంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ముందుగా విష్వక్సేనారాధన, పుణ్యహవచనం, ముఖ ప్రక్షాళన, ధూపదీప నైవేద్యం, ఛత్ర ఛామర వ్యజన దర్పణాది నైవేద్యం, రాజోపచారం నిర్వహించారు. అర్ఘ్యపాద నివేదనలో భాగంగా పాలు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, గంధంతో స్నపనం నిర్వహించారు. వీటిని శంఖనిధి, పద్మనిధి, సహస్రధార, కుంభధారణలతో వైఖానస ఆగమయుక్తంగా స్నపనం నిర్వహించారు.
చక్రస్నానం - లోకం క్షేమం
తొమ్మిదిరోజుల ఉత్సవాలలో జరిగిన అన్ని సేవలు సఫలమై లోకం క్షేమంగా ఉండడానికి, భక్తులు సుఖశాంతుల్తో ఉండడానికి చక్రస్నానం నిర్వహించారు. ఉత్సవాలు ఒక యజ్ఞమే కనుక యజ్ఞాంతంలో అవభృథస్నానం చేస్తారు. యజ్ఞనిర్వహణంలో జరిగిన చిన్నచిన్న లోపాలవల్ల ఏర్పడే దుష్పరిణామాలు తొలగి, అన్నీ సంపూర్ణ ఫలాలు చేకూరడంకోసం చేసే దీక్షాంతస్నానం అవభృథం. ఈ ఉత్సవాలు చేసిన వారికి, చేయించినవారికి, ఇందుకు సహకరించినవారికీ, దర్శించిన వారికీ అందరికీ ఈ ఉత్సవ యజ్ఞఫలం లభిస్తుంది. ఈ కార్యక్రమంలో టీటీడీ ఛైర్మన్ భూమణ కరుణాకర్ రెడ్డి దంపతులు, ఈవో ఏవీ.ధర్మారెడ్డి దంపతులు, పలువురు బోర్డు సభ్యులు, అధికారులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
అక్టోబరు 24న పార్వేట ఉత్సవం
అక్టోబరు 24వ తేదీ మంగళవారం మధ్యాహ్నం 1 గంట నుంచి రాత్రి 7 గంటల వరకు శ్రీవారి పార్వేట ఉత్సవం నిర్వహించనున్నారు. పార్వేట ఉత్సవం సాధారణంగా మకర సంక్రాంతి మరుసటి రోజైన కనుమ పండుగ నాడు జరుగుతుంది. అధికమాసం కారణంగా నిర్వహించే శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల మరుసటిరోజు కూడా ఈ ఉత్సవం నిర్వహించడం ఆనవాయితీ.