AP Skill Development Scam: స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో అర్జా శ్రీకాంత్?
AP Skill Development Scam ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో మాజీ ఎండీ అర్జా శ్రీకాంత్ పేరు తాజాగా తెరపైకి వచ్చింది. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీగా పనిచేసిన అర్జా శ్రీకాంత్‌కు సిఐడి నోటీసులిచ్చేందుకు సిద్దమైంది.మూడేళ్లుగా ఈ వ్యవహారంపై సిఐడి దర్యాప్తు చేస్తోంది.
AP Skill Development Scam ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ అర్జా శ్రీకాంత్‌కు నోటీసులిచ్చేందుకు ఏపీ సిఐడి సిద్దమవుతోంది. గత కొన్నేళ్లుగా స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వ్యవహారంలో భారీగా అక్రమాలు జరిగాయనే ఆరోపణలతో ప్రభుత్వం దర్యాప్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో త్వరలో మరికొందరికి నోటీసులు, కీలక వ్యక్తుల అరెస్ట్‌లకు సిఐడి సన్నద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది.
టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ పేరుతో భారీగా అక్రమాలు జరిగాయని సిఐడి ఆరోపిస్తోంది. అప్పటి సీమెన్స్ ఇండియా హెడ్‌గా ఉన్న సుమన్ బోస్ సహకారంతో అక్రమాలకు పాల్పడినట్లు గుర్తించారు. ఈ వ్యవహారంలో ఏపీ సీఐడీ అధికారులకు గ్లోబల్ సీమెన్స్ సంస్థ ఆధారాలను అందజేసింది.
భారీగా నిధుల మళ్లింపు…
దాదాపు రూ. 240 కోట్లు షెల్ కంపెనీలకు మళ్లించినట్టు సిఐడి గుర్తించింది. ఏపీ స్కిల్‌డెవలప్‌మెంట్ కుంభకోణం కేసు కీలక మలుపు తిరగబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. వందల కోట్ల అక్రమాలకు సంబంధించిన స్కామ్‌లో కీలకమైన వ్యక్తుల అరెస్టులకు రంగం సిద్ధమవుతోంది. ఈ కేసులో సీఐడీ విచారణలో మరిన్ని ఆధారాలు వెలుగు చూశాయి. త్వరలోనే మరి కొంతమందికి నోటీసులు ఇవ్వడంతోపాటు కీలక వ్యక్తుల అరెస్ట్‌లకు సీఐడీ సన్నద్ధం అవుతోందని తెలుస్తోంది.
గతంలో స్కిల్‌డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఎండీగా పనిచేసిన అర్జా శ్రీకాంత్‌కు నోటీసులు జారీ చేసేందుకు సీఐడీ సిద్ధమవుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్కిల్ డెవలప్‌మెంట్ సంస్థలో వెలుగులోకి వచ్చిన ఈ కుంభకోణంలో చంద్రబాబుతో పాటు ఆయన బినామీల పాత్ర ఉందని అధికార పార్టీ చాలాకాలంగా ఆరోపిస్తోంది.
చంద్రబాబు హయాంలో రాష్ట్రంలో యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇస్తామంటూ రూ.3300 కోట్లకు సీమెన్స్ సంస్థ - డిజైన్‌టెక్ సంస్థలు ఒప్పందం చేసుకున్నాయి. ఇందులో ప్రభుత్వం 10శాతం నిధులు, మిగిలిన 90 శాతం సీమెన్స్ సంస్థ చెల్లించేలా ఒప్పందం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున 10శాతం వాటాగా జీఎస్టీతో కలిపి రూ.370 కోట్లను చంద్రబాబు ప్రభుత్వం చెల్లించింది. ప్రభుత్వం చెల్లించిన రూ.370 కోట్లలో రూ.240 కోట్ల రూపాయలను సీమెన్స్ సంస్థ పేరుతో కాకుండా డిజైన్‌టెక్ సంస్థకు బదలాయించారు.
తమకు సంబంధం లేదన్న గ్లోబల్ సీమెన్స్…
మరోవైపు ఈ కుంభకోణానికి తమకు ఎలాంటి సంబంధంలేదని గ్లోబల్ సీమెన్స్ సంస్థ ప్రకటించింది. తమ సంస్థ పేరుతో తమ ఉద్యోగులే అక్రమాలకు పాల్పడినట్టు తమ ఇంటర్నల్ ఆడిట్‌లో గుర్తించినట్టు సీమెన్స్ సంస్థ సీఐడీ అధికారులకు ఆధారాలు సమర్పించింది.
రాష్ట్ర ప్రభుత్వం కట్టిన రూ. 370 కోట్లలో రూ.240 కోట్లను వేర్వేరు షెల్ కంపెనీలకు మళ్లించినట్టు సీఐడీ అధికారులు నిగ్గుతేల్చారు. ఎలైట్ కంప్యూటర్స్, స్కిల్లర్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్, నాలెడ్జ్ పోడియం, ఈటీఏ- గ్రీన్స్, కేడన్స్ పార్టనర్ తదితర కంపెనీలకు నిధులు మళ్లించారు. నాడు సీమెన్స్ సంస్థ ఇండియా హెడ్‌గా ఉన్న సుమన్ బోస్, డిజైన్‌టెక్ సంస్థ ఎండీగా ఉన్న వికాస్ కన్వికర్ ద్వారా కుంభకోణం నడిపించినట్టు సీఐడీ విచారణలో వెలుగుచూసింది. నిజానికి రూ.3300 కోట్ల ప్రాజెక్టుగా ఎంఓయూ చేసుకున్న చంద్రబాబు ప్రభుత్వం.. జీవోలో మాత్రం రూ.3300 కోట్ల ప్రస్తావనను తొలగించింది. చివరకు రూ.240 కోట్ల రూపాయలను షెల్ కంపెనీల ద్వారా మళ్లించేశారని ఆరోపిస్తోంది.
దర్యాప్తు చేస్తున్న కేంద్ర జిఎస్టీ బృందం…
ఈ కుంభకోణం 2016- 2018 మధ్య జరిగింది. దీనిపై గతంలోనే ఏసీబీకి పలువురు ఫిర్యాదు చేశారు. దీంతో అప్పటిప్రభుత్వం ఒప్పందానికి సంబంధించిన అసలు ఫైళ్లను మాయం చేశారనే ఆరోపణలు ఉన్నాయి. అధికారులను మేనేజ్ చేసే సమయంలో.. కేంద్రం ప్రభుత్వ జీఎస్టీ అధికారుల దర్యాప్తులో అసలు కుట్ర బయట పడింది. దీంతో ఈ స్కామ్‌పై కేంద్రం ఆదాయపుపన్ను శాఖ కూడా ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఈ వ్యవహారంపై అప్పటికే విచారణ జరుపుతున్న రాష్ట్ర సీఐడీ అధికారులు ఈ సంస్థలన్నింటితో సీఐడీ అధికారులు కో-ఆర్డినేట్ చేకుని విచారణ జరిపారు.
మరోవైపు గ్లోబల్ సంస్థ సీమెన్స్ ఇంటర్నెల్ టీంకూడా తమ కంపెనీ పేరుమీద మోసాలకు పాల్పడ్డారని.. తమకు ఎలాంటి సంబంధం లేదని పూర్తి ఆధారాలను సీఐడీకి అందజేసింది. ఈ కుంభకోణానికి సహకరించిన ఆనాటి అధికారులు కూడా కోర్టుకు ముందుకు వచ్చి స్టేట్‌మెంట్లు ఇచ్చారు. ఈ మేరకు త్వరలోనే స్కిల్‌డెవలప్మెంట్ కుంభకోణంలో పెద్దస్థాయిలో అరెస్టులకు సీఐడీ సిద్ధం అవుతోందని తెలుస్తోంది.
తనకు సంబంధం లేదంటున్న అర్జా శ్రీకాంత్..
మరోవైపు స్కిల్ డెవలప్‌మెంట్ వ్యవహారంలో తనకు సంబంధం లేదని మాజీ ఎండి అర్జా శ్రీకాంత్ స్పష్టం చేశారు. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండిగా మార్చి 2019లో జాయిన్ అయ్యానని చెప్పారు. సీమెన్స్ వ్యవహారంజరిగిన 2014 - 2017 మధ్య కాలంలో తాను ఏపీ భవన్‌లో కమిషనర్ గా విధుల్లో ఉన్నానని చెప్పారు. ప్రస్తుత ప్రభుత్వంలో సిఐడి అధికారలు తనను వివరాలు అడిగారని వివరించారు. సీమెన్స్ విభాగానికి చెందిన అన్ని వివరాలు క్రోడీకరించి సిఐడి వారికి అంద చేశానని స్పష్టం చేశారు. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ హోదాలో 2019 మార్చికి ముందు టైంలో వ్యవహారాలపై విచారణ చేసి నివేదిక ఇచ్చానని వెల్లడించారు. అందులో వారికి కొన్ని అనుమానాలు వచ్చాయని, ఇప్పటికే నోటిసులు ఇవ్వంతో మార్చి 9వ తేదీన విజయవాడ సిఐడి విభాగానికి వెళ్లి అవసరమైన క్లారిఫికేషన్ సాక్ష్యాలు ఇస్తానని చెప్పారు. గతంలో కూడా తాను సిఐడి విచారణకు హాజరైనట్లు వెల్లడించారు.