తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ts Assembly Elections 2023 : మారిన నేతల స్థానాలు.. "సామాజిక కోణమే" కారణమా..?

TS Assembly Elections 2023 : మారిన నేతల స్థానాలు.. "సామాజిక కోణమే" కారణమా..?

HT Telugu Desk HT Telugu

28 October 2023, 14:10 IST

    • Khammam Congress Tickets : గత కొంత కాలంగా ఖమ్మం కాంగ్రెస్ రాజకీయం ఆసక్తికరంగా సాగుతోంది. కీలక నేతలు హస్తం గూటికి చేరటంతో టికెట్ల ఖరారుపై ఉత్కంఠ నెలకొంది. అయితే ఖమ్మం నుంచి తుమ్మల, పాలేరు నుంచి పొంగులేటి పేర్లు ఖరారు కాగా… దీని వెనక సామాజిక కోణం ఉందన్న చర్చ వినిపిస్తోంది.
ఖమ్మం కాంగ్రెస్
ఖమ్మం కాంగ్రెస్

ఖమ్మం కాంగ్రెస్

Khammam Congress Tickets : రాష్ట్రంలో భిన్నమైన రాజకీయాలకు వేదికైన ఖమ్మం జిల్లాలో టిక్కెట్ల కేటాయింపు విషయంలో కాంగ్రెస్ పార్టీ ఆచితూచి అడుగులేసింది. బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్న మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డిల గెలుపే లక్ష్యంగా సమీకరణాలను మార్చింది. ముఖ్యమంత్రి కేసీఆర్ తో అత్యంత సాన్నిహిత్యం కలిగిన తుమ్మల పాలేరు టిక్కెట్ ఆశించి భంగపడటంతో బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పారు. అయితే ఆయన కాంగ్రెస్ లో చేరేటప్పుడు కూడా పాలేరు టిక్కెట్ నే కోరుకున్నారు. అదే హామీ మేరకు తుమ్మల పార్టీలో జాయిన్ అయ్యారు. తుమ్మల పాలేరు బరిలో నిలిస్తే పొంగులేటిని ఖమ్మంలో మంత్రి అజయ్ పై పోటీకి నిలపాలని తొలుత అధిష్టానం భావించింది. కాగా సామాజిక వర్గ బలాబలాలను బేరీజు వేసుకున్న అధిష్టాన వర్గ పెద్దలు సమీకరణాలను అనూహ్యంగా మార్చాల్సి వచ్చింది.

ట్రెండింగ్ వార్తలు

Wardhannapet Govt Hospital : వర్ధన్నపేటలో దారుణం-ఫోన్లో డాక్టర్ డైరెక్షన్ గర్భిణీకి నర్సులు డెలివరీ, శిశువు మృతి

TS Universities VCs : తెలంగాణలో వీసీల నియామకంపై కసరత్తు, 10 యూనివర్సిటీలకు 1382 అప్లికేషన్లు

WhatsApp Triple Talaq : వాట్సాప్ లో భార్యకు ట్రిపుల్ తలాక్, ఆదిలాబాద్ లో వ్యక్తి అరెస్టు

TS Cabinet Meeting : తెలంగాణ కేబినెట్ భేటీకి ఈసీ అనుమతి, రేపు మధ్యాహ్నం సమావేశం

ఖమ్మంలో బీఆర్ఎస్ నుంచి దిగుతున్న మంత్రి అజయ్ "కమ్మ" సామాజిక వర్గానికి చెందినవారు. ఇక్కడ "రెడ్డి" సామాజిక వర్గానికి చెందిన పొంగులేటిని నిలిపితే ఫలితాలు భిన్నంగా వస్తాయని ఊహించారు. అలాగే గత ఎన్నికల్లో తుమ్మలపై పాలేరులో విజయం సాధించిన కందాల ఉపేందర్ రెడ్డి అక్కడ బలమైన శక్తిగా ఎదిగారు. ఈ అంశంతో పాటు "రెడ్డి" సామాజిక వర్గానికి చెందిన కందాలపై "కమ్మ" వర్గానికి చెందిన తుమ్మలను పోటీకి దించడం సరైంది కాదని భావించారు.

తుమ్మలను ఒప్పించి..

ఈ సమీకరణాలను పక్కాగా అంచనా వేసిన అధిష్టానవర్గ పెద్దలు ఆచితూచి అడుగేశారు. పాలేరు కోసం పట్టుపడుతున్న తుమ్మలను మెప్పించి, ఒప్పించి ఖమ్మంలో పోటీకి దిగేలా చేశారు. అలాగే ఖమ్మంలో మంత్రిపై పోటీకి దిగాలని భావించిన పొంగులేటిని పాలేరు పంపించేలా నిర్ణయం తీసుకున్నారు. ఈ మార్పు వల్ల ఇద్దరు అభ్యర్థులు గెలుపొందుతారని అధిష్టానం అంచనా వేసింది. ఈక్రమంలోనే శుక్రవారం విడుదలైన కాంగ్రెస్ రెండో జాబితాలో తుమ్మల టిక్కెట్టును ఖమ్మంలో, పొంగులేటికి పాలేరులో టిక్కెట్ కేటాయిస్తూ చోటు కల్పించారు.

రిపోర్టింగ్ - కాపర్తి నరేంద్ర, ఖమ్మం.

తదుపరి వ్యాసం