Anantapur Crime : జ్యూస్ లో మత్తు మందు కలిపి, బాలికపై లైంగిక దాడి-సహకరించిన మహిళా సెక్యూరిటీ గార్డ్!-anantapur crime minor girl molested in gurukula school by attender woman security guard helped ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Anantapur Crime : జ్యూస్ లో మత్తు మందు కలిపి, బాలికపై లైంగిక దాడి-సహకరించిన మహిళా సెక్యూరిటీ గార్డ్!

Anantapur Crime : జ్యూస్ లో మత్తు మందు కలిపి, బాలికపై లైంగిక దాడి-సహకరించిన మహిళా సెక్యూరిటీ గార్డ్!

Bandaru Satyaprasad HT Telugu
Jun 25, 2023 05:34 PM IST

Anantapur Crime : అనంతపురం జిల్లాలో దారుణ ఘటన జరిగింది. ఓ పాఠశాలలో బాలికకు జ్యూస్ లో మత్తు మందు కలిపి ఇద్దరు వ్యక్తులు లైంగిక దాడికి పాల్పడ్డారు

బాలికపై లైంగిక దాడి
బాలికపై లైంగిక దాడి

Anantapur Crime : జ్యూస్ లో మత్తు మందు కలిపి బాలికపై లైంగిక దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనలో నిందితులకు ఓ మహిళా సెక్యూరిటీ గార్డు సహకరించడం కొసమెరుపు. అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణంలో ఓ దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ పాఠశాలలో చదువుతున్న 8వ తరగతి బాలికపై లైంగిక దాడి జరిగిన ఘటన కలకలం రేపుతోంది. బాలికలకు రక్షణగా ఉండాల్సిన మహిళా సెక్యూరిటీ గార్డు సహకారంతో నిందితులు బాలికపై దారుణానికి పాల్పడ్డారని... బాలిక కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. బాలికపై ఇద్దరు వ్యక్తులు అత్యాచారం చేశారని, ఓ మహిళ వారికి సహకరించిందని బాలిక బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

జ్యూస్ లో మత్తు మందు కలిసి దారుణం

వేసవి సెలవులకు ముందు గురుకుల పాఠశాలలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఎనిమిదో తరగతి చదువుతున్న బాలికపై సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న జానకి అనే మహిళ.. జ్యూస్ లో మత్తు మందు కలిపి బాలికతో తాగించింది. బాలిక స్పృహ కోల్పోవడంతో... సెక్యూరిటీ గార్డు సాయంతో అటెండర్, మరో వ్యక్తి పాఠశాలలోని ఓ గదిలోకి తీసుకెళ్లి నోటిలో గుడ్డలు కుక్కి బాలికపై లైంగిక దాడి పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే అటెండర్ రామాంజనేయులు గత ఏడాదే మరో పాఠశాలకు బదిలీ అయ్యాడని, మహిళా సెక్యూరిటీ గార్డు సహకారంతో అతడు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని బాలిక కుటుంబ సభ్యులు తెలిపారు.

పోక్సో కేసు నమోదు

ఈ ఘటనపై బాలిక బంధువులు స్పందిస్తూ... పాఠశాలలు తిరిగి ప్రారంభమైనా బాలిక ఎందుకు స్కూల్ కు వెళ్లడంలేదని విచారిస్తే... తనపై జరిగిన దారుణాన్ని బాలిక చెప్పిందన్నారు. గత కొంతకాలంగా ఒంటరిగా ఉండడం, ఆహారం సరిగా తీసుకోకపోవడం, మగవాళ్లను చూస్తుంటే భయపడడంతో బాలికను వైద్యులకు చూపించామని తల్లిదండ్రులు తెలిపారు. వైద్యులు బాలికపై జరిగిన దారుణాన్ని తెలియజేయడంతో.. వెంటనే పోలీసులను ఆశ్రయించామన్నారు. బాలికలకు రక్షణగా ఉండాల్సిన మహిళా సెక్యూరిటీ గార్డు, అటెండర్ రామాంజనేయులు, మరో వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు చేశామని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు..విచారణ చేపట్టారు. నిందితులపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

సొంత తండ్రే అఘాయిత్యం

మహారాష్ట్ర ముంబైలో ఇటీవల అత్యంత దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. స్నేహితుడు రేప్​ చేసిన బాధతో కుమిలిపోతున్న ఓ బాలికపై.. ఆమె తండ్రి కూడా అత్యాచారానికి పాల్పడ్డాడు. ఫలితంగా 16ఏళ్లకే ఆమె గర్భం దాల్చింది. బాధితురాలికి.. కొంతకాలం క్రితం ఓ 32ఏళ్ల వ్యక్తితో పరిచయమైంది. వారిద్దరు ఒకే ప్రాంతంలో నివాసముంటారు. కొద్ది కాలంలోనే స్నేహితులయ్యారు. కాగా పెళ్లి చేసుకుంటానని చెప్పి, బాలికపై ఆ వ్యక్తి గత ఫిబ్రవరిలో రేప్​ చేశాడు. ఆ తర్వాత ఆమెను వదిలేశాడు. ఈ విషయం బయట చెప్పుకోలేక బాలిక కృంగిపోయింది. కొన్ని రోజుల తర్వాత బాలికపై మరోమారు అత్యాచారం జరిగింది. ఈసారి సొంత తండ్రే ఆమెను రేప్​ చేశాడు. ఇటీవలే బాలికకు కడుపులో నొప్పి మొదలైంది. ఈ విషయం తన తల్లికి చెప్పింది. ఆ మహిళ, తన బిడ్డను ఆసుపత్రికి తీసుకెళ్లింది. మైనర్​ గర్భం దాల్చిందని వైద్యులు చెప్పడంతో ఆ మహిళ షాక్​కు గురైంది. అప్పుడు బాలిక నిజం చెప్పింది. తల్లి ఫిర్యాదుతో ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. బాలిక తండ్రితో పాటు ఆమె స్నేహితుడిని అరెస్ట్​చేశారు.

Whats_app_banner