CBN Hit Shows : చర్చనీయాంశంగా మారిన చంద్రబాబు రోడ్‌షోలు..-discussion among political circles about chandra babu naidu road shows and public response ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Cbn Hit Shows : చర్చనీయాంశంగా మారిన చంద్రబాబు రోడ్‌షోలు..

CBN Hit Shows : చర్చనీయాంశంగా మారిన చంద్రబాబు రోడ్‌షోలు..

HT Telugu Desk HT Telugu
Dec 24, 2022 12:46 PM IST

CBN Hit Shows ఆంధ్రప్రదేశ్‌ పొలిటికల్ సర్కిల్స్‌లో ఇప్పుడు చంద్రబాబు రోడ్‌ షోలు హాట్ టాపిక్‌గా మారాయి. ఇదేం ఖర్మ రాష్ట్రానికి అంటూ చంద్రబాబు చేస్తోన్న యాత్రలకు జనం భారీ ఎత్తున తరలి వస్తున్నారు. రాయలసీమ, కోస్తా, ఉత్తరాంధ్రల్లో చేపట్టిన యాత్రలకు జనం పెద్ద సంఖ్యలో హాజరవుతున్నారు. చంద్రబాబు యాత్రలకు తరలి వస్తున్న జనమే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

చంద్రబాబు రోడ్‌షోలకు భారీగా జనం
చంద్రబాబు రోడ్‌షోలకు భారీగా జనం

CBN Hit Shows తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చేస్తున్న రోడ్‌ షోలకు జనం భారీగా తరలి వస్తున్నారు. ప్రాంతాలతో సంబంధం లేకుండా వేల సంఖ్యలో రోడ్లపై పోగవుతున్నారు. రోడ్‌ షోలు సాగే ప్రాంతాలన్ని జనసందోహంగా మారుతున్నాయి. ఎన్నికలకు ఏడాది ముందే చంద్రబాబు చేస్తోన్న యాత్రలతో రాజకీయ వాతావరణంలో స్పష్టమైన మార్పు వచ్చేసింది.

ఏపీ పొలిటికల్ సర్కిల్స్‌లో ఇప్పుడు చంద్రబాబు యాత్రలకు తరలి వస్తున్న జనంపైనే చర్చ జరుగుతోంది. మొదట్లో ప్రత్యర్థులు టీడీపీ భారీగా జన సమీకరణ చేస్తుందని తేలిగ్గా తీసుకున్నా టీడీపీ క్యాడర్ మాత్రం వాటిని పట్టించుకోలేదు.

చంద్రబాబు ఎక్కడకు వెళ్లినా భారీ సంఖ్యలో జనాన్ని పోగేయ గలుగుతున్నారు. నిజానికి టీడీపీ శ్రేణులు నిరుత్సాహంలో కూరుకుపోయాయని, ఆ పార్టీని నడిపించే నాయకులు లేరని, నియోజక వర్గాల్లో నాయకులు ముఖం చాటేస్తున్నారని రకరకాల ప్రచారాలు ఉన్నాయి. వాటన్నింటికి సమాధానం ఇచ్చేలా ఇప్పుడు రోడ్ షోలలో భారీగా జనం వస్తున్నారు. ఇదేదో ఒక్క ప్రాంతానికి పరిమితం కాలేదు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో చంద్రబాబు యాత్రలకు భారీగా జనం వస్తున్నారు.

ప్రతి చోట రోడ్లపై జనం కిక్కిరిసిపోయిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో హల్‌‌చల్ చేస్తున్నాయి. చంద్రబాబు కోసం జనం రావడం ప్రత్యర్థుల్ని సైతం ఆలోచనలో పడేస్తోంది. టీడీపీ వచ్చే ఎన్నికల్ని చావోరేవోగా భావిస్తోంది. అందుకే బాబు కార్యక్రమాల విషయంలో ఎక్కడా తగ్గట్లేదు. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా గెలిచి తీరాలనే లక్ష్యంతో తెలుగుదేశం పార్టీ పనిచేస్తోంది.

అదే స్ట్రాటజీ ఫాలో అవుతున్నారా…?

చంద్రబాబు రోడ్‌షోలకు జనం భారీగా తరలి రావడం కంటే, జనం భారీగా తరలి వస్తున్నారనే వి‍షయాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లడమే టీడీపీ స్ట్రాటజీగా కనిపిస్తోంది. డ్రోన్‌ ఫోటోలు, వీడియోలు, టీడీపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపుతున్నాయి. తమ బలాన్ని చాటిచెప్పడానికి నిస్తేజంగా ఉన్న కార్యకర్తల్లో ఉత్సాహం నింపడానికి ఇవి బాగా పనికొస్తున్నాయి.

2019 ఎన్నికలకు ముందు వైసీపీ కూడా ఇలాంటి స్ట్రాటజీనే అమలు చేసింది. సోషల్ మీడియాలో జగన్ రోడ్ షోలకు పెద్ద ఎత్తున ఆదరణ లభిస్తోందని ప్రచారం చేసింది. అప్పట్లో జగన్ కోసం పనిచేసిన ప్రశాంత్‌ కిషోర్‌ బృందం సభ్యుల్లో కొందరు ఇప్పుడు చంద్రబాబు కోసం పనిచేస్తున్నారు. పబ్లిక్‌ పల్స్‌ మార్చడంలో భాగంగా తాము బలంగా ఉన్నామనే విషయాన్ని జనానికి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అదే సమయంలో ప్రత్యర్థులపై వ్యతిరేకత పెరగడం వల్లే తమ వైపు జనం చూస్తున్నారనే కాంపెయిన్ చేస్తున్నారు. జనం మూక మనస్తత్వానికి అనుగుణంగా ఇలాంటి ఫోటోలకు విస్తృత ప్రచారం కల్పిస్తోంది.

చంద్రబాబు రోడ్‌షోలలో జనం పెద్ద సంఖ్యలో హాజరవుతున్నారంటే ఆ మేరకు ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతోందని ప్రచారం చేయడానికి వీలవుతోంది. అప్పట్లో జగన్మోహన్‌ రెడ్డి కూడా ఇలాంటి ట్రిక్కులతోనే జనాన్ని ఆకట్టుకున్నారు. ఇప్పుడు దానినే టీడీపీ ఫాలో అవుతోంది. మరోవైపు ఎన్నికలకు ఏడాది మాత్రమే గడువు ఉండటంతో ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి కూడా సంక్రాంతి తర్వాత జనంలోకి వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ముఖ్యమంత్రి పర్యటనలన్నీ మూస ధోరణిలో సాగుతుండటంతో ప్రజల్ని ఆకట్టుకునేలా ఎలా మార్పు చేస్తారో చూడాలి.

IPL_Entry_Point

టాపిక్