సీపీఎస్ స్థానంలో జీపీఎస్ ప్రతిపాదన
పగలంతా సీపీఎస్ రద్దు చేయాలంటూ ఉపాధ్యాయ సంఘాల ఆందోళనలు, చలోసీఎం కార్యక్రమాలతో టెన్షన్ వాతావరణం నెలకొంటే, సాయంత్రానికి ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ భేటీ అయ్యింది. ఎన్నికలకు ముందు ఇచ్చిన సీపీఎస్ రద్దు హామీ స్థానంలో గ్యారెంటీ పెన్షన్ స్కీం అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. దీనికి ఉద్యోగ సంఘాలు నిరాకరించాయి.

ఆంధప్రదేశ్‌లో కొద్ది నెలలుగా ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలకు రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య పేచీగా మారిన కంట్రిబ్యూటరీ పెన్షన్ వ్యవస్థను రద్దు చేసే విషయంలో ప్రతిష్టంభన కొనసాగుతోంది. సోమవారం ఉపాధ్యాయ సంఘాలు తలపెట్టిన ముఖ్యమంత్రి నివాసం ముట్టడి కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు కఠిన ఆంక్షల్ని అమలు చేయడంతో పాటు ఎక్కడికక్కడ ఉపాధ్యాయుల్ని అదుపులోకి తీసుకున్నారు.
సీపీఎస్ రద్దు చేస్తే ఆర్ధిక భారం
ఏపీ ప్రస్తుతం ఉన్న ఆర్దిక పరిస్థితుల్లో కంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలని సర్కారు తేల్చి చెప్పింది. ఉపాధ్యాయ సంఘాల ఆందోళనల నేపథ్యంలో ఆర్దిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి నేతృత్వంలో కమిటీ సచివాలయంలో అందుబాటులో ఉన్న సంఘాలతో భేటీ అయ్యారు. బేసిక్ పై 33.5శాతం పెన్షన్ చెల్లిస్తామని ప్రతిపాదించారు. కమిటీ సమావేశానికి అరగంట ముందే కొత్త కమిటీని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. విద్యాశాఖ మంత్రి బొత్స, పురపాలక శాఖ మంత్రి సురేష్‌లు జిల్లా పర్యటనల్లో ఉండటంతో సీఎస్, సజ్జల, ఆర్ధిక మంత్రుల నేతృత్వంలో సమావేశం జరిగింది. రాబడులకు మించి ఖర్చు చేయాల్సి వస్తుండటంతో 2031, 2041, 2100 వరకు ఎంత భారం పడుతుందో ఉద్యోగ సంఘాలకు పవర్ పాయింట్ ద్వారా వివరించారు. అయితే పెన్షన్ తమ హక్కని, ప్రభుత్వం తమకు భిక్ష ఇవ్వడం లేదని ఉద్యోగ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయలేమని రాష్ట్ర ప్రభుత్వం తేల్చి చెప్పడంతో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు దానికి నిరాకరించాయి.
ఉద్యోగులకు మేలు చేకూర్చేలా జీపీఎస్
రాష్ట్రంలో రాబడులకు మించి ఖర్చు చేయాల్సిన పరిస్థితులు ఉండటంతో ఉద్యోగులకు మేలు చేకూర్చే విధంగా కొత్త పథకాన్ని అమలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. జీపీఎస్ గురించి ఆర్దిక శాఖ కార్యదర్శి నటరాజన్ గుల్జార్ ఉద్యోగ సంఘాల నేతలకు వివరించారు. సీపీఎస్ వల్ల ఉద్యోగులకు లాభం లేదని, మార్కెట్ రాబడులపై ఆధారపడి ఉన్నందున, ఓపీఎస్, సీపీఎస్‌ల స్థానంలో గ్యారంటీ పెన్షన్ స్కీం అమలుచ చేస్తామని వివరించారు. ఓపీఎస్ ఉద్యోగులకు చివరి పెన్షన్ చెల్లింపు మీద 50శాతం పెన్షన్ నిర్ణయిస్తారని, సీపీఎస్ ఉద్యోగులకు చివరి బేసిక్ చెల్లింపు మీద 20శాతం పెన్షన్ ఉంటుందని, రెండింటి బదులు కొత్తగా 33.5శాతం పెన్షన్ ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది.ఈ ప్రతిపాదనలపై సలహాలు, సూచనలు, అభ్యంతరాలు తీసుకున్న తర్వాత చర్చలు కొనసాగించాలని నిర్ణయించారు. ప్రభుత్వ ప్రతిపాదనను ఉద్యోగ సంఘాలు వ్యతిరేకించాయి. రాష్ట్ర ప్రభుత్వం చేసే ఎలాంటి ప్రత్యామ్నయ ప్రతిపాదనను తాము అంగీకరించమని, ముఖ్యమంత్రి ఎన్నికలకు ముందు ఇచ్చిన సీపీఎస్ రద్దుకు కట్టుబడి ఉండాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ప్రతిపాదనలు పూర్తి వివరాలతో ఇస్తే వాటిలో లోటుపాట్లు తెలుస్తాయని, కేవలం పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌తో మభ్య పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని నేతలు ఆరోపించారు.
పీఆర్సీ వ్యవహారంలో మాదిరే సీపీఎస్ విషయంలో కూడా ప్రభుత్వం దాగుడుమూతలు ఆడుతోందని ఉద్యోగ సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. మధ్యంతర భృతి కంటే పిఆర్సీ ఫిట్‌మెంట్ తక్కువ ఇచ్చరని, ఇప్పుడు ఆర్థిక భారం అంటూ కొత్త స్కీం ఉద్యోగాలకు అమలు చేస్తారనే అనుమానాలు ఉద్యోగుల్లో లేకపోలేదు. చత్తీస్‌ఘడ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో సాధ్యమైన సీపీఎస్ రద్దు ఏపీలో ఎందుకు సాధ్యపడదని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీకి నిర్ధిష్ట కాలపరిమితి లేకపోవడం వల్ల సీపీఎస్ అంశాన్ని పరిష్కరించే ఆలోచన దానికి లేదని ఆరోపిస్తున్ానయి.
ఉద్యోగ సంఘాలతో మంత్రుల కమిటీ భేటీలో పీఆర్సీలో ఎరియర్ బకాయిలు, డిఏ బకాయిలు, జీపీఎఫ్, ఏపీ జనరల్ లైఫ్ ఇన్సూరెన్స్, లీవ్ సరెండర్లు, లోన్ అడ్వాన్సులు, మెడికల్ రిఎంబర్స్‌మెంట్ అంశాలను నేతలు ప్రస్తావించినా వాటిపై తర్వాత మాట్లాడదామంటూ భేటీలో పాల్గొన్న ప్రభుత్వ పెద్దలు దాటవేశారని ఉద్యోగ సంఘాలు ఆరోపిస్తున్నాయి.
సంబంధిత కథనం
టాపిక్