Richest Cm Jagan: దేశంలోనే సంపన్నుడైన సిఎం జగన్..-adr annual report says jagan mohan reddy is the richest chief minister in the country ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Richest Cm Jagan: దేశంలోనే సంపన్నుడైన సిఎం జగన్..

Richest Cm Jagan: దేశంలోనే సంపన్నుడైన సిఎం జగన్..

HT Telugu Desk HT Telugu
Apr 13, 2023 08:30 AM IST

Richest Cm Jagan: దేశంలోనే అత్యంత సంపన్నుడైన ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి నిలిచారు. అసోసియేషన్‌ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్‌ సంస్థ వార్షిక నివేదికలో ఈ విషయాన్ని ప్రకటించారు. రాజకీయాల్లోకి రాకముందే ముందస్తు పన్ను చెల్లింపుల్లో జగన్ ముందున్నారు. 2009లో అత్యధిక పన్ను చెల్లించి రికార్డు సృష్టించారు.

దేశంలోనే అత్యతం సంపన్నుడైన సిఎం జగన్మోహన్ రెడ్డి
దేశంలోనే అత్యతం సంపన్నుడైన సిఎం జగన్మోహన్ రెడ్డి (HT_PRINT)

Richest Cm Jagan: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి దేశంలోనే అత్యంత సంపన్నుడైన ముఖ్యమంత్రిగా నిలిచారు. రూ.510 కోట్ల ఆస్తులతో అత్యంత ధనవంతుడైన సిఎంగా జగన్‌ నిలిచారు. దేశవ్యాప్తంగా ఉన్న 30 మంది ముఖ్యమంత్రుల అందరి ఆస్తుల విలువ కలిపి రూ.1,018.86 కోట్లు ఉంటే, అందులో 50.09 శాతం ఆస్తులు ఏపీ సిఎం జగన్‌మోహన్‌రెడ్డి పేరు మీదే ఉన్నాయి.

దేశంలో మిగిలిన 29 మంది ముఖ్యమంత్రి ఆస్తుల విలువ కలిపి రూ.508 కోట్లు ఉంది. జగన్‌ మోహన్‌రెడ్డి ఆస్తి విలువ రూ.510.38 కోట్లుగా ఉంది. ఇందులో రూ.443 కోట్ల చరాస్తులు ఉండగా, మిగతావి స్థిరాస్తులు ఉన్నాయి. ప్రస్తుతం వివిధ రాష్ట్రాలకు నేతృత్వం వహిస్తున్న 30 మంది ముఖ్యమంత్రుల ఎన్నికల అఫిడవిట్ల ఆధారంగా అసోసియేషన్‌ ఆఫ్‌ డెమొక్రటిక్‌ రీఫామ్స్‌, నేషనల్‌ ఎలక్షన్‌ వాచ్‌ సంస్థలు సంయుక్తంగా ఈ వివరాలు వెల్లడించాయి.

తాజా ఏడిఆర్‌ జాబితా ప్రకారం.. పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీకి అందరి కంటే తక్కువగా రూ.15 లక్షల ఆస్తులు మాత్రమే ఉన్నాయి. సంపన్న ముఖ్య మంత్రుల జాబితాలో జగన్‌ తర్వాత రూ.163 కోట్ల ఆస్తులతో అరుణాచల్‌ ప్రదేశ్‌ సీఎం పెమా ఖండూ నిలిచారు. ఆ తర్వాత రూ.63 కోట్లతో ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌ మూడో స్థానంలో నిలిచారు.

దేశంలోని 28 రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలైన దిల్లీ, పుదుచ్చేరిలకు ముఖ్యమంత్రులు ఉన్నారు. కేంద్ర పాలిత ప్రాంతాల జాబితాలో చేరిన జమ్మూకశ్మీర్‌కు ప్రస్తుతం సీఎం లేరు. ఏడీఆర్‌ నివేదిక ప్రకారం.. 30 మంది ముఖ్యమంత్రుల్లో 13 మందిపై , మొత్తం సంఖ్యలో 43% మందిపై హత్య, హత్యాయత్నం, కిడ్నాప్‌, నేరపూరితమైన బెదిరింపు వంటి తీవ్రమైన నేరారోపణలు ఉన్నాయి. ఇవన్నీ అయిదేళ్లకు పైగా కారాగారశిక్ష పడే అవకాశమున్న నాన్‌ బెయిలబుల్‌ కేసులు.

అతి తక్కువ సంపద ఉన్న సిఎంల జాబితాలో మమతా బెనర్జీ తర్వాత కేరళ సీఎం పినరయి విజయన్‌ రూ.1.18 కోట్ల విలువైన ఆస్తులు మాత్రమే కలిగి ఉన్నారు. హరియాణా సీఎం మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ రూ.1.27 కోట్లు ఉన్నారు. బిహార్‌, దిల్లీ ముఖ్యమంత్రులు నీతీశ్‌ కుమార్‌, అరవింద్‌ కేజ్రీవాల్‌ల ఆస్తులు రూ.3 కోట్లకు పైగా ఉన్నాయని ఏడీఆర్‌ నివేదిక పేర్కొంది.

నాగాలాండ్ సీఎం నెయిఫియు రియో ఆస్తుల విలువ రూ.46 కోట్లు. పుదుచ్చేరి సీఎం ఎన్ రంగస్వామికి రూ.38 కోట్ల విలువైన సంపద ఉంది. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ కు రూ.17 కోట్లు, మేఘాలయ సీఎం కన్రాడ్ సంగ్మా కు రూ.14 కోట్లు విలువైన ఆస్తులు ఉన్నాయి. బీఆర్ఎస్ చీఫ్, తెలంగాణ సీఎం కే చంద్రశేఖర రావు ఆస్తుల విలువ రూ.23.5 కోట్లు కాగా, ఆయనకు రూ.8.8 కోట్ల అప్పులు ఉన్నాయి. ఎక్కువ అప్పులు ఉన్న ముఖ్యమంత్రుల్లో కేసీఆర్ తొలి స్థానంలోనూ, కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై రెండో స్థానంలోనూ ఉన్నారు. బొమ్మైకి రూ.4.9 కోట్ల అప్పులు ఉన్నాయి. బొమ్మై ఆస్తుల విలువ రూ.8.92 కోట్లు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే కు రూ.11.6 కోట్ల విలువైన ఆస్తులు, రూ.3.75 కోట్ల అప్పులు ఉన్నాయి.

 

Whats_app_banner