Senior Citizens : ఎంతమంది సీనియర్ సిటిజన్స్ ఆర్థిక భద్రత కలిగి ఉన్నారో తెలుసా?
వృద్ధులు అనగానే చాలామందికి ఓ చిన్నచూపు. కుటుంబంపైనే ఆధారపడతారనే కొంతమంది చులకనగా చూస్తారు. ఎంతమంది వృద్ధులు కుటుంబంపై ఆధారపడుతున్నారు? ఎంతమంది పనిచేయాలనుకుంటున్నారని ఓ సర్వే జరిగింది. ఈ సర్వే తెలుగు రాష్ట్రాల్లోనూ జరిగింది.
హెల్ప్‌ఏజ్ ఇండియా అనే NGO నిర్వహించిన జాతీయ సర్వేలో 47 శాతం మంది వృద్ధులు ఆదాయం కోసం వారి కుటుంబాలపై ఆర్థికంగా ఆధారపడుతున్నారని, 34 శాతం మంది పెన్షన్‌లు, నగదు బదిలీలపై ఆధారపడుతున్నారని నివేదికలో తేలింది. అయితే సర్వేలో పాల్గొన్న వారిలో 40 శాతం మంది సాధ్యమైనంత కాలం పని చేయాలనే కోరికతోనే ఉన్నట్టుగా చెప్పారు. ఈ సర్వే ఏపీ, తెలంగాణలోనూ జరిగింది.
'World Elder Abuse Awareness Day' సందర్భంగా నిర్వహించిన ఈ సర్వేలో పలు ఆసక్తికర విషయాలు తెలిశాయి. bridge the gap: understanding elder needs అనే అంశంపై ఈ సర్వే జరిగింది.
87 శాతం మంది వృద్ధులు ఆరోగ్య సౌకర్యాలను కలిగి ఉన్నారని నివేదికలో వెల్లడైంది. అయితే వారిలో 52 శాతం మంది మాత్రమే వాటిని పొందగలిగినట్టుగా తెలుస్తోంది. 67 శాతం మందికి ఎటువంటి ఆరోగ్య బీమా లేదు. అమరావతిలో 70.4 శాతం మంది సీనియర్ సిటిజన్లు ఆర్థికంగా భద్రత కలిగి ఉన్నారని నివేదించగా, 26.1 శాతం మంది వృద్ధులు పదవీ విరమణకు మించి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారని తెలిసింది.
82 శాతం మంది వృద్ధులు తమ కుటుంబాలతో జీవిస్తున్నప్పటికీ, వారిలో 59 శాతం మంది తమ కుటుంబ సభ్యులు తమతో ఎక్కువ సమయం గడపాలని కోరుకుంటున్నారని నివేదిక వెల్లడించింది. వారిలో 57 శాతం మంది తమ కుటుంబ సభ్యులు తమతో ఉండాలని కోరుకుంటున్నారని చెప్పారు. హైదరాబాద్, అమరావతి, చండీగఢ్, రాంచీ, ముంబై, చెన్నై, కోల్‌కతాతో సహా 22 నగరాల్లో ఈ సర్వే నిర్వహించారు. 4,399 మంది వృద్ధులు, 2,200 వయోజన సంరక్షకుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని ఈ నివేదిక రూపొందించారు.
కోవిడ్-19 మహమ్మారి తర్వాత మెరుగైన ఆరోగ్య రక్షణ అవసరం చాలా ఉందని అభిప్రాయాలు వెల్లడయ్యాయి. 49 శాతం మంది వృద్ధులు ఆరోగ్య బీమా, మెరుగైన ఆరోగ్య సౌకర్యాల కావాలనుకుంటున్నట్టుగా నివేదికలో తేలింది. వృద్ధులకు అనుకూలమైన సౌకర్యాలు, వృద్ధుల ఆరోగ్య సంరక్షణ పథకాలకు ఇంకా నిధులు అవసరమని సర్వేలో తెలిసింది. దేశవ్యాప్తంగా 10 శాతం తాము వేధింపులకు గురవుతున్నామని చెప్పారు. 59 శాతం మంది వృద్ధుల వేధింపులు సమాజంలో ప్రబలంగా ఉన్నాయని అభిప్రాయపడ్డారు. అయితే అమరావతిలో 4.5 శాతం మంది వృద్ధులు వేధింపులకు గురువతున్నట్టుగా తెలిసింది.
గమనిక: హెల్ప్‌ఏజ్ ఇండియా అనే సంస్థ చేసిన సర్వే ఆధారంగా గణాంకాలు ఇవ్వడం జరిగింది