Vijayawada Railway Security: పేరుకు ఎన్‌ఎస్‌జి-1 హోదా,బెజవాడ రైల్వే స్టేషన్‌లో కనీస భద్రత కరువు,17మందితో జిఆర్పీ విధులు
Vijayawada Railway Security: ఏటా కోటి 69 లక్షల మంది ప్రయాణికుల రాకపోకలతో అత్యంత రద్దీగా ఉండే విజయవాడ రైల్వే స్టేషన్‌లో కనీస భద్రత కరువైంది. విజయవాడ జిఆర్పీ స్టేషన్‌కు 70మంది పోలీసుల్ని కేటాయిస్తే అందులో 17మంది మాత్రమే ప్రస్తుతం విధుల్లో ఉన్నారు.ఆదాయం తప్ప భద్రత గురించి ప్రభుత్వానికి పట్టడం లేదు.
Vijayawada Railway Security: విజయవాడ రైల్వే స్టేషన్‌కు భారతదేశంలోని టాప్ 28 రైల్వే స్టేషన్లలో ఒకటి. దేశంలోని ప్రముఖ రైల్వే స్టేషన్లలో ఒకటిగా ఇప్పటికే ఎలైట్ గ్రూప్‌లో చేరింది. నిత్యం లక్షలాది మంది రాకపోకలు సాగించే రైల్వే స్టేషన్‌లో విధులు నిర్వర్తించే పోలీసుల సంఖ్య కేవలం 17 మాత్రమే. విజయవాడ జంక్షన్ జిఆర్పీ స్టేషన్‌కు 70మంది సిబ్బంది కేటాయింపు ఉన్నా అది కాగితాలకే పరిమితం అయ్యింది.
విజయవాడ రైల్వే స్టేషన్ ఏటా రూ.500 కోట్ల వార్షిక ఆదాయాన్ని ఆర్జిస్తూ దేశంలోనే ఎలైట్ స్టేషన్లలో ఒకటిగా గుర్తింపు పొందింది. నాన్ సబర్బన్ గ్రూప్‌లో NSG-1 కేటగిరీ హోదాను పొందిన రైల్వే స్టేషన్‌గా చరిత్ర సృష్టించింది. ఈ హోదాతో విజయవాడ దేశంలోని టాప్ 28 స్టేషన్లలో ఒకటిగా నిలిపింది, వ్యాపార మరియు వాణిజ్య కార్యకలాపాలకు కీలకమైన కేంద్రంగా గుర్తింపు పొందినా భద్రతలో దాని స్థానం మాత్రమం నానాటికి దిగజారిపోతోంది. ఇటీవల రైల్వే లోకో పైలట్ హత్యోదంతంతో రైల్వే సిబ్బందిలో కూడా భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది.
2017-18లో ప్రవేశపెట్టిన కొత్త వర్గీకరణ విధానం రూ. 500 కోట్ల కంటే ఎక్కువ వార్షిక ఆదాయం లేదా 20 మిలియన్ల ప్రయాణీకులను కలిగి ఉన్న స్టేషన్‌కు NSG-1 హోదాను కేటాయిస్తారు. విజయవాడ రైల్వే స్టేషన్ 2017-18లో రెండు ప్రమాణాలలోనూ ఈ హోదా దక్కించుకోలేకపోయింది. NSG-2 హోదాకు పరిమితం అయ్యింది.
5 ఏళ్ల తర్వాత నిర్వహించిన 2023-24 తాజా సమీక్షలో విజయవాడ స్టేషన్‌లో అత్యధికంగా రూ. 528 కోట్ల వార్షిక ఆదాయం సమకూరింది. 2023-24లో దాదాపు 16.84 మిలియన్ల మంది ప్రయాణికులను విజయవాడ నుంచి రాకపోకలు సాగించారు. అంటే సగటున రోజుకు 50వేల మంది ప్రయాణించారు. NSG-1 ప్రమాణాలను మించి ఫలితాలను సాధించినా భద్రత విషయంలో మాత్రం అధికారులు పట్టనట్టు వ్యవహరిస్తున్నారు.
దక్షిణ మధ్య రైల్వే లో సికింద్రాబాద్ తర్వాత NSG-1 హోదా సాధించిన రెండవ స్టేషన్‌గా విజయవాడ రైల్వే స్టేషన్ గుర్తింపు పొందింది. అయితే భద్రత విషయంలో ఉత్తర, దక్షిణ భారతదేశాలను కలిపే కీలక కూడలిలో కేవలం 17మంది సిబ్బందితో కార్యకలాపాలు సాగిస్తున్నారు.
దీంతో గంజాయి రవాణా మొదలుకుని, అక్రమ రవాణా, పన్నులు చెల్లించని వస్తువుల రవాణా యథేచ్ఛగా సాగుతోంది. స్టేషన్లో ఉన్న అతికొద్ది మంది సిబ్బందితో 10ప్లాట్‌ఫామ్‌లు, ఐదు టెర్మినళ్లపై నిఘా ఉంచడం సాధ్యం కావట్లేదు. దీంతో అసాంఘిక శక్తులకు రైల్వే స్టేషన్ కేంద్రంగా మారింది. ఇటీవల ప్లాట్‌ఫామ్ సమీపంలో డ్యూటీలో ఉన్న లోకో పైలట్‌ను డబ్బు కోసం హతమార్చం సిబ్బందిలో ఆందోళనకు కారణమైంది.
విజయవాడ రైల్వే స్టేషన్‌కు ప్రతిరోజూ దాదాపు 250 ప్యాసింజర్ రైళ్లు, దాదాపు 70 గూడ్స్ రైళ్లు రాకపోకలు సాగిస్తుంటాయి. ఇన్ని రైళ్లపై నిఘా ఉంచడం సాధ్యం కావట్లేదు. సిబ్బంది కొరత, పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లా పోలీసులు, విజయవాడ కమిషనరేట్ నుంచి సిబ్బంది కేటాయింపులు లేకపోవడంతో పర్యవేక్షణ సాధ్యం కావట్లేదని పోలీస్ ఉన్నతాధికారులు చెబుతున్నారు. నేరాలు జరిగినపుడు మాత్రమే కొద్ది రోజులు హడావుడి చేయడం ఆ తర్వాత మళ్లీ మొదటికి రావడం సాధారణమైపోయిందని జిఆర్పీ వర్గాలు చెబుతున్నాయి.