Congress MP Gopinath: లోక్‌సభలో తెలుగులో ప్రమాణం చేసిన తమిళనాడు కాంగ్రెస్ ఎంపీ గోపీనాథ్
Congress MP Gopinath:పార్లమెంట్‌లో ఆసక్తికరంః తెలుగులో తమిళ ఎంపీ ప్రమాణ స్వీకారం...తెలుగు, ఇంగ్లీష్, హిందీ, ఉర్దూ భాషల్లో తెలంగాణ ఎంపీ ప్రమాణ స్వీకారం చేశారు.
Congress MP Gopinath: పార్లమెంట్ సమావేశాల రెండో రోజు లోక్‌సభలో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఒక రాష్ట్రం ఎంపీ మరోక రాష్ట్రం మాతృ భాషలో ప్రమాణ స్వీకారం చేయడం సంచలనంగా మారింది. లోక్‌సభలో ఎంపీలు తమ మాతృ భాష, లేకుంటే ఇంగ్లీష్, హిందీ భాషల్లోనూ ఏ ఒక్కరో ఇద్దరో సంస్కృతంలోనూ ప్రమాణ స్వీకారం చేస్తారు. అయితే తమిళనాడుకు చెందిన ఓ ఎంపీ మాత్రం తన మాతృ భాష తమిళంలో కాకుండా తెలుగులో ప్రమాణ స్వీకారం చేశారు.
18వ లోక్‌సభ సమావేశాలు రెండు రోజు కొనసాగుతున్నాయి. ప్రొటెం స్పీకర్ భర్తృహరి మహతాబ్, ప్రొటెం స్పీకర్ ప్యానల్ సభ్యులు రాధామోహన్ సింగ్ లోక్‌సభకు ఎన్నికైన సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయిస్తున్నారు. వివిధ రాష్ట్రాల ఎంపీలు తమ మాతృ భాషలో ప్రమాణ చేయగా, బీజేపీ ఎంపీల్లో ఎక్కువ మంది హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ప్రమాణ స్వీకారం చేస్తున్నారు.
అయితే తమిళనాడులోని కృష్ణగిరి లోక్‌సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున గెలుపొందిన ఎంపీ కె. గోపినాథ్ తెలుగులో లోక్‌సభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసి, అందరినీ ఆశ్చర్య పరిచారు. ఓ చేతితో రాజ్యాంగ ప్రతిని పట్టుకొని ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ప్రమాణ స్వీకారం చివరిలో మాత్రం జై తమిళనాడు అని తమిళంలో నినదించారు. ఆయన ప్రమాణ స్వీకారానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
అయితే కృష్ణగిరి జిల్లా తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలను కలుపుతుంది. ఈ జిల్లా ఏపికి సమీపంగా ఉంటుంది. ఇక్కడి ప్రజలు తమిళంతో పాటు తెలుగు, కన్నడ భాషలను కూడా మాట్లాడుతారు. ఇదిలా ఉంచితే, గతంలో తమిళనాడు అసెంబ్లీలో కూడా వివిధ ప్రత్యేక సందర్భాల్లో కొంత మంది తమిళనాడు ఎమ్మెల్యేలు తెలుగులో మాట్లాడారు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత కూడా అసెంబ్లీలో తెలుగులో మాట్లాడం అప్పట్లో సంచలనం అయింది. జయలలిత తెలుగులో మాట్లాడిన మీడియో ఇప్పటికీ కూడా సోషల్ మీడియాలో వివిధ సందర్భాల్లో వైరల్ అవుతుంది.
తెలుగు, ఇంగ్లీష్, హిందీ, ఉర్దూ భాషల్లో తెలంగాణ ఎంపీ ప్రమాణ స్వీకారం
మొత్తం తెలంగాణకు చెందిన 17 మంది సభ్యుల్లో కేంద్ర మంత్రులు జీ.కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఇద్దరు సోమవారం ప్రమాణ స్వీకారం చేయగా, మంగళవారం 15 మంది సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. అందులో తెలుగులో ఎనిమిది మంది, ఇంగ్లీష్‌లో ఐదుగురు, హిందీలో ఒకరు, ఉర్దూలో ఒకరు ప్రమాణ స్వీకారం చేశారు.
తెలుగులో కాంగ్రెస్ ఎంపీలు సురేష్ కుమార్ షెట్కార్ (జహీరాబాద్), మల్లురవి (నాగర్‌కర్నూల్), కె. రఘువీర్ (నల్గొండ), చలమల కిరణ్ కుమార్ రెడ్డి (భువనగిరి), కడియం కావ్య (వరంగల్), బలరామ్ నాయక్ (మహబుబాబాద్), బీజేపీ ఎంపీలు ఈటల రాజేందర్ (మల్కాజ్‌గిరి), డీకే అరుణ (మహబుబ్‌నగర్) ప్రమాణ స్వీకారం చేశారు.
ఇంగ్లీష్‌లో కాంగ్రెస్ ఎంపీలు గడ్డం వంశీ కృష్ణ (పెద్దపల్లి), రామసహాయం రెడ్డి (ఖమ్మం), బీజేపీ ఎంపీలు ధర్మపురి అరవింద్ (నిజమాబాద్), ఎం.రఘునందన్ రావు (మెదక్), కొండా విశ్వేశ్వరరెడ్డి (చేవెళ్ల) ప్రమాణ స్వీకారం చేశారు. హిందీలో బీజేపీ ఎంపీ గొడం నగేష్ (అదిలాబాద్) ప్రమాణ స్వీకారం చేయగా, ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ (హైదరాబాద్) ఉర్దూలో ప్రమాణ స్వీకారం చేశారు.
(జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)