CM Jagan: ఆగస్టు 13 నుంచి ఘనంగా ‘హర్ ఘర్ తిరంగా’
Azadi ka Amrit Mahotsav: ఆజాదీకా అమృత్ మహోత్సవ్‌పై కేంద్రం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది.ఇందులో ఏపీ సీఎం జగన్ పాల్గొన్నారు. ఏపీలో ఘనంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమం నిర్వహించనున్నట్టు తెలిపారు.
Har Ghar Tiranga Program in AP: ఆజాదీ కా అమృత్ మహాత్సవ్ సందర్భంగా ‘‘హర్ ఘర్ తిరంగా’’ కార్యక్రమంపై వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ఇందుల్లో పాల్గొన్న సీఎం జగన్.. ఏపీలో చేపట్టిన కార్యక్రమాలను వివరించారు. ఏపీలో ఘనంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమం నిర్వహించనున్నట్టు తెలిపారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తికావస్తున్న సందర్బంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమం ద్వారా పౌరుల్లో దేశభక్తి భావనను పెంపొందించడానికి ఏసీ సర్కార్ కృత నిశ్చయంతో ఉందని చెప్పారు. ఆగస్టు 13 నుంచి 15 వరకు హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 1.62 కోట్ల జాతీయ పతాకాల ఆవిష్కరించనున్నట్టు తెలిపారు. దేశభక్తిని, జాతీయభావాన్ని పెంపొందించేలా పలు కార్యక్రమాలు జరపనున్నట్టు చెప్పారు.
హర్ ఘర్ తిరంగా కార్యక్రమంపై ఏపీ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకున్నామని జగన్ చెప్పారు. అన్ని విభాగాలతో సమీక్ష కూడా నిర్వహించామని... సమగ్రమైన కార్యాచరణను రూపొందించామని తెలిపారు. ఈ కార్యక్రమం గురించి ప్రజలకు తెలియజెప్పడానికి బహుముఖంగా ప్రచారం నిర్వహించామని వివరించారు. పత్రికల్లో ప్రకటనలు, హోర్డింగ్స్, పలు గీతాలు రూపొందించామన్న ముఖ్యమంత్రి... చైతన్యం కలిగించేందుకు సినిమా హాళ్లలో సంక్షిప్త చిత్రాలను ప్రదర్శించామని వెల్లడించారు. రాష్ట్రంలోని పరిశ్రమలతో పాటు ఇతర సంస్ధలు, దుకాణాలు, వాణిజ్య సముదాయాలు అన్నింటిపైనా జాతీయ పతాకాన్ని ఎగురవేసేలా వారిని చైతన్యపరిచామన్నారు. ప్రభుత్వ కార్యాలయాల వద్ద అధికారులు జాతీయ జెండాను ఆవిష్కరించాలని చెప్పామని... అదే విధంగా ప్రభుత్వ ఉద్యోగులు వారి నివాస సముదాయాల వద్ద కూడా జెండా ఆవిష్కరణ చేయాలని తెలిపామన్నారు. 5.24 లక్షల రేషన్ దుకాణాలు, 15వేల గ్రామ, వార్డు సచివాలయాల్లో జాతీయ పతాకాన్ని ఎగురవేస్తున్నారన్న జగన్... అంగన్‌వాడీ వర్కర్లు, ఆశావర్కర్లు కూడా వారి కార్యాలయాల్లో కూడా ఈ కార్యక్రమాలను చేపడతారని చెప్పారు. 1.20 లక్షల గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది, 2.60 లక్షల మంది వాలంటీర్లు కూడా జాతీయ జెండాలను పంపిణీ చేయడం ద్వారా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యులవుతారని.. 1.62 కోట్ల జాతీయ పతాకాలను ప్రతి ఇంటికీ, ప్రతి సముదాయానికి పంపిణీ చేస్తారని తెలిపారు,