Nara lokesh Yuvagalam: ఎల్లుండి నుంచి నారా లోకేష్ యువగళం పాదయాత్ర-nara lokesh yuvagalam padayatra starts from day after tomorrow ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Nara Lokesh Yuvagalam: ఎల్లుండి నుంచి నారా లోకేష్ యువగళం పాదయాత్ర

Nara lokesh Yuvagalam: ఎల్లుండి నుంచి నారా లోకేష్ యువగళం పాదయాత్ర

HT Telugu Desk HT Telugu
Sep 27, 2023 12:43 PM IST

Nara lokesh Yuvagalam: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అరెస్ట్‌, రిమాండ్‌తో నిలిచిపోయిన నారా లోకేష్ యువగళం పాదయాత్రను 29వ తేదీ నుంచి తిరిగి ప్రారంభించాలని నిర్ణయించారు. రాజోలు నుంచి లోకేష్ యాత్రను ప్రారంభిస్తారు.

పాదయాత్రకు సిద్ధమవుతున్న నారా లోకేష్
పాదయాత్రకు సిద్ధమవుతున్న నారా లోకేష్

Nara lokesh Yuvagalam: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అరెస్ట్‌ తర్వాత ఢిల్లీలో మకాం వేసిన యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్రను తిరిగి ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. గత రెండు వారాలుగా ఢిల్లీలోనే లోకేష్ మకాం వేయడంపై ప్రత్యర్థుల నుంచి రకరకాల విమర్శలు వస్తున్న నేపథ్యంలో యాత్రను తిరిగి ప్రారంభించాలని నిర్ణయించారు.

yearly horoscope entry point

29వ తేదీ రాత్రి 8.15కు తిరిగి పాదయాత్ర ప్రారంభించనున్నారు. పాదయాత్ర ఎక్కడ ఆగిందో అక్కడి నుంచే తిరిగి మొదలు కానుంది. చంద్రబాబు అరెస్టుతో రాజోలు నియోజకవర్గం పొదలాడలో యువగళానికి విరామం ప్రకటించారు. సెప్టెంబర్‌ 9వ తేదీన యుగళం యాత్ర ప్రారంభానికి ముందే చంద్రబాబును అరెస్ట్ చేయడంతో లోకేష్‌ పాదయాత్ర అర్థాంతరంగా నిలిచిపోయింది.

ఏపీలోని 100 అసెంబ్లీ స్థానాల్ని చుట్టే లక్ష్యంతో కుప్పం నుంచి శ్రీకాకుళం వరకు పాదయాత్ర ను ఈ ఏడాది జనవరి 27న లోకేష్ ప్రారంభించారు. యువగళం పేరుతో ముందుకు సాగుతున్నారు. అయితే చంద్రబాబు అరెస్ట్‌తో ఒక్కసారిగా యాత్రకు బ్రేకులు పడ్డాయి. బాబును అరెస్ట్ చేసిన తర్వాత ఒకటి రెండు రోజుల్లోనే వ్యవహారం కొలిక్కి వస్తుందని భావించినా అలా జరగలేదు. మరోవైపు ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు వ్యవహారంలో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారనే ఆరోపణలతో ఏ14గా లోకేష్‌పై కేసు నమోదైంది.

గత కొద్ది రోజులుగా లోకేష్‌ను సైతం అరెస్ట్ చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఢిల్లీలో ప్రత్యేక బృందాలు మకాం వేశాయని ఊహాగానాలు వస్తున్నాయి. సుప్రీం కోర్టులో చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌ వేసిన నేపథ్యంలో లోకేష్‌ కూడా అక్కడే మకాం వేసి న్యాయనిపుణులు, జాతీయ పార్టీల నాయకులతో మంతనాలు చేస్తున్నారు. ఈ వారంలో వ్యవహారంలో కొంతైనా పురోగతి ఉంటుందనే ఉద్దేశంతో 29 నుంచి పాదయాత్రకు రెడీ అవుతున్నారు.

మరోవైపు సిఎం జ‌గ‌న్ తమకు గిఫ్ట్ ఇచ్చాడని..6 నెల‌ల్లో రిట‌ర్న్ గిఫ్ట్ ఇస్తానని లోకేష్‌ చెబుతున్నారు. ఏపీలో సాగుతున్న అరాచ‌క‌, విధ్వంస పాల‌న గురించి అందరికి వివరిస్తున్నట్లు చెప్పారు. తాను ఢిల్లీలో దాక్కోలేదని, న్యాయ‌వాదులు-జాతీయ పార్టీ నేత‌ల‌తో చ‌ర్చిస్తున్నానన్నారు. సీఐడీ పెట్టిన కేసులో స‌త్తా ఉంటే, ఢిల్లీ వ‌చ్చి అరెస్టు చేయ‌లేరా అని ప్రశ్నించారు. యువ‌గ‌ళం ప్రారంభం కోసం అనుమ‌తులు కోరామని చెప్పారు. భ‌విష్య‌త్తుకి గ్యారెంటీ, యువ‌గ‌ళం, వారాహి యాత్ర‌లు అడ్డుకునేందుకే ఈ అక్ర‌మ అరెస్టులు చేస్తున్నారని లోకేష్ ఆరోపించారు.

Whats_app_banner