Leopard caught in tirumala: తిరుమల మెట్ల మార్గంలో బోనులో చిక్కిన ఆరో చిరుత-the sixth leopard trapped in a cage set up by the forest department on the tirumala staircase route ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Leopard Caught In Tirumala: తిరుమల మెట్ల మార్గంలో బోనులో చిక్కిన ఆరో చిరుత

Leopard caught in tirumala: తిరుమల మెట్ల మార్గంలో బోనులో చిక్కిన ఆరో చిరుత

HT Telugu Desk HT Telugu
Sep 20, 2023 07:14 AM IST

Leopard caught in tirumala: తిరుమల నడక మార్గానికి సమీపంలోకి వస్తున్న చిరుతల్లో మరొకటి బోనులో చిక్కింది. గత నెల రోజుల వ్యవధిలో తిరుమలలో ఐదు చిరుతల్ని అటవీ శాఖ బంధించింది. వీటిలో రెండింటిని ఇటీవలే అటవీ శాఖ విడిచిపెట్టింది.

తిరుమలలో బోనులో చిక్కిన చిరుత
తిరుమలలో బోనులో చిక్కిన చిరుత

Leopard caught in tirumala: శ్రీవారి భక్తుల భద్రతలో భాగంగా తిరుమల నడక దారిలో ప్రమాదకరంగా సంచరిస్తున్న చిరుతల్ని బంధించే సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నాలను టీటీడీ కొనసాగిస్తోంది. నెల రోజుల వ్యవధిలో ఆరో చిరుతను అటవీ శాఖ బంధించింది. చిన్నారి లక్షితపై దాడి తర్వాత ప్రారంభించిన ఆపరేషన్ చిరుతలో భాగంగా మెట్ల మార్గంలో సంచరిస్తున్న చిరుతల్ని బంధించి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

yearly horoscope entry point

తిరుమలలో భక్తుల్ని బెంబేలెత్తిస్తున్న మరో చిరుత బోనుకు చిక్కింది. దాదాపు నెల రోజులుగా సాగుతున్న ఆపరేషన్‌ చిరుతలో భాగంగా అటవీ శాఖ ట్రాప్‌లో ఐదో చిరుత బోనుకు చిక్కింది. నరసింహ స్వామి ఆలయం సమీపంలో ఏర్పాటు చేసిన బోనులో చిరుత చిక్కడంతో దానిని ఎస్వీ జూకు తరలించారు.

చిన్నారి లక్షితపై దాడి జరిగిన ప్రాంతంలో సంచరిస్తున్న చిరుతను ట్రాప్‌ కెమెరాల్లో గుర్తించారు. నడక మార్గాల్లో పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాల్లో చిరుతల కదలికల్ని అధికారులు గుర్తించారు. ఆగష్టు 11న ఆరేళ్ల లక్షితపై చిరుత దాడి చేయడంతో చిరుతల్ని బంధించేందుకు టీటీడీ, అటవీశాఖ ఆపరేషన్ చిరుత ప్రారంభించారు. నాలుగు రోజుల క్రితం గుర్తించిన అధికారులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. దీంతో ఇప్పటి వరకు ఐదు చిరుతల్ని అటవీ శాఖ అధికారులు బంధించారు. శేషాచలం అటవీ ప్రాంతంలో దాదాపు 45 చిరుతలు ఉన్నాయని అటవీ శాఖ లెక్కలు చెబుతున్నాయి. వీటిలో కొన్ని మాత్రమే తిరుమల మెట్ల మార్గానికి సమీపంలోకి వస్తున్నాయి.

ఈ ఏడాది జూన్ 22న బాలుడు కౌశిక్‌పై మెట్ల మార్గంలో చిరుత దాడి చేసింది. దానిని చూసిన బంధువులు చిరుత వెంటపడటంతో 500మీటర్ల దూరంలో బాలుడిని వదిలేసి పారిపోయింది. గాయపడిన బాలుడిని ఆస్పత్రికి తరలించి చికిత్స చేయడంతో ప్రాణాపాయం తప్పింది.

తిరుమల నడక మార్గంలో చిరుతల సంచరాన్ని పలుమార్లు గుర్తించినా వాటిని పట్టుకునే ప్రయత్నాలు చేయలేదు. బాలుడిని నోట కరుచుకుని చిరుత వెళ్లడంతో దానిని పట్టుకునేందుకు బోనులు ఏర్పాటు చేశారు. జూన్ 24న బోనులో చిక్కిన చిరుతను నల్లమల అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు.

ఆ తర్వాత నరసింహ స్వామి ఆలయం వద్ద ఆగష్టు 11న నెల్లూరు జిల్లాకు చెందిన లక్షితపై చిరుత దాడి చేసి చంపేసింది. నడక మార్గంలో తిరుమల వెళుతున్న బాలికను దాడి చేసి చంపేయడంతో భక్తులు హడలెత్తిపోయారు. దీంతో టీటీడీ అప్రమత్తమై పెద్ద ఎత్తున దిద్దుబాటు చర్యలు చేపట్టారు. చిరుతల నుంచి భక్తులను కాపాడాలనే ఉద్దేశంతో వాటిని బంధించేందుకు చర్యలు చేపట్టారు.

నడక మార్గం వైపుకు వస్తున్న చిరుతల్ని బంధించాలని నిర్ణయించారు. చిరుతల్ని గుర్తించేందుకు వందలాది ట్రాప్‌ కెమెరాలు అమర్చారు.అటవీ శాఖ ప్రయత్నాలు ఫలించి ఆగష్టు 14న చిరుత చిక్కింది. అదే ప్రాంతంలో ట్రాప్‌ కెమెరాల్లో మరో చిరుత సంచరిస్తున్నట్లు గుర్తించారు. నాలుగో చిరుత మాత్రం బోను వరకు రావడం వెనక్కి వెళ్లిపోతుండటంతో చిరుత కదలికల్ని పూర్తి స్థాయిలో అధ్యయనం చేశారు.చిరుతకు ఆహారం చిక్కకుండా అటవీ సిబ్బంది కట్టడి చేయడంతో అది విధిలేని పరిస్థితుల్లో బోనుకు దగ్గరగా వచ్చినట్లు చెబుతున్నారు. వందలాది సిబ్బంది ఇందుకోసం పనిచేసినట్లు అటవీ శాఖ చెబుతోంది. ఆగష్టు 28న నాలుగో చిరుత చిక్కింది. సెప్టెంబర్ 7వ తేదీన మరో చిరుతను అటవీ శాఖ సిబ్బంది బంధించారు. తాజాగా సెప్టెంబర్‌ 20వ తేదీన మరో చిరుత బోనులో చిక్కింది.

నెలన్నర వ్యవధిలోనే ఆరు చిరుతల్ని బంధించారు. ఈ ప్రాంతంలో ఇంకా చిరుతలు ఉన్నాయో లేదో నిర్ధారించనున్నారు. ఆగష్టులో పట్టుకున్న మూడు చిరుతల్ని ప్రస్తుతం ఎస్వీ జూలో సంరక్షణలో ఉంచారు. అటవీ శాఖ పట్టుకున్న చిరుతల్లో రెండు చిరుతల్ని అటవీ శాఖ విడిచిపెట్టింది. వీటిలో ఒకదానికి పూర్తి స్థాయిలో దంతాలు లేకపోవడం, డిఎన్‌ఏ పరీక్షల్లో అవి లక్షితపై దాడి చేయలేదని నిర్ధారణ కావడంతో వాటిని వదిలేశారు.

Whats_app_banner