Chandrababu Manifesto: అప్పుడు డబ్బులెలా..! చంద్రబాబు ఆ సంగతి మర్చిపోయారా?
Chandrababu Manifesto: తెలుగు దేశం పార్టీ మహానాడులో చంద్రబాబు నాయుడు ఓ సంగతి ఉద్దేశపూర్వకంగానే మరచిపోయారు. నాలుగేళ్లుగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని నిత్యం విమర్శిస్తున్న విషయంలో క్లారిటీ ఇవ్వడం మరిచారు. జగన్ బాటలోనే నగదు బదిలీ పథకాలను ప్రకటించారు.
Chandrababu Manifesto: సార్వత్రిక ఎన్నికలకు ఏడాది ముందు టీడీపీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన రాజమండ్రి మహానాడులో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కీలక ప్రకటనలు చేశారు. వచ్చే ఎన్నికల్లో గెలిస్తే ప్రజలకు ఏమేం చేస్తారో వివరించారు. వాటిలో ప్రత్యక్ష నగదు బదిలీ పథకాలు కూడా ఉన్నాయి.
నాలుగేళ్లుగా ఏపీలో వైసీపీ ప్రభుత్వం రకరకాల సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉన్నా పథకాలను మాత్రం ఆపడం లేదు. ప్రత్యక్షనగదు బదిలీ పథకాలకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది. రాష్ట్ర జనాభాల్లో దాదాపు 87శాతం మందికి ఏదో రూపంలో ప్రభుత్వ పథకాలను అందిస్తున్నామని జగన్ సర్కారు చెబుతోంది.
సంక్షేమ పథకాలకు నాలుగేళ్లలో దాదాపు రూ.2లక్షల కోట్ల రుపాయలు నేరుగా లబ్దిదారుల ఖాతాల్లోకి బదిలీ చేశామని, పరోక్ష బదిలీ పథకాలను కలిపితే అది మూడు లక్షల కోట్లకు చేరుతుందని సిఎం జగన్ పదేపదే చెబుతున్నారు.
మరోవైపు ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక పరిస్థితిపై ప్రతిపక్ష పార్టీలన్ని తరచూ ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అప్పు పుట్టకపోతే రాష్ట్రం నడవలేదని వాపోతున్నారు. ఇక ఏపీ ఆర్ధిక పరిస్థితి దివాళా అంచుకు వచ్చేసిందనే కథనాలు నిత్యం కనిపిస్తూనే ఉన్నాయి. ముఖ్యమంత్రి ఢిల్లీ ఎప్పుడూ వెళ్లినా అప్పుల కోసమేననే విమర్శలు తప్పడం లేదు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితికి, ఇబ్బడిముబ్బడిగా సంక్షేమ పథకాలను అమలు చేయడమే కారణమని రాజకీయ విమర్శలు నాలుగేళ్లుగా వినిపిస్తూనే ఉన్నాయి.
ఇన్నాళ్లు విమర్శించి…ఇప్పుడు అదే రూటులో….
ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రత్యక్ష నగదు బదిలీ పథకాలపై నిత్యం విమర్శించే టీడీపీ ఇప్పుడు అదే బాట పట్టినట్టు కనిపిస్తోంది. 18 నుంచి 59 ఏళ్ల ఆడపడుచులకు, ఇంట్లో ఎంతమంది ఉన్నా ఒక్కొక్కరికి నెలకు రూ.1,500 వరకు ఇస్తామని మహానడులో ప్రకటించారు. ఇంట్లో చదువుకుంటున్న పిల్లలు ఉన్న తల్లులకు రూ.15 వేలు చొప్పున ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామని ప్రకటించారు. ప్రస్తుతం అమలు చేస్తున్న అమ్మఒడిని మరింతమందికి వర్తింప చేస్తామని దీని ఉద్దేశంగా కనిపిస్తోంది.
జిల్లా పరిధిలో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, ప్రతి కుటుంబానికి ఏటా 3 గ్యాస్ సిలిండర్లు, ఐదేళ్లలో యువతకు 20 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ యువతకు నెలకు రూ.3 వేలు, రైతన్నకు సంవత్సరానికి రూ.20 వేలు, బీసీల రక్షణకు ప్రత్యేక చట్టం వంటి పథకాలను చంద్రబాబు నాయుడు ప్రకటించారు. పేదలను ధనికులుగా మార్చేందుకు ప్రణాళిక సిద్దం చేస్తున్నట్లు ప్రకటించారు.
మహిళలు, యువత, రైతులతో పాటు, వెనుకబడిన వర్గాలకు మేలు చేకూర్చేలా... మహాశక్తి, యువగళం, అన్నదాత, బీసీలకు రక్షణ చట్టం, ఇంటింటికీ మంచినీరు, పూర్ టు రిచ్ అనే ఆరు కార్యక్రమాల్ని ప్రకటించారు.
'ఆడబిడ్డ నిధి' కింద 18 నుంచి 59 ఏళ్ల వయసు గల మహిళలకు ప్రతి నెలా రూ.1,500 చొప్పున వారి ఖాతాల్లో వేస్తామని, ఒక ఇంట్లో ఎంతమంది మహిళలుంటే అందరికీ ఈ పథకం వర్తిస్తుందని ఒక్కొక్కరికి ఏడాదికి రూ.18 వేల చొప్పున, ఐదేళ్లలో రూ.90వేలు ఆడ బిడ్డల ఖాతాలకు పంపిస్తానని ప్రకటించారు.
దీంతో పాటు 'తల్లికి వందనం' కార్యక్రమం కింద... చదువుకుంటున్న పిల్లల తల్లులకు ఏటా రూ.15వేలు. ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ రూ.15వేల చొప్పున అందజేస్తారు.
అన్నదాత పథకం కింద ప్రతి రైతుకు ఏడాదికి రూ.20వేల ఆర్థికసాయం చేస్తామని చంద్రబాబు ప్రకటించారు. ' 'ప్రతి రైతుకు ఏడాదికి రూ.20వేలు ఇస్తాం. పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తామన్నారు.
పేదవారిని ధనికులుగా చేయాలన్నది తన సంకల్పమని, దాని కోసం 'పూర్ టు రిచ్' కార్యక్రమం అమలుచేస్తామని చంద్రబాబు మహానాడులో తెలిపారు. 'రాష్ట్రంలో పేదవారు లేకుండా ప్రతి ఒక్కరినీ ధనికులుగా చేసే బాధ్యతను టీడీపీ తీసుకుంటుందన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు, ప్రజల భాగస్వామ్యంతో అమలు చేస్తామన్నారు.
మళ్లీ అదే బాటలో వెళ్లాల్సిందే కదా….
ప్రభుత్వ ఉద్యోగులకు జీతాల చెల్లింపు, రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలకు నిధుల కేటాయింపుతో పాటు ప్రత్యక్ష, పరోక్ష నగదు బదిలీ పథకాలకు కావాల్సిన ఆర్ధిక వనరులు లేకపోవడంతో కేంద్ర ప్రభుత్వంపై ఆధారపడాల్సి వస్తోంది. రాష్ట్రంలో నాలుగేళ్లలో అప్పుల భారంగా కూడా గణనీయంగానే పెరిగింది. దాదాపు ఆరు లక్షల కోట్లకు పైగా ఏపీ అప్పులు చేరాయి. టీడీపీ లెక్కలో ఈ సంఖ్య ఇంకా ఎక్కువే ఉంది.
జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు పోటీగా అంతకంటే ఎక్కువ లబ్ది చేకూరుస్తానని హామీలిచ్చేశారు. ఇన్నాళ్లు జగన్ చేస్తున్నది తప్పని చెప్పి మళ్లీ అదే బాటలో పయనించడానికి రెడీ అయిపోవడాన్ని చంద్రబాబు ఎలా సమర్థించుకుంటారో చూడాలి.