AP CM YS Jagan : ఏపీ విద్యుత్ సంస్థలకు 3 జాతీయస్థాయి అవార్డులు - అభినందించిన సీఎం జగన్-ap cm ys jagan appreciates ap electricity boards on winning 3 national awards ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Cm Ys Jagan : ఏపీ విద్యుత్ సంస్థలకు 3 జాతీయస్థాయి అవార్డులు - అభినందించిన సీఎం జగన్

AP CM YS Jagan : ఏపీ విద్యుత్ సంస్థలకు 3 జాతీయస్థాయి అవార్డులు - అభినందించిన సీఎం జగన్

HT Telugu Desk HT Telugu
Jan 02, 2023 08:43 PM IST

AP CM YS Jagan : ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ సంస్ధలు జాతీయ స్ధాయిలో అవార్డులు గెలుచుకోవడంపై ఆ సంస్ధల ఉన్నతాధికారులను సీఎం వైఎస్ జగన్ అభినందించారు.

ఏపీ విద్యుత్ సంస్థలకు అవార్డులు
ఏపీ విద్యుత్ సంస్థలకు అవార్డులు

AP CM YS Jagan : విద్యుత్‌ సమర్థ వినియోగంలో ఆంధ్రప్రదేశ్ జాతీయ స్ధాయిలో మూడు అవార్డులు గెలుచుకుంది. సమర్థవంతమైన నిర్వహణతో మెరుగైన ఫలితాలు రాబట్టిన ఏపీ విద్యుత్ సంస్థలు.. జాతీయ స్థాయిలో పురస్కారాలు దక్కించుకున్నాయి. ఇటీవల ఢిల్లీలో నిర్వహించిన 15వ ఎనర్షియా అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో ఎనర్జీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ మరియు డెవలప్‌మెంట్‌ విషయంలో దేశంలోనే అత్యుత్తమ రాష్ట్రంగా ఏపీ ఎంపికైంది. దీంతోపాటు దేశంలోనే అత్యుత్తమ ట్రాన్స్‌మిషన్‌ యుటిలిటీగా ఏపీ ట్రాన్స్‌కో ఎంపికైంది. అలాగే న్యూ అండ్‌ రెన్యూవబుల్‌ ఎనర్జీ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ ఉత్తమ పునరుత్పాదక కార్పొరేషన్‌లలో ఒకటిగా ఎనర్షియా అవార్డును గెలుచుకుంది. ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో... ఏపీ విద్యుత్ శాఖ అధికారులు అవార్డులు అందుకున్నారు.

ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కే.విజయానంద్, ఏపీ ట్రాన్స్‌కో సీఎండీ బి. శ్రీధర్, ఎన్‌ఆర్‌ఈడీసీఏపీ వీసీ మరియు ఎండీ ఎస్‌. రమణా రెడ్డి... ట్రాన్స్‌కో జేఎండీ (హెచ్‌ఆర్‌డీ) ఐ. పృథ్వి తేజ్.. ఏపీసీపీడీసీఎల్‌ సీఎండీ పద్మాజనార్ధన్‌ రెడ్డి, ఏపీ ట్రాన్స్‌కో జేఎండీ (విజిలెన్స్‌) బి.మల్లారెడ్డి తదితరులు.. చీఫ్‌ సెక్రటరీ డాక్టర్‌ కేఎస్‌ జవహర్‌ రెడ్డి తో కలిసి సోమవారం క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ ను కలిశారు. అవార్డులని ముఖ్యమంత్రికి చూపించి.. వివరాలు తెలియజేశారు. ఈ సందర్భంగా... ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ సంస్ధల ఉన్నతాధికారులను సీఎం జగన్ అభినందించారు. మరింత ఉత్సాహంతో పనిచేయాలని... ప్రజలకు నాణ్యమైన విద్యుత్ అందించేందుకు సంస్థలన్నీ కృషి చేయాలని సూచించారు. విద్యుత్ సంస్థలకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు.

గృహనిర్మాణంపై క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించిన సీఎం జగన్.. ప్రభుత్వం నిర్మిస్తోన్న ఇళ్ల నిర్మాణం పూర్తియ్యే నాటికి విద్యుత్, నీరు, డ్రైనేజీ సదుపాయలు కచ్చితంగా కల్పించాలని అధికారులను ఆదేశించారు. కోర్టు వివాదాలతో నిర్మాణం ఆగిపోయిన చోట ప్రత్యామ్నాయాలు చూడాలని సూచించారు. ఈ సందర్భంగా.. రాష్ట్రవ్యాప్తంగా హౌసింగ్ శాఖ ప్రగతిని అధికారులు సీఎంకు వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా ఇళ్ల నిర్మాణం వేగంగా సాగుతోందని.. ఏపీ టిడ్కో కాకుండా ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో ఇళ్ల నిర్మాణం కోసం రూ. 6,435 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేసిందని వివరించారు.

జనవరి 1 నుంచ 7వ తేదీ వరకు వారం రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తోన్న పెన్షన్ కానుక వారోత్సవాల భాగంగా... జనవరి 3న రాజమండ్రిలో జరగనున్న పెంచిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొననున్నారు. వైఎస్సార్ పెన్షన్ కానుక పేరిట.. అవ్వా తాతలు, వితంతువులు, చేనేత, కల్లు గీత కార్మికులు, మత్స్యకారులు, ఒంటరి మహిళలు, చర్మకారులు, హెచ్‌ఐవీ వ్యాధిగ్రస్తులకు ప్రభుత్వం ప్రతి నెలా పింఛన్లు పంపిణీ చేస్తున్న సంగతి తెలిసిందే. 2023, జనవరి 1 నుంచి పింఛన్ మొత్తాన్ని రూ. 2,750 కి పెంచి పంపిణీ చేస్తున్నారు.

Whats_app_banner