SI Physical Events : ఏలూరు, కర్నూలు రేంజ్ ఎస్సై ఫిజికల్ ఈవెంట్స్ వాయిదా, మళ్లీ ఎప్పుడంటే?
SI Physical Events : వర్షాల కారణంగా ఏలూరు, కర్నూలు పరిధిలో జరగాల్సిన ఎస్సై అభ్యర్థుల దేహదారుఢ్య పరీక్షలు వాయిదా పడ్డాయి.
SI Physical Events : వర్షాల కారణంగా ఎస్సై అభ్యర్థుల ఫిజికల్ ఈవెంట్స్ వాయిదా పడ్డాయి. ఏలూరు రేంజ్ లో గురువారం జరగాల్సిన ఎస్సై అభ్యర్థుల దేహదారుఢ్య పరీక్షలు వాయిదా వేసినట్లు అధికారులు తెలిపారు. ఈ నెల 14కు దేహదారుఢ్య పరీక్షలను వాయిదా వేసినట్లు అధికారులు వెల్లడించారు. వర్షం కారణంగా ఫిజికల్ ఈవెంట్స్ నిర్వహించే గ్రౌండ్ చిత్తడిగా మారడంతో దేహదారుఢ్య పరీక్షలు వాయిదా వేసినట్లు ఏలూరు రేంజ్ డీఐజీ తెలిపారు. ఈ నెల 7న జరగాల్సిన ఈవెంట్స్ ను మాత్రమే వాయిదా వేశామన్నారు. 8వ తేదీన జరగాల్సిన దేహదారుఢ్య పరీక్షలు యథాతథంగా నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ఏలూరు పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో మంగవాళం(సెప్టెంబర్5) జరగాల్సిన ఎస్సై దేహదారుఢ్య పరీక్షలు వర్షం కారణంగా ఈ నెల 13వ తేదీకి వాయిదా వేశారు.
రాయలసీమ జోన్ లోనూ వాయిదా
భారీ వర్షాల కారణంగా రాయలసీమ జోన్‌లో మంగళవారం జరగాల్సిన సబ్ ఇన్‌స్పెక్టర్ అభ్యర్థుల దేహదారుఢ్య పరీక్షలు వాయిదా పడ్డాయి. ఈ పరీక్షలను కర్నూలులో సెప్టెంబర్ 22కు రీషెడ్యూల్ చేశారు. సోమవారం జరగాల్సిన దేహదారుఢ్య పరీక్షలు కూడా వాతావరణం అనుకూలించని కారణంగా సెప్టెంబర్ 21వ తేదీకి వాయిదా వేశారు. దేహదారుఢ్య పరీక్షలు వాయిదా వేయడానికి ప్రధాన కారణం మైదానం చిత్తడిగా ఉండడమే అని అధికారులు పేర్కొన్నారు.
అలాగే గుంటూరు రేంజ్ పరిధిలో ఆగస్టు 25న జరగాల్సిన ఎస్సై అభ్యర్థుల దేహదారుఢ్య పరీక్షలను వాయిదా వేశారు. వర్షాల కారణంగా మైదానం సిద్ధంగా లేకపోవడంతో ఎస్సై అభ్యర్థులు దేహదారుఢ్య పరీక్షల్ని సెప్టెంబరు 16కి వాయిదా వేస్తున్నట్లు పోలీసు అధికారులు చెప్పారు.
411 ఎస్సై పోస్టులు
ఏపీ పోలీస్ శాఖలో 6511 ఉద్యోగాలకు గత ఏడాది నవంబర్ లో నోటిఫికేషన్(Notification) విడుదల చేసింది. ఏటా 6,500 నుంచి 7 వేల వరకు పోలీస్ ఉద్యోగాలను భర్తీ చేయాలని సీఎం జగన్ అప్పట్లో అధికారులను ఆదేశించారు. గత ఏడాది 6511 ఉద్యోగాలకు ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. ఇందులో 411 ఎస్పై ఉద్యోగాలు కాగా, 6100 కానిస్టేబుల్ ఉద్యోగాలు ఉన్నాయి. ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ కొనసాగుతోంది. ప్రస్తుతం ఎస్సై అభ్యర్థుల ఫిజికల్ ఈవెంట్ల నిర్వహిస్తున్నారు. అభ్యర్థులకు విశాఖ, ఏలూరు, గుంటూరు, కర్నూలులో దేహదారుఢ్య, శరీర సామర్థ్య పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 19న ఎస్‌ఐ ఉద్యోగాలకు ప్రిలిమినరీ రాత పరీక్ష నిర్వహించగా, మొత్తం 57,923 మంది అభ్యర్థులు (38 శాతం) ఫిజికల్ ఈవెంట్లకు అర్హత సాధించారు. వీరిలో 49,386 మంది పురుషులు, 8537 మహిళలు ఉన్న సంగతి తెలిసిందే.