NTR District News : గుడివాడలో ఘారానా మోసం - రూ.1.5 కోట్లతో కి'లేడీ' జంప్, లబోదిబోమంటున్న బాధితులు
NTR District News : ఓ ఘరానా లేడీ కోటి రూపాయలకు పైగా నగదును కాజేసి ఘటన ఎన్టీఆర్ జిల్లాలో సంచలనంగా మారింది. ఆలస్యంగా విషయంగా తెలుసుకున్న బాధితులు…. పోలీసులను ఆశ్రయించారు.
NTR District Crime News: నమ్మి ఇచ్చిన సుమారు 1.5 కోట్ల రూపాయల భారీ నగదుతో కి'లేడి' జంప్ అయిపోయింది. ఈ ఘటన ఎన్టీఆర్ జిల్లా గుడివాడ మండలం మల్లాయపాలెం గ్రామ పరిధిలోని లక్ష్మీనగర్ కాలనీలో జరిగింది. నమ్మి మోసపోవడంతో బాధితులంతా లబోదిబోమంటున్నారు. బాపూజినగర్, లక్ష్మీనగర్ కాలనీ, చౌదరిపేట, ఆర్టీసీ కాలనీ, టిడ్కో కాలని, జగనన్న కాలనీ తదితర ప్రాంతాల్లో ఆ మాయలేడీ బాధితులు ఉన్నారు.
ఆర్థిక అవసరాలను ఎరగా చూపి వారికి రుణాలు ఇప్పించి అందులో కొంత చేబదులుగా తీసుకొని ఓ మహిళ పరారైన ఘటన గుడివాడలో చోటు చేసుకుంది. ఈ ఘటనలో సుమారు రూ.1.5 కోట్ల వరకు మాయలేడి కాజేసింది.
బాధితుల తెలిపిన వివరాల ప్రకారం.. గుడివాడ మండలం మల్లాయపాలెం గ్రామ పరిధిలోని లక్ష్మీనగర్ కాలనీలో లీలావతి అనే మహిళ నివాసం ఉంటోంది. ఆమె పలు బ్యాంకుల సిబ్బందితో మాట్లాడి పలువురికి రుణాలు ఇప్పించింది. అలాగే మైక్రో ఫైనాన్స్ సంస్థల ప్రతినిధులతోనూ ఆమెకు మంచి పరిచయాలున్నాయి.
ఈ నేపథ్యంలో మైక్రో ఫైనాన్స్ సంస్థల్లో రుణాల కోసం పలు గ్రూపులను తయారు చేసింది. మంజూరయ్యే రుణంలో కొంత సొమ్ము తనకు ఇస్తే తిరిగి ఇచ్చేస్తానంటూ పలువురికి మాయమాటలు చెప్పి నమ్మబలికింది. అలా మెల్లగా వారి సొమ్ములు కాజేయడం ప్రారంభించింది.
సుమారు 60 పైగా గ్రూపులను ప్రారంభించి వాటిలోని సభ్యుల నుంచి రూ.1.5 కోట్ల వరకు తీసుకొని తిరిగి ఇవ్వలేదు. చాలా మందికి చెందిన బంగారు ఆభరణాలు సైతం తాకట్టు పెట్టి విడిపించలేదని బాధితులు వాపోతున్నారు. తమ డబ్బుల గురించి అడిగితే బ్యాంకులకు కడతానని చెప్పిందని, కానీ కట్టలేదని పేర్కొన్నారు. దీంతో బ్యాంకు సిబ్బంది తమ ఇళ్లకు వచ్చి గొడవ చేస్తున్నారని బాధితులు ఆందోళన చెందుతున్నారు.
సుమారు 60 మందికి పైగా బాధితులు ఆమెకు డబ్బులు ఇచ్చారు. ఒక మైక్రో ఫైనాన్స్ సంస్థ ప్రతినిధికి చెందిన 3 కాసుల ఛైన్ రూ.65 వేలకు తాకట్టు పెట్టి పరారైంది.
ఈ వ్యవహారంలో లీలావతి కుమార్తె, కుమారుడు కూడా ఉన్నారు. లీలావతి ఇక్కడి నుంచి వెళ్లి హైదరాబాద్‌లోని మియాపూర్ లో ఉంటోందని తెలిసి పలువురు అక్కడకు వెళ్లారు. ఆమె ఇంటి వద్ద ఆందోళన చేసినా ఫలితం లేకపోయిందని బాధితులు వాపోతున్నారు.
దీనిపై స్థానిక ఎస్సై ఎన్. లక్ష్మీనరసింహమూర్తి మాట్లాడుతూ బాధితులు… రెండు రోజులుగా లీలావతి అనే మహిళ మోసం చేసిందని తిరుగుతున్నారని, పూర్తి ఆధారాలతో రావాలని వారికి సూచించామని అన్నారు. వారి వివరాల ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామన్నారు.