Kapu Reservations: ఇతరమార్గాల్లో కాపు రిజర్వేషన్లకు ప్రయత్నించాలని హైకోర్టు సూచన-the high court suggested that the government should pressurize by the kapu reservations through alternative methods ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Kapu Reservations: ఇతరమార్గాల్లో కాపు రిజర్వేషన్లకు ప్రయత్నించాలని హైకోర్టు సూచన

Kapu Reservations: ఇతరమార్గాల్లో కాపు రిజర్వేషన్లకు ప్రయత్నించాలని హైకోర్టు సూచన

HT Telugu Desk HT Telugu
Apr 27, 2023 09:55 AM IST

Kapu Reservations: ఆంధ్రప్రదేశ్‌లో కాపు రిజర్వేషన్ల వ్యవహారంలో కోర్టులో వ్యాజ్యాలు దాఖలు చేయడం కంటే ఇతర మార్గాల్లో ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడం మేలని హైకోర్టు సూచించింది. కోర్టు వివాదాలతో జాప్యం జరగొచ్చని అభిప్రాయ పడింది.

కాపు రిజర్వేషన్లపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు
కాపు రిజర్వేషన్లపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు (aphc)

Kapu Reservations: ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు కేటాయించిన 10% కోటాలో కాపులకు 5% రిజర్వేషన్‌ అమలు చేసేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ దాఖలైన పిటిషన్‌పై ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ తరహా వ్యాజ్యాలను ఉపసంహ రించుకుని, ఇతర మార్గాల్లో ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని పిటిషనర్లకు సూచించింది.

రిజర్వేషన్ల అమలు సున్నితమైన వ్యవహారమని, కోర్టులో వ్యాజ్యాలు పెండింగ్‌లో ఉన్నాయనే కారణంతో మొత్తంగా రిజర్వేషన్‌ అమలు విషయంలో ప్రభుత్వం ఆలస్యం చేసే అవకాశం ఉందని వ్యాఖ్యానించింది. ఈ వ్యవహారంలో సరైన సమయంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నామని ధర్మాసనం తెలిపింది.

కాపులకు రిజర్వేషన్‌ అమలు చేయాలని దాఖలైన పిటిషన్లతో పాటు , రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ దాఖలైన వ్యాజ్యాల్లో లోతుగా విచారణ చేయాల్సిన అవసరం ఉందని తెలిపింది. ఈ వ్యవహారంలో కౌంటర్‌దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. వేసవి సెలవుల తర్వాత రిజర్వేషన్ అంశంపై విచారణ చేస్తామని ప్రకటించింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా, జస్టిస్‌ ఎన్‌.జయసూర్యతో కూడిన ధర్మాసనం ప్రభుత్వాన్ని,పిటిషనర్లను ఆదేశించింది.

సుప్రీంకోర్టు సమర్థించింది….

ఈడబ్ల్యూఎస్‌ కోటాలో 10%లో కాపులకు 5% రిజర్వేషన్‌ అమలు చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ కాపు సంక్షేమసేన వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ మంత్రి హరిరామజోగయ్య హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు కేంద్రం కల్పించిన 10 శాతం రిజర్వేషన్‌లో 5% కాపులకు కేటాయిస్తూ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హయాంలో గత ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాన్ని అమలు చేసేలా ఆదేశించాలని కోరారు. ఈ వ్యవహారంపై మరికొన్ని వ్యాజ్యాలు దాఖలయ్యాయి.

తాజా విచారణలో పిటిషనర్‌ తరఫు న్యాయవాది పోలిశెట్టి రాధాకృష్ణ వాదనలు వినిపించారు. గత ప్రభుత్వ హయాంలో ఈడబ్ల్యూఎస్‌లకు ఇచ్చిన 10% రిజర్వేషన్లలో 5 శాతాన్ని కాపులకు కేటాయిస్తూ యాక్ట్‌ 14/2019ని తీసుకొచ్చారని, కాపులకు 5% రిజర్వేషన్‌ కల్పిస్తూ చేసిన చట్టం చెల్లుబాటవుతుందని సుప్రీంకోర్టుకు కూడా సమర్థించిందన్నారు. ఉద్యోగాల భర్తీ, విద్యాసంస్థల ప్రవేశాల్లో కాపులకు రిజర్వేషన్‌ కల్పించేలా మధ్యంతర ఉత్తర్వులివ్వాలని కోరారు.

ఒకే సామాజికవర్గానికే 5 శాతం ఎలా…

మరోవైపు ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లలో ఒకే సామాజిక వర్గానికి ఐదు వాతం రిజర్వేషన్లు ఇవ్వడంపై అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. ఈడబ్ల్యూఎస్‌ 10 శాతం కోటాలో ఒక సామాజికవర్గానికే 5 శాతం రిజర్వేషన్‌ కల్పించడానికి వీల్లేదన్నారు. కాపులకు 5 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తూ.. గత ప్రభుత్వం తీసుకొచ్చిన యాక్ట్‌ 14/2019ని సవాలు చేస్తూ 2019లో పిల్‌ వేశామని చెప్పారు.

ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది సుమన్‌ వాదనలు కౌంటర్‌ దాఖలు చేయడానికి సమయం కావాలని కోరారు. ఈ వ్యవహారంలో కీలకాంశాలు ఇమిడి ఉన్నందున లోతైన విచారణ జరపాల్సిన అవసరం ఉందని హైకోర్టు పేర్కొంది. వ్యాజ్యాన్ని వేసవి సెలవుల తర్వాత విచారించడానికి వాయిదా వేసింది.

IPL_Entry_Point