YSRCP MP: పార్లమెంటు సమావేశాల్లో సొమ్మసిల్లి పడిపోయిన వైసీపీ ఎంపీ పిల్లి సుభాష్
పార్లమెంటు సమావేశాల్లో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. రాజ్యసభలో చర్చ జరుగుతున్న టైమ్ లో వైసీపీ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ కళ్లు తిరిగి పడిపోయారు. దీంతో సభలో అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించారు.
పార్లమెంటు సమావేశాలకు రాజ్యసభ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ హాజరయ్యారు. అయితే రాజ్యసభలో చర్చ నడుస్తున్న సందర్భంగా ఒక్కసారిగా ఆయన సొమ్మసిల్లి పడిపోయారు. ఆయన కొంతకాలంగా చిన్న చిన్న ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్టు తెలుస్తోంది. సమావేశాలు జరుగుతుండగా.. బీపీ, షుగర్ డౌన్ అయి.. సొమ్మసిల్లి పడిపోయారు. అందరూ చూస్తుండగానే.. ఈ ఘటన జరగడంతో అందరూ షాక్ గురయ్యారు. వెంటనే స్ట్రెచర్ తెప్పించి.. రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రికి తరలించారు. ఆయన ప్రస్తుతం ఐసీయూ చికిత్సలో ఉన్నారు. ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు చెప్పారు. ఎలాంటి ప్రమాదం లేదని తెలిపారు.
సభలో టీడీపీ వర్సెస్ వైసీపీ
రాజ్యసభలో ఈరోజు టీడీపీ, వైసీపీ మధ్య మాటల యుద్ధం నడిచింది. కృష్ణా జిల్లా గుడివాడలో క్యాసినో గురించి టీడీపీ ఎంపీ ప్రస్తావించారు. ఏపీలో పాలన సరిగా లేదని వ్యాఖ్యానించారు. పరిశ్రమల స్థాపనతో ఉపాధి కల్పించడం లేదని.. ఇలాంటి అసాంఘిక చర్యలకు పాల్పడుతుందని అన్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే.. వాళ్లను ప్రభుత్వ వ్యతిరేకులుగా చేస్తున్నారని.. అరెస్టులు చేస్తున్నారని కనకమేడల విమర్శించారు. కక్షపూరిత రాజకీయాలతో ప్రతిపక్ష నేతలపై దాడులు చేస్తున్నారని రాజ్యసభలో చెప్పారు.
కనకమేడల మాట్లాడుతుంటే.. మధ్యలో వైసీపీ ఎంపీలు అడ్డుకున్నారు. అయితే ప్రసంగాన్ని అడ్డుకోవడం సరికాదని.. డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్.. సూచించారు. ఆ తర్వాత వైసీపీ ఎంపీ విజయసాయిరెర్డి అవకాశం వచ్చినప్పుడు మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ పాలన కంటే.. వైసీపీ పాలన వెయ్యి రెట్లు గొప్పగా ఉందన్నారు. సినిమా టికెట్లు సహా పలు అంశాలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని విజయసాయిరెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వం తీరును కూడా విజయసాయిరెడ్డి తప్పు బట్టారు. రాష్ట్రంపై సవతి తల్లి ప్రేమ చూపిస్తోందన్నారు. ప్రత్యేక హోదా, పోలవరం జాతీయ ప్రాజెక్టు లాంటి విషయాలను సభలో ప్రస్తావించారు విజయసాయిరెడ్డి.