Hidden Cameras In Hostel: ఇంజనీరింగ్‌ కాలేజీ వాష్‌రూమ్‌ల్లో సీక్రెట్ కెమెరాలు? గుడ్లవల్లేరులో అర్థరాత్రి ఉద్రిక్తత-secret cameras in engineering college washrooms late night tension in gudlavalleru ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Hidden Cameras In Hostel: ఇంజనీరింగ్‌ కాలేజీ వాష్‌రూమ్‌ల్లో సీక్రెట్ కెమెరాలు? గుడ్లవల్లేరులో అర్థరాత్రి ఉద్రిక్తత

Hidden Cameras In Hostel: ఇంజనీరింగ్‌ కాలేజీ వాష్‌రూమ్‌ల్లో సీక్రెట్ కెమెరాలు? గుడ్లవల్లేరులో అర్థరాత్రి ఉద్రిక్తత

Bolleddu Sarath Chandra HT Telugu
Aug 30, 2024 10:06 AM IST

Hidden Cameras In Hostel: కృష్ణా జిల్లాలోని ప్రముఖ ఇంజనీరింగ్‌ కాలేజీల్లో ఒకటైన గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో అర్థరాత్రి విద్యార్థినులు ఆందోళనకు దిగారు. హాస్టల్ వాష్‌రూమ్‌ల్లో సీక్రెట్ కెమెరాలతో చిత్రీకరిస్తున్నారనే ఆరోపణలతో విద్యార్థినులు ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో సోదాలు చేస్తున్న పోలీసులు
గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో సోదాలు చేస్తున్న పోలీసులు

Hidden Cameras In Hostel: ఇంజనీరింగ్ కాలేజీ హాస్టల్‌ బాత్‌రూమ్‌లో రహస్య కెమెరా బయటపడటంతో విద్యార్థినులు ఆందోళనకు దిగారు. కృష్ణా జిల్లాలోని గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ గర్ల్స్‌ హాస్టల్లో కొద్ది రోజుల క్రితం వాష్‌రూమ్‌లో సీక్రెట్‌ కెమెరాను గుర్తించినట్టు విద్యార్థినులు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంపై కాలేజీ యాజమాన్యానికి ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తూ గురువారం రాత్రి ఆందోళనకు దిగారు. తెల్లవారు జాము 3.30 వరకు విద్యార్థినులు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కాలేజీ ఆవరణలో బైఠాయించారు.

ఇదే కాలేజీలో ఫైనలియర్ బిటెక్ చదువుతున్న ఓ విద్యార్థి బాత్‌రూమ్‌లలో కెమెరాలు పెట్టినట్టు విద్యార్థినులు ఆరోపిస్తున్నారు. అతనికి ఓ విద్యార్థిని సహకరించినట్టు చెబుతున్నారు. వాటిని ఆన్‌లైన్‌లో విక్రయించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపిస్తూ విద్యార్థినులు ఆందోళనకు దిగారు. రహస్య చిత్రీకరణ చేసిన విద్యార్థి ఓ రాజకీయ పార్టీ నాయకుడి తనయుడు కావడంతో వారం రోజుల క్రితమే విషయం వెలుగు చూసినా యాజమాన్యం చూసిచూడనట్టు వదిలేసిందని విద్యార్ధినులు ఆరోపిస్తున్నారు. ఇందుకు సంబంధించిన పలు స్క్రీన్ షాట్లు, విద్యార్థుల ఆందోళనలను ఎక్స్‌లో వైరల్‌గా మారాయి.

300 పైగా వీడియోలను చిత్రీకరించారని విద్యార్ధినులు ఆరోపిస్తున్నారు. గర్ల్స్ హాస్టల్ కు చెందిన ఒక విద్యార్థిని సహకారంతో బాయ్స్ హాస్టల్ కు చెందిన కొంత మంది ఫైనలియర్‌ బిటెక్ విద్యార్థులు ఈ దారుణానికి పాల్పడినట్లుగా విద్యార్థినులు ఆరోపిస్తున్నారు. 300మందికి పైగా విద్యార్థినుల వీడియోలను నిందితులు రహస్యంగా చిత్రీకరించారని ఆరోపించారు.

కాలేజీ యాజమాన్యం వైఖరిని నిరసిస్తూ గురువారం రాత్రి విద్యార్థినులు ఆందోళనకు దిగారు. ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో న్యాయం కోరుతూ ఉయ్ వాంట్ జస్టిస్ అనే నినాదాలతో హోరెత్తించారు. విద్యార్థుల ఆందోళన అదుపు తప్పేలా ఉండటంతో పోలీసులు కాలేజీకు చేరుకుని విచారణ చేపట్టారు. పోలీసులు సముదాయించినా తెల్లవారుజాము వరకు విద్యార్థినులు వెనక్కి తగ్గలేదు. ఉయ్ వాంట్ జస్టిస్ నినాదాలతో హోరెత్తించారు.

ఎక్స్‌లో విద్యార్థులు పోస్ట్‌ చేసిన సమాచారం ఆధారంగా ఈ వ్యవహారంలో రాజకీయ నాయకుల ప్రమేయం ఉందని ఆరోపిస్తున్నారు. నిందితుల్లో ఒకరు ప్రముఖ నాయకుడి తనయుడు కావడంతో వారిని కాపాడే ప్రయత్నాలు జరుగుతున్నాయని వైరల్ చేశారు. ఈ మొత్తం వ్యవహారంలో రాజకీయ పార్టీల ప్రమేయంపై స్పష్టత రావాల్సి ఉంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఫైనలియర్ బిటెక్ విద్యార్థికి చెందిన ల్యాప్‌టాప్‌, మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు గుడ్లవల్లేరు పోలీసులు ప్రకటించారు.

స్పందించిన మంత్రి లోకేష్…

కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కళాశాలలో అర్ధరాత్రి విద్యార్థినుల ఆందోళనపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నట్లు మంత్రి నారా లోకేష్‌ తెలిపారు. రహస్య కెమెరాల ఆరోపణలపై విచారణకు ఆదేశించినట్టు ప్రకటించారు. విచారణలో తప్పు చేశారని తేలితే దోషులు, బాధ్యులపై కఠిన చర్యలు తప్పవన్నారు.‌ ఇటువంటి ఘటనలు కాలేజీల్లో పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు ఇచ్చినట్టు తెలిపారు. కళాశాలల్లో ర్యాగింగ్, వేధింపులు లేకుండా యాజమాన్యాలు ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. 

మరోవైపు  గుడ్ల వల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో రహస్య కెమెరాలతో హాస్టళ్లలో విద్యార్థినులను చిత్రీకరించడంపై పోలీసులు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఆరోపనలు ఎదుర్కొంటున్న విద్యార్థుల నుంచి ఫోన్లు, ల్యాప్‌టాప్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై రాజకీయ పార్టీలు సోషల్ మీడియాలో  పరస్పరం ఆరోపణలు గుప్పించుకుంటున్నాయి.