తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Suryapet Politics: సూర్యాపేటలో ఏం జరుగుతోంది ..? మంత్రి జగదీష్ రెడ్డికి కొత్త చిక్కులు

Suryapet Politics: సూర్యాపేటలో ఏం జరుగుతోంది ..? మంత్రి జగదీష్ రెడ్డికి కొత్త చిక్కులు

HT Telugu Desk HT Telugu

31 August 2023, 9:53 IST

    • Suryapet Politics: తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖా మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సూర్యాపేట నియోజకవర్గంలో ఏం జరుగుతోంది..? గడిచిన వారం రోజులుగా సూర్యాపేట జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు రాజకీయ ఆసక్తిని రెట్టింపు చేస్తున్నాయి.
మంత్రి జగదీష్‌ రెడ్డి
మంత్రి జగదీష్‌ రెడ్డి

మంత్రి జగదీష్‌ రెడ్డి

Suryapet Politics: సూర్యాపేటలో మంత్రి జగదీష్ రెడ్డికి ప్రధాన అనుచరునిగా ఉన్న డీసీఎమ్మెస్ ఛైర్మన్ వట్టె జానయ్య యాదవ్ తిరుగుబాటు చేయడానికి వ్యక్తిగత కారణాల కంటే కూడా రాజకీయ కారణాలే ఎక్కువగా ఉన్నాయన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఐపీఎస్ అధికారి ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ వట్టె జానయ్య యాదవ్ కు మద్దతుగా నిలవడంతో వచ్చే ఎన్నికల్లో సూర్యాపేట నియోజకవర్గం నుంచి వట్టె జానయ్య పోటీ చేయడం ఖాయమన్న అభిప్రాయం బలపడింది.

ట్రెండింగ్ వార్తలు

BC RJC CET Results 2024 : టీఎస్ బీసీ గురుకుల ఇంటర్ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల, రేపట్నుంచి కాలేజీల్లో రిపోర్ట్!

Bhongir Fire Accident : పెట్రోల్ బంక్ లో పేలిన లారీ డీజిల్ ట్యాంక్, తప్పిన పెను ప్రమాదం!

Sircilla Crime : పేగు బంధాన్ని తెంచుకున్న పేరెంట్స్, కూతురికి ఉరి వేసి హత్య!

Sundilla Parvathi Barrage : ఖాళీ అయిన సుందిళ్ల పార్వతి బ్యారేజీ, చేపల కోసం ఎగబడ్డ స్థానికులు

బీసీ వాదాన్ని తలకెత్తుకోవడంతోనే అసలు వివాదం మొదలైనట్లు చెబుతున్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రాన్ని ఆనుకుని ఉన్న గాంధీనగర్ గ్రామానికి జానయ్య యాదవ్ కాంగ్రెస్ పార్టీ తరపున గతంలో సర్పంచిగా పనిచేశారు. 2014లో గులాబీ కండువా కప్పుకున్న ఆయన ఆ తర్వాత ఎంపీపీ కూడా అయ్యారు. ప్రస్తుతం గాంధీనగర్ సూర్యాపేట మున్సిపాలిటీలో విలీనం కావడంతో.. గాంధీనగర్ వార్డు నుంచి జానయ్య భార్య అధికార పార్టీ తరపున కౌన్సిలర్ గా గెలిచారు. మంత్రి జగదీష్ రెడ్డికి అత్యంత దగ్గరి అనుచరుడిగా ఉన్న జానయ్య యాదవ్ ప్రస్తుతం ఉమ్మడి జిల్లాకు డీసీఎమ్మెస్ చైర్మన్ గా ఉన్నారు.

ఎక్కడ తేడా వచ్చింది..?

బీఆర్ఎస్‌ను వీడి కాంగ్రెస్ లో చేరిన ఖమ్మం జిల్లా నాయకుడు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి, నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశానికి జానయ్య కాస్త దగ్గరగా ఉన్నారు. చాలా కాలంగా రాజకీయాల్లో, రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లో ఉన్న ఆయన ఆర్ధికంగా బాగా ఎదిగారు. ఈ సారి ఎన్నికల్లో సూర్యాపేట నియోజకవర్గం నుంచి తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలన్న నిర్ణయానికి వచ్చిన జానయ్య యాదవ్.. బీసీ నినాదాన్ని ఎత్తుకోవడం కుంపటి రాజేసినట్లు కనిపిస్తోంది.

ఇప్పటికి రెండు పర్యాయాలు సూర్యాపేట నుంచి గెలిచిన జగదీష్ రెడ్డి 2014, 2018లో ఎన్నికైన తెలంగాణ ప్రభుత్వాల్లో మంత్రిగా ఉన్నారు. మూడో సారి హ్యట్రిక్ విజయంపై కన్నేసిన ఆయన ఈ మేరకు ఏర్పాట్లలో ఉన్నారు. బీఆర్ఎస్ నాయకత్వం ఈ సారి కూడా ఆయననే అభ్యర్థిగా ప్రకటించింది.

జిల్లాలో యాదవ నాయకునిగా గుర్తింపు ఉన్న జానయ్య అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని భావించడం, ఆ మేరకు ప్రకటనలు ఉండడం కూడా మంత్రికి ఆగ్రహం తెప్పించాయి. ఇదే సమయంలో జానయ్య తమకు బెదిరించి భూ కబ్జాలకు పాల్పడ్డారని పలువురు ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేయడం, పదుల సంఖ్యలో కేసులు నమోదు కావడంతో వివాదం ముదిరి పాకాన పడింది.

ఎన్నికల వేళ తలనొప్పి

హ్యాట్రిక్ విజయం కోసం ఎదురు చూస్తున్న మంత్రి జగదీష్ రెడ్డికి వట్టెజానయ్య యాదవ్ వివాదం ఎన్నికల ముందు తలనొప్పిగానే మారింది. ఇప్పటి దాకా చోటుచేసుకున్న పరిణామాలను విశ్లేషిస్తే.. వట్టె జానయ్య యాదవ్ బీఎస్పీ తరపున సూర్యాపేట నియోజకవర్గం నుంచి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉంది.

మరో వైపు సూర్యాపేటలో కాంగ్రెస్, బీజేపీలు కూడా విజయం కోసం వేచి చూస్తున్నాయి. గత రెండు ఎన్నికల్లో త్రిముఖ పోటీ వల్ల బీఆర్ఎస్ లబ్ధి పొందిందన్న విశ్లేషణలు కూడా ఉన్నాయి. ఈ సారి ఎన్నికల ఖర్చు బాగా పెట్టగలిగే స్థోమత ఉన్న జానయ్య యాదవ్ పోటీకి దిగితే సమీకరణలు మారే అవకాశం ఉంది.

ఇన్నాళ్లూ తన వెంట తిప్పుకున్న ప్రధాన అనుచురుడి విషయంలో జరుగుతున్న హడావిడిపై మంత్రి నుంచి పెద్దగా స్పందన కానరావడం లేదు. మంత్రి కావాలనే ఇబ్బందులకు గురి చేస్తున్నారని జానయ్య యాదవ్ అనుచరులు ఆరోపిస్తున్నారు.

ఈ వ్యవహారం అంతా ఈ ఏడాది చివరిలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కడ ప్రతికూల ఫలితాలను చూపిస్తుందో అన్న ఆందోళన అధికార పార్టీలోనూ కనిపిస్తోంది. సూర్యాపేట కేంద్రంగా జరుగుతున్న ఈ పరిణామాలు చివరకు ఎటు దారితీస్తాయి..? ఎవరికి లాభం జరుగుతుంది..? జానయ్య యాదవ్‌పై నమోదైన కేసుల్లో అరెస్టు అవుతాడా..? అరెస్ట్‌ అయితే, ఆయన అనుచరుల రియాక్షన్ ఎలా ఉంటుంది..? సూర్యాపేటలో అసలేం జరగనుంది.. అన్న ప్రశ్నలు ఉత్కంఠ రేపుతున్నాయి.

.

(రిపోర్టింగ్ క్రాంతీపద్మ, నల్లగొండ)

తదుపరి వ్యాసం