TDP Nara Lokesh: టీడీపీని వీడని ఆందోళన..ఏం జరుగుతుందోననే ఉత్కంఠ-nara lokeshs padayatra postponed again party ranks are worried about what will happen ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Tdp Nara Lokesh: టీడీపీని వీడని ఆందోళన..ఏం జరుగుతుందోననే ఉత్కంఠ

TDP Nara Lokesh: టీడీపీని వీడని ఆందోళన..ఏం జరుగుతుందోననే ఉత్కంఠ

HT Telugu Desk HT Telugu
Sep 29, 2023 07:33 AM IST

TDP Nara Lokesh: టీడీపీ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ యువగళం పాదయాత్రకు బ్రేకులు పడ్డాయి. చంద్రబాబు అరెస్ట్‌, రిమాండ్ వ్యవహారాలతో నిలిచిపోయిన లోకేష్ పాదయాత్ర దాదాపు 20రోజుల తర్వాత అదే ప్రాంతం నుంచి శుక్రవారం ప్రారంభం కావాల్సి ఉన్నా చివరి నిమిషంలో రద్దైంది.

టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్
టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్

TDP Nara Lokesh: టీడీపీ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ యువగళం పాదయాత్రకు బ్రేకులు పడ్డాయి. చంద్రబాబు అరెస్ట్‌, రిమాండ్ వ్యవహారాలతో నిలిచిపోయిన లోకేష్ పాదయాత్ర దాదాపు 20రోజుల తర్వాత అదే ప్రాంతం నుంచి శుక్రవారం ప్రారంభం కావాల్సి ఉన్నా చివరి నిమిషంలో రద్దైంది. కోర్టు వ్యవహారాలను పర్యవేక్షించడం కష్టమవుతుందనే ఉద్దేశంతో యాత్ర వాయిదా పడింది. చంద్రబాబుతో పాటు లోకేష్‌ను కూడా అరెస్ట్ చేస్తారనే ప్రచారం నేపథ్యంలో ఏం జరుగుతుందనే ఉత్కంఠ అందరిలో నెలకొంది.

yearly horoscope entry point

నారా లోకేష్‌ యువగళం పాదయాత్ర మళ్లీ బ్రేకులు పడ్డాయి.సెప్టెంబర్‌ 9న నంద్యాలలో చంద్రబాబును అదుపులోకి తీసుకున్న సమయంలో లోకేష్ పాదయాత్ర నిలిచిపోయింది.బాబుకు రిమాండ్ విధించిన తర్వాత ఈ వ్యవహారం ఇప్పటికీ కొలిక్కి రాలేదు. ఏసీబీ కోర్టు నుంచి సుప్రీం కోర్టు వరకు పిటిషన్లపై పిటిషన్లు దాఖలవుతున్నా కోరిన ఊరట మాత్రం లభించడం లేదు. మరోవైపు చంద్రబాబుతో పాటు నారా లోకేష్‌ను కూడా అరెస్ట్‌ చేస్తారని ఏపీలో విస్తృత ప్రచారం జరుగుతోంది.

సెప్టెంబర్‌ 14వ తేదీన నారా లోకేష్‌ ఢిల్లీ వెళ్లారు.ఇప్పటికీ అక్కడే ఉన్నారు. నారా లోకేష్ ఢిల్లీలోనే ఉండిపోవడంపై వైసీపీ పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తోంది. అరెస్ట్ తప్పించుకోడానికి ఢిల్లీ వెళ్లిపోయారని విస్తృత ప్రచారం నిర్వహిస్తోంది. వాటిని టీడీపీ ఖండించింది. మరోవైపు టీడీపీని నడిపించే నాయకుడు లేకపోవడంతో నారా లోకేష్‌ మళ్లీ యాక్టివ్ కావాల్సిన అవసరం కూడా ఏర్పడింది.ఏ పరిణామాలకైనా సిద్ధపడే 29వ తేదీ నుంచి యాత్రను పున: ప్రారంభించనున్నట్లు ప్రకటించారు.

పునరాలోచన అందుకేనా...

చంద్రబాబు నాయుడు అరెస్ట్‌తో టీడీపీ కార్యకలాపాలు మొత్తం స్తంభించిపోయాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఆ పార్టీ శ్రేణుల్ని ఒక్కతాటిపై నడిపించే నాయకుడు ఎవరు లేకుండా పోయారు. చంద్రబాబు తర్వాత ఆ పార్టీలో నంబర్ టూ అంటూ ఎవరు లేకుండా పోయారు. ప్రస్తుత పరిస్థితుల్లో చంద్రబాబుతో పాటు నారా లోకేష్ కూడా జైలుకెళ్లాల్సి వస్తే తర్వాత పార్టీ పరిస్థితి ఏమిటనే ఆందోళన కూడా టీడీపీ శిబిరంలో ఉంది.

టీడీపీలో ముఖ్యనాయకులెవరు గత కొద్ది రోజులుగా చప్పుడు చేయడం లేదు. అరెస్టుల భయం చాలామంది నాయకుల్ని వెంటాడుతోంది. జడ్జిలను కించపరిచిన కేసులో బుద్దా వెంకన్న, గోరంట్ల వంటి వారికి హైకోర్టు నోటీసులు ఇచ్చింది. మరోవైపు బాబుకు మద్దతుగా రోడ్డెక్కాలనుకునే ముఖ్య నాయకుల్ని ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకుంటున్నారు.కీలక నాయకులు గడప దాటి రోడ్డు ఎక్కకుండా కట్టడి చేసే వ్యూహం వైసీపీ బాగా అమలు చేసింది.

ఇప్పుడు లోకేష్‌ పాదయాత్ర ప్రారంభించిన తర్వాత అతడిని కూడా అరెస్ట్‌ చేస్తే అప్పుడు పార్టీ వ్యవహారాలను పర్యవేక్షించే నాయకుడు ఉండరు.తెలుగుదేశం పార్టీ బాధ్యతల్ని ఇప్పటికిప్పుడు ఇతరులకు అప్పగించే అనువైన పరిస్థితులు కూడా లేవు. అందుకే మరికొన్నాళ్లు వేచి ఉండాలనే భావనకు టీడీపీ వచ్చినట్టు కనిపిస్తోంది.

నేడు విచారణకు రానున్న ముందస్తు బెయిల్ పిటిషన్‌

ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కేసులో ముందస్తు బెయిల్ కోసం నారా లోకేష్ దరఖాస్తు చేసుకున్నారు. శుక్రవారం ఈ పిటిషన్ విచారణకు రానుంది. రాజకీయ కక్షసాధింపులో భాగంగానే తనపై కేసు నమోదు చేశారని పిటిషన్‌లో పేర్కొన్నారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబును అరెస్టు చేసిన తర్వాత తనను కూడా అరెస్టు చేస్తారని అధికార పార్టీ నేతలు పలు వేదికలపై ప్రకటనలు చేశారని, వారు చెప్పినట్లే సీఐడీ అధికారులు ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కేసులో నిందితుడిగా చేర్చారని వివరించారు.

వైసీపీ ఎమ్మెల్యే 2022 ఏప్రిల్లో ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా దురుద్దేశంతో కేసు నమోదుచేశారని మంత్రిగా ఉన్నప్పుడు తండ్రి చంద్రబాబు నివసిస్తున్న లింగమనేని రమేష్ ఇంట్లోనే తాను కూడా ఉన్నానని ఈ కేసులో నిందితుడిగా చేర్చారని ఈ కారణంతో నిందితుడిగా చేర్చడానికి వీల్లేదన్నారు.

'ఇన్నర్ రింగ్ రోడ్డు ప్రాజెక్టు వ్యవహారంలో మంత్రి హోదాలో గానీ, ఇతర ఏ హోదాలో గానీ జోక్యం చేసుకోనందున అవినీతి నిరోధక చట్టం, ఐపీసీ సెక్షన్ 409 కింద కేసు పెట్టడానికి వీల్లేదని మిగిలిన సెక్షన్లన్నీ ఏడేళ్లలోపు జైలుశిక్షకు వీలున్నవేనని గుర్తు చేశారు.

పాదయాత్ర చేస్తున్నందున ఎలాంటి కారణం లేకుండా తనను అరెస్టుచేసే అవకాశం ఉందని ఇదే కేసులో ఇతర నిందితులకు న్యాయస్థానం ముందస్తు బెయిలు ఇచ్చిందని లోకేష్ పేర్కొన్నారు. అనినీతి నిరోధక చట్టం లోని సెక్షన్ 17ఏ ప్రకారం కాంపిటెంట్ అథారిటీ నుంచి ముందస్తు అనుమతి లేకుండా కేసు నమోదు, దర్యాప్తు ఈ అంశాల్ని పరిగణనలోకి తీసుకొని ముందస్తు బెయిలు మంజూరు చేయాలని కోరారు.లోకేష్ పిటిషన్ జస్టిస్ సురేష్ రెడ్డి ధర్మాసనం ముందు విచారణకు రానుంది.

Whats_app_banner