తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ku Adjunct Faculty: కేయూలో అడ్జంట్ ఫ్యాకల్టీ నియామకాలపై విజిలెన్స్ విచారణ.. వర్సిటీ ఆఫీసర్లలో టెన్షన్ టెన్షన్

KU Adjunct Faculty: కేయూలో అడ్జంట్ ఫ్యాకల్టీ నియామకాలపై విజిలెన్స్ విచారణ.. వర్సిటీ ఆఫీసర్లలో టెన్షన్ టెన్షన్

HT Telugu Desk HT Telugu

28 February 2024, 6:18 IST

    • KU Adjunct Faculty:  కాకతీయ యూనివర్సిటీ అక్రమ నియామకాల అడ్డాగా మారిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. యూనివర్శిటీలో అక్రమ నియామకాలపై Vigilance Enquiryతో అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. 
కాకతీయ యూనివర్శిటీలో ఫ్యాకల్టీ నియామకాలపై విచారణ
కాకతీయ యూనివర్శిటీలో ఫ్యాకల్టీ నియామకాలపై విచారణ

కాకతీయ యూనివర్శిటీలో ఫ్యాకల్టీ నియామకాలపై విచారణ

KU Adjunct Faculty: అనుమతులు లేని నియామకాలకు నెలకు రూ.8 లక్షలు అక్రమ నియామకాలకు చెల్లిస్తూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని యూనివర్సిటీ రిజిస్ట్రార్, వీసీ ప్రొఫెసర్ తాటికొండ రమేష్, రాష్ట్ర ఉన్నత విద్యాశాఖాదికారులను బాధ్యులుగా పేర్కొంటూ హైదరాబాదుకు చెందిన ఓ వ్యక్తి తెలంగాణ హైకోర్టు TS High Courtలో కేసు వేశారు.

ట్రెండింగ్ వార్తలు

BC RJC CET Results 2024 : టీఎస్ బీసీ గురుకుల ఇంటర్ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల, రేపట్నుంచి కాలేజీల్లో రిపోర్ట్!

Bhongir Fire Accident : పెట్రోల్ బంక్ లో పేలిన లారీ డీజిల్ ట్యాంక్, తప్పిన పెను ప్రమాదం!

Sircilla Crime : పేగు బంధాన్ని తెంచుకున్న పేరెంట్స్, కూతురికి ఉరి వేసి హత్య!

Sundilla Parvathi Barrage : ఖాళీ అయిన సుందిళ్ల పార్వతి బ్యారేజీ, చేపల కోసం ఎగబడ్డ స్థానికులు

ఒకటి కాదు రెండు కాదు మొత్తం 16 మందిని రెండు దశల్లో ఎలాంటి నిబంధనలు పాటించకుండా పాలక మండలి ఆమోదించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో వర్సిటీ అడ్జంట్ ఫ్యాకల్టీ నియామకాల్లో జరిగిన అవకతవకలు, నిధుల దుర్వినియోగంపై అసోసియేషన్ ఆఫ్ కాకతీయ యూనివర్సిటీ టీచర్స్(అకుట్) చేసిన ఫిర్యాదు మేరకు తాజాగా విజిలెన్స్ Vigilance అధికారులు విచారణ చేపట్టారు. ఇటీవల కాకతీయ యూనివర్సిటీని సందర్శించి, వివరాలు సేకరించారు.

నిబంధనలకు విరుద్ధంగా నియామకాలు

గతేడాది జనవరి 30న కాకతీయ యూనివర్సిటీలో 12 మంది అడ్జంట్ ఫ్యాకల్టీ(అనుబంధ అధ్యాపకులు)ని నియమించారు. ఆ తరువాత మార్చి నెలలో మరోసారి నలుగురిని నియమించుకున్నారు. రెగ్యులర్ టీచర్లకు ఇచ్చే జీత భత్యాల ఫండ్ నుండి ఈ అక్రమ నియామకాలకు ఒక్కరికి నెలకు రూ.50వేలు మొత్తం 16 మందికి నెలకు రూ.8 లక్షలు ఇవ్వడానికి ఉత్తర్వులు జారీ చేశారు.

ఈ నియామకాలలో 15 మంది రిటైర్ద్ అయిన యూనివర్సిటీ టీచర్లు, ఒక రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగిని ఎంపిక చేసుకున్నారు. వీరిలో రిటైర్ అయిన 15 మందిలో కొందరు కనీసం పీహెచ్డీ కూడా అవార్డ్ కాకపోవడం, కొందరిపైన క్రిమినల్ రికార్ధులు ఉండి గతంలో టెర్మినేషన్ అయినవారుండటం, కొందరు ప్రొఫెసర్లు కాకపోవడం, కొందరు వేరే కాలేజీల్లో పనిచేస్తున్నా కూడా వారిని నియమించడం, ఒక ప్రొఫెసర్ హైదరాబాద్ లోని ఒక ప్రైవేటు యూనివర్సిటీ రిజిస్ట్రార్ గా పనిచేస్తున్నా కేయూ లో నియమించడం ఇలా వివిధ అంశాల్లో అప్పట్లో తీవ్ర వివాదాస్పదమయ్యాయి.

అడ్జంట్ ఫాకల్టీ నియామకానికి యూజీసీ నిబంధనలు ఉన్నప్పటికీ వాటిని వీసీ రమేష్ పాటించలేదని, తన ఇష్టానుసారం 16 మందిని ఎంపిక చేసుకొని నియామకం చేశారని గతంలో ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఆ 16మందిలో ఇప్పటికే ఏడు గురు అడ్జంట్ ఫ్యాకల్టీలను తొలగించారు. మరో ఏడుగురి ఒక సంవత్సర కాలం పూర్తి అయిపొయింది. ప్రస్తుతం ఇద్దరు కొనసాగుతున్నారు.

అక్రమంగా నియామకాలు, ఇష్టారీతిన జీతభత్యాల చెల్లింపులపై ఒక ప్రైవేటు వ్యక్తి వీరి నియామకాలపై హైకోర్టులో కేసు వేయడం అప్పట్లోనే సంచలనం సృష్టించింది. యూజీసీ నిబంధనలే కాకుండా, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నత విద్యా శాఖా ఉత్తర్వులు, తెలంగాణ రాష్ట్ర యూనివర్సిటీ చట్టం–-1991 లను కూడా ఉల్లంఘించారని, వారి నియామకాలను తొలగించి అక్రమంగా చెల్లించిన మొత్తం రూపాయలు యూనివర్సిటీకి తిరిగి చెల్లించడంతో పాటు ఈ అక్రమ నియామకాలు చేపట్టిన వారిని శిక్షించాలని కోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. దీంతో కోర్టు నుంచి గతంలో రిజిస్ట్రార్కు, తాజాగా వీసీకి కూడా నోటీసులు అందాయి.

రాష్ట్ర ప్రభుత్వ విద్యాశాఖ ఉత్తర్వుల ఉల్లంఘన

రాష్ట్రంలోని యూనివర్సిటీలలో ఇలాంటి అక్రమ నియామకాలు జరుపుతున్నారని రాష్ట్ర ప్రభుత్వ ఉన్నత విద్యాశాఖ 2014లో ఒకసారి, 2021 లో మరొక సారి, 2023 లో మరోసారి ఉత్తర్వుల నెంబరు 1927/UE/A2/2021 ద్వారా 20.02.2023, 24.09.2021 , 27.08.2014 లలో వివిధ ఉత్తర్వులను జారీ చేసింది.

ప్రభుత్వ అనుమతి లేనిదే ఎటువంటి పార్ట్-టైం, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్, ఇతర టీచింగ్, నాన్-టీచింగ్ నియామకాలు జరపవద్దని ఉత్తర్వుల్లో పేర్కొంది. కానీ కేయూ వీసీ, రిజిస్ట్రార్ లు ఈ 16 మంది అడ్జంట్ ఫ్యాకల్టీ నియామకాల కోసం ఎటువంటి అనుమతులు ప్రభుత్వం నుండి తీసుకోకపోవడం గమనార్హం.

తెలంగాణా రాష్ట్ర యూనివర్సిటీల చట్టం 1991, సెక్షన్ 49 రెండవ పేరాగ్రాఫ్ ప్రకారం ఒక సంవత్సర కాలానికి యూనివర్సిటీల పాలక మండలి ఇలాంటి నియామకాల కోసం వీసీకి అధికారం ఇవ్వచ్చు కాని ఈ నియమాకం చేసేటప్పుడు ప్రభుత్వ అనుమతి తప్పనిసరి అని నిబంధనల్లో పేర్కొంది. అయినా ఎలాంటి ప్రభుత్వ అనుమతి లేకుండానే 16 మందిని నియమించుకున్నారనే ఆరోపణలున్నాయి.

అకుట్ ఫిర్యాదుతో కదలిక

ఇటీవల కాకతీయ యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ (అకూట్) ప్రతినిధులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉన్నత విద్యా శాఖ కార్యదర్శిని కలిసి అక్రమ నియామకాలు చేసిన వారిపై విచారణ చేసి చర్యలు తీసుకోవాలని కోరారు. దాంతోపాటు హైదరాబాద్ డైరెక్టర్ జనరల్ విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ కు కూడా ఫిర్యాదు చేశారు.

ఈ అక్రమ నియామకాలకు వెచ్చించిన మొత్తం సొమ్ము, బాధ్యులపై విచారణ కోసం హైదరాబాదు డైరెక్టర్ జనరల్ విజిలెన్స్ కార్యాలయం నుంచి హనుమకొండ విజిలెన్స్ కార్యాలయానికి సిఫార్సు చేయడంతో ఇక్కడి అధికారులు కాకతీయ యూనివర్సిటీలో విచారణ ప్రారంభించారు.

దీంతో వర్సిటీలో గందరగోళం ఏర్పడింది. కాగా విజిలెన్స్ విచారణ ఈ అక్రమ నియామకాలు జరిపిన వారిపై చర్యలు తీసుకొని వృథా అయిన ప్రజాధనం వెనుకకు తీసుకువస్తుందా లేదా అనేది వేచి చూడాలి.

(హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, వరంగల్ ప్రతినిధి)

తదుపరి వ్యాసం